Share News

India China Relations: భారత్‌కు అరుదైన ఖనిజాలు, ఎరువులు సరఫరా చేసేందుకు చైనా అంగీకారం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:06 AM

బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో కీలకమైన అరుదైన ఖనిజాలను, కీలకమైన ఎరువులను భారత్‌కు సరఫరా చేసేందుకు చైనా ముందుకొచ్చింది..

India China Relations: భారత్‌కు అరుదైన ఖనిజాలు, ఎరువులు సరఫరా చేసేందుకు చైనా అంగీకారం

  • టన్నెల్‌ నిర్మాణ యంత్రాలు కూడా..

  • సరఫరా చేసేందుకు చైనా ఓకే

  • ప్రధాని మోదీ, అజిత్‌ దోవల్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ భేటీ

  • ఈ నెల 31న చైనా వెళ్లనున్న మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 19: బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో కీలకమైన అరుదైన ఖనిజాలను, కీలకమైన ఎరువులను భారత్‌కు సరఫరా చేసేందుకు చైనా ముందుకొచ్చింది. చైనా కంపెనీలు అరుదైన ఖనిజాలు, ఎరువులు, టన్నెల్‌ బోరింగ్‌ యంత్రాలను భారత్‌కు ఎగుమతి చేయడంపై ఉన్న నియంత్రణలను సడలించేందుకు అంగీకరించింది. ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమైన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఈ మేరకు హామీ ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ మంగళవారం ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చైనా, భారత్‌ మధ్య గల్వాన్‌ ఘటన అనంతర ఉద్రిక్తతలను తగ్గించడం, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం పునరుద్ధరణతోపాటు అమెరికా సుంకాల ప్రభావంపై వారు చర్చలు జరిపినట్టు తెలిసింది. ముఖ్యంగా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల తగ్గింపు కోసం చేపట్టిన ‘ప్రత్యేక ప్రతినిధుల (స్పెషల్‌ రిప్రజెంటేటివ్స్‌) చర్చల’ ప్రక్రియలో భాగంగా దోవల్‌తో వాంగ్‌యీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, సంబంధాలు మెరుగుపడుతున్నాయని ఈ సందర్భంగా దోవల్‌ పేర్కొన్నారు. ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆగస్టు 31న చైనా వెళ్లనున్నారని తెలిపారు.

Updated Date - Aug 20 , 2025 | 04:06 AM