ChatGPT: చాట్‌జీపీటీలో శృంగార కంటెంట్
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:28 AM
నీలి చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూడ్డానికి ప్రస్తుతం ప్రత్యేక....
డిసెంబరు నుంచి 18 ఏళ్లు నిండినవారికి అందుబాటులోకి
వాషింగ్టన్, అక్టోబరు 16: నీలి చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూడ్డానికి ప్రస్తుతం ప్రత్యేక వెబ్‌సైట్లు ఉన్నాయి! త్వరలో ‘ఆ’ తరహా కంటెంట్ చాట్‌జీపీటీ ద్వారా కూడా అందుబాటులోకి రానుంది!! అంటే.. యూజర్లు ఇచ్చిన ప్రాంప్ట్‌ల ఆధారంగా చాట్ జీపీటీ అశ్లీల కంటెంట్‌ను అందిస్తుందన్నమాట!! 18 ఏళ్లు నిండినవారికి.. కథలు, యానిమేషన్ చిత్రాలు, వీడియోలు.. ఇలా ఏ రూపంలో కావాలంటే ఆ రూపం లో ఎరోటిక్ కంటెంట్‌ను అందిస్తామని చాట్‌జీపీటీని తయారుచేసిన ‘ఓపెన్ ఏఐ’ చీఫ్ శామ్‌ఆల్ట్‌మన్ స్వయంగా ప్రకటించారు. ‘‘‘అడల్ట్స్‌ను (18 ఏళ్లు నిండినావరిని) అడల్ట్స్‌లాగానే చూస్తాం’ అనేది తమ సిద్ధాంతమని, అందులో భాగంగానే డిసెంబరు నుంచి ‘పెద్దలకు’ ఎరోటిక్ (శృంగారపరమైన) కంటెంట్‌ను అందిస్తాం’’ అని ఆయన గొప్పగా చెప్పుకొన్నారు. అయితే, చాట్‌జీపీటీలో వచ్చే ఆ తరహాకంటెంట్‌లో అసలైన వ్యక్తులెవరూ ఉండరు. అంతా ఏఐ జనితమే! కృత్రిమ శృంగారమే!! కాగా.. టెస్లా చీఫ్ ఈలన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్ ఏ1’ అభివృద్ధి చేసిన గ్రోక్ చాట్‌బాట్‌లో త్రీడీ యానిమేటెడ్ కంపానియన్స్ ద్వారా ఈ తరహా కంటెంట్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. సదరు చాట్‌బాట్ గర్ల్‌ఫ్రెండ్స్.. వినియోగదారులతో శృంగార సంభాషణలు చేస్తుంటాయి. గ్రోక్ ఇమాజిన్ అనే టూల్ ద్వారా చిన్నచిన్న వీడియోలు కూడా తయారుచేయొచ్చు. నిజానికి.. శృంగారపరమైన కంటెంట్‌కు ఓపెన్‌ఏఐ మొదట్నుంచీ కావాలనే దూరంగా ఉంది. కానీ, గ్రోక్ తో పోటీలో వెనకబడిపోతున్నందునే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని పలువురు విమర్శిస్తున్నారు.