Barack obama on Donald Trump: ట్రంప్ ఆరోపణలపై ఒబామా సీరియస్.. ఎప్‌స్టీన్ కేసు గురించి ప్రశ్న..
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:07 AM
ఓవల్ ఆఫీస్‌లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఒబామాను విచారిస్తున్నట్టు ఏఐ సహాయంతో రూపొందించిన వీడియోను కూడా ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రంప్ వైఖరిపై బరాక్ ఒబమా స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారని విమర్శించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack obama)పై తీవ్ర ఆరోపణలు చేసి ఆయన జైలుకు వెళ్లడం ఖాయం అని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. ఓవల్ ఆఫీస్‌లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు ఒబామాను విచారిస్తున్నట్టు ఏఐ సహాయంతో రూపొందించిన వీడియోను కూడా ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రంప్ వైఖరిపై బరాక్ ఒబామా స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారని విమర్శించారు.
ట్రంప్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఒబామా ప్రతినిధి పాట్రిక్ రోడెన్‌బుష్ ఓ ప్రకటన విడుదల చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు (Epstein case) సంబంధించిన ఫైళ్లను విడుదల చేయడంలో వైఫల్యంపై పెరుగుతున్న నిరసన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఒబామాపై ట్రంప్ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒబామాపై చేసిన ఈ విమర్శలు అర్థంలేనివని కొట్టిపడేశారు. ఆ ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ముందు ఎప్‌స్టీన్ స్కామ్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, గత వారం యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్ (Tulsi Gabbard) చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత బారక్ ఒబామా నేతృత్వంలోని కొందరు వ్యక్తులు కుట్రకు తెరలేపారని తుల్సీ గబ్బార్డ్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ట్రంప్ పాలనను నియంత్రించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయని, ఆ సమయంలో ఒబామా హయాంలో పని చేసిన వారందరినీ విచారించాలని తుల్సీ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..
సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..