Student Visa: విద్యార్థి వీసా రద్దయితే ఇంటికేనా
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:31 AM
: అకస్మాత్తుగా వీసా రద్దు కావడం వల్ల పలువురు భారతీయ విద్యార్థులు స్వీయ బహిష్కరణకు గురవుతున్నారు. ఈ పరిస్థితిలో వారికి న్యాయ సహాయం కోసం ఇమిగ్రేషన్ లాయర్ల సంఘం సూచనలు జారీ చేసింది

15 రోజుల్లో వెళ్లిపోవాలని నిబంధన
అయోమయంలో భారత విద్యార్థులు
వర్సిటీలు, న్యాయవాదుల మద్దతుతో
కొంతమేర ఉపశమనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: గ్రీన్‌కార్డులు రద్దవుతున్నాయి. తాత్కాలిక వర్క్ వీసాలపై కత్తి వేలాడుతోంది... ఏఐ సాంకేతికతను వినియోగించి మరీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరిస్తున్నారు.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న చాలామంది భారతీయుల పరిస్థితి ఇదే. దీనికితోడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని.. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఇలా చిన్నచిన్న సాకులతోనూ భారత్ సహా పలువురు అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేస్తోంది. వీరంతా వీసా రద్దయిన 15రోజుల్లోగా స్వీయ బహిష్కరణ కింద సీబీపీ యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకొని, స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయో బాధిత విద్యార్థులకు ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికాలో మనోళ్లే అధికం
అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌కు చెందినవారే అత్యధికం. 2023-24లో అమెరికాలో 11,26,690 మం ది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం లభించడంతో పాటు 3,78,000 ఉద్యోగాల కల్పన జరిగింది. 2024 నవంబరునాటికి అమెరికాలోని చైనా విద్యార్థుల సంఖ్యను భారత్ అధిగమించింది. అయితే 2023తో పోలిస్తే 2024లో భారత విద్యార్థులకు ఆమోదించిన వీసాల సంఖ్య 34శాతం తక్కువ. ఇప్పుడు కాలేజీల్లో చదివే విద్యార్థుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. వలసదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరితో విద్యార్థి వీసాలను అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో లక్షలాది మంది భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాలస్తీనాకు మద్దతుగా క్యాంప్‌సల్లో చేపట్టిన ఆందోళనలకు మద్దతు పలికారన్న ఆరోపణలపై ఇటీవల కొందరు విదేశీ విద్యార్థులను దేశంనుంచి బహిష్కరించారు. ఇప్పుడీ నిరసనలతో ఏ సంబంధంలేకున్నా వీసాలు రద్దు చేస్తున్నారు. ఈ జాబితాలో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, మిచిగాన్, ఒహియో తదితర ప్రతిష్ఠాత్మక వర్సిటీలు, కాలేజీలున్నాయి.
ఇమిగ్రేషన్ లాయర్ల సంఘం నోట్
అకస్మాత్తుగా వీసా రద్దవడంతో పలువురు భారతీయ విద్యార్థులు స్వీయ బహిష్కరణకు గురవుతున్నారు. దీంతో బాధితులు న్యాయ సహాయం పొందాలని పలు విద్యాసంస్థలు సూచిస్తున్నాయి. ‘అంతర్జాతీయ విద్యార్థులపై ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు’అనే అంశంపై అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ల సంఘం ఇటీవల ఓనోట్ విడుదల చేసింది. అందులో స్టూడెంట్ అండ్ ఎక్స్‌చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సెవిస్) రికార్డు తొలగింపు అంశంలో విదేశీ విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశాలు న్నాయో వివరించింది. ఇక వీసా రద్దైన సమయంలో విద్యార్థులు ఏ ఉద్యోగం చేయడం, ఇంటర్న్‌షిప్‌లో, విద్యాసంబంధమైన ప్రాక్టికల్స్ శిక్షణలో పాల్గొనడం కుదరదు. ఎస్‌ఈవీఐఎస్ రికార్డును పునరుద్ధరణకు నిరాకరించిన సందర్భంలో దానిపై సమీక్షించే అధికారం ఇమిగ్రేషన్ న్యాయమూర్తులకు కూడా ఉండదు. విద్యార్థి వీసా రద్దయితే వారు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయడానికే అమెరికాలో ఉండటానికి అనుమతి లభిస్తుంది. అయితే తమపై ఉన్న కేసును సవాల్ చేసే హక్కు, సొంత ఖర్చులతో న్యాయ నిపుణులను నియమించుకొని కోర్టులో పోరాడే హక్కు వారికి ఉంటుంది. ఇక భారత విద్యార్థులు, దరఖాస్తుదారులకు ఇమిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఖన్నా మార్గదర్శకాలు జారీ చేశారు. విద్యార్థులు తమ ఈమెయిల్‌ను తాజా అప్‌డేట్ల కోసం నిరంతరం పర్యవేక్షించాలని, విద్యాసంస్థలో వారి అడ్మిషన్, అకడమిక్ స్టేట స్ రికార్డులు వెంట ఉంచుకోవాలన్నారు. వర్సిటీలు, ఇమిగ్రేషన్ న్యాయవాదుల మద్దతు అమెరికాలోని చాలామంది భారత విద్యార్థులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.