America : రూ.10 వేల కోట్లు ఏజెంట్ల పాలు!
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:02 AM
‘‘అమెరికాలో ఫామ్‌హౌ్‌సలలో కొలువులు..!’’.. ‘‘ఏటా లక్షలు ఆర్జించొచ్చు..! రెండుమూడేళ్లలో పేదరికం నుంచి బయటపడొచ్చు..!’’.. అంటూ ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మిన యువకులు ఆస్తులమ్ముకుని, అప్పులు చేసి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా వారి చేతుల్లో పెట్టారు. ఏజెంట్ల డంకీ మార్గాల్లో(అడ్డదారుల్లో) అమెరికాకు వెళ్లి..

అడ్డదారుల్లో అమెరికాకు 18 వేల మంది
ఒక్కొక్కరి నుంచి సగటున రూ.50 లక్షల
వరకు వసూలు చేసిన ఏజెంట్లు
ఐరోపా మీదుగా మెక్సికోకు.. అడవుల్లో రోజుల
తరబడి నడక.. ఆ మార్గంలో అస్థిపంజరాలు
రూ.లక్షలు ఖర్చు పెట్టి వెళ్లి సంకెళ్లతో వచ్చాం
తిరిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలు
అక్రమ ఏజెంట్లపై కొరడాకు ‘పంజాబ్’ సిద్ధం
(సెంట్రల్ డెస్క్)
‘‘అమెరికాలో ఫామ్‌హౌ్‌సలలో కొలువులు..!’’.. ‘‘ఏటా లక్షలు ఆర్జించొచ్చు..! రెండుమూడేళ్లలో పేదరికం నుంచి బయటపడొచ్చు..!’’.. అంటూ ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మిన యువకులు ఆస్తులమ్ముకుని, అప్పులు చేసి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా వారి చేతుల్లో పెట్టారు. ఏజెంట్ల డంకీ మార్గాల్లో(అడ్డదారుల్లో) అమెరికాకు వెళ్లి.. చిక్కుల్లో పడ్డారు. అమెరికా సైనికులకు పట్టుబడి, రోజుల తరబడి చీకటి గదుల్లో మగ్గి.. కాళ్లు, చేతులకు సంకెళ్లతో డీపోర్ట్‌కు గురయ్యారు. ఇలా 18 వేల మంది వరకు భారతీయులను వెనక్కి తిప్పిపంపేందుకు అమెరికా సిద్ధమవ్వగా.. వీరి ద్వారా ఏజెంట్లు రూ.10 వేల కోట్లకు పైగా జేబులు నింపుకొన్నట్లు అంచనా..! ఒక్క పంజాబ్‌లోనే.. 8 వేల మంది యువకులు రూ.4 వేల కోట్లను పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే..! అమెరికాలోకి చొరబడి, గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్న వారు.. మెక్సికో సరిహద్దుల్లోనే చనిపోయిన వారి సంఖ్యకు అంచనాల్లేవు..!
ఇలా తరలిస్తారు..
అమెరికా తిప్పిపంపిన 104 మంది భారతీయుల్లో ఒకరైన హర్విందర్‌సింగ్.. ఏజెంట్ల నేరశైలిని మీడియాకు వివరించారు. హర్విందర్ స్వస్థలం పంజాబ్‌లోని తహ్లీ గ్రామం. కడుపేద కుటుంబం కావడం తో.. అమెరికా వెళ్లి, బాగా సంపాదించాలని హర్విందర్ అనుకున్నారు. పొరుగింటి కుర్రాడు ఐదేళ్ల క్రితం 10 పాసవ్వగానే.. ఏజెంట్ల ద్వారా అమెరికాకు వెళ్లి.. అక్కడ వ్యవసాయ క్షేత్రాల్లో పనికి కుదిరాడు. మూడేళ్లలో ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేలా సంపాదించాడు. దాంతో.. హర్విందర్ కూడా 8 నెలల క్రితం ఆస్తులమ్మి, అప్పులు చేసి, అమెరికా వెళ్లేందుకు రూ.42 లక్షలను ఏజెంట్ చేతు ల్లో పెట్టారు. గత నెల 15న అమెరికాలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే అమెరికా సైనికులు అరెస్టు చేశా రు. బుధవారం అమృత్‌సర్ తిరిగి వచ్చిన హర్విందర్.. ఏజెంట్ల మోసాలను గురించి మీడియాకు వివరించారు. ‘‘ఏజెంట్లు ఇటలీ, ఇతర చిన్న దేశాల్లో వర్క్ పర్మిట్లు ఇప్పించి, దుబాయ్ మీదుగా అక్కడికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఐరోపాకు.. అక్కడి నుంచి మెక్సికోకు తరలిస్తారు. మెక్సికో నుంచి డంకీ మా ర్గాల్లో అమెరికా సరిహద్దులను దాటిస్తారు. ఈ మా ర్గాలు భయంకరంగా ఉంటాయి. రోజుకు ఒక రొట్టెముక్క, రెండు బిస్కట్లతోనే సరిపెట్టుకోవాలి. మధ్య లో అనారోగ్యానికి గురైతే.. అంతేసంగతులు. అడవుల్లో రోజుల తరబడి ఉన్నాం. ఆ మార్గంలో ఎన్నో శవాలు కనిపించాయి. మెక్సికో-అమెరికా సరిహద్దుల్లోని 45 కిలోమీటర్ల కొండ మార్గాల్లోనూ అస్థిపంజరాలు కనిపించాయి’’ అని చెప్పుకొచ్చారు. తాను గత నెల 15న అమెరికాలో అడుగుపెట్టానని, ఆ తర్వాత మిలటరీ అరెస్టు చేసిందని చెప్పారు. చీకటి గదుల్లో మగ్గిపోయామని, అక్కడి జైళ్లలో అంతా అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ వారేనని పేర్కొన్నారు. జైళ్లలో కాళ్లు, చేతులను సంకెళ్లతో కట్టేస్తారని, అమృత్‌సర్ విమానాశ్రయానికి వచ్చేవరకు కూడా తనకు సంకెళ్లు ఉన్నాయని చెప్పారు.
డేరియన్ గ్యాప్ అడవుల్లో..
ఏజెంట్లు దుబాయ్ లేదా ఇటలీ వంటి దేశాలకు వర్క్ పర్మిట్లు తీసుకున్నాక.. అక్కడి నుంచి టూరిస్ట్ వీసా తేలిగ్గా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్-సాల్వడార్, గ్వాటెమాల వంటి దేశాలకు తీసుకెళ్తారు. కొలంబియా-పనామా మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం (సుమారు 100 కిలోమీటర్లు) మీదుగా ఉండే డేరియన్ గ్యాప్ నుంచి మెక్సికోకు తరలిస్తారు. డేరియన్ గ్యాప్ సాంతం చిత్తడి నేలలతో నిండి ఉండే దట్టమైన అడవి. క్రూరమృగాలు, విష సర్పాలకు నిలయం. ఈ 100 కిలోమీటర్లను కాలినడకన పూర్తిచేయడం ఓ సాహసమే. ఇందుకు 15 రోజుల సమయం పడుతుంది. ఈ అడవిని దాటాక.. మెక్సికోకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవులు, గుట్టల మీదుగా 45 కిలోమీటర్ల కాలినడక తర్వాత.. అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. డేరియన్ గ్యాప్, మెక్సికో-అమెరికా సరిహద్దుల్లోని అటవీ ప్రాం తాల్లో డ్రగ్స్ ముఠాలు, దోపిడీ ముఠాలు అక్కడికి వచ్చినవారిని వచ్చినట్లు దోచుకునేందుకు కాచుక్కూర్చుంటాయి. ఈ ముఠాలకు ఎదురు తిరిగితే.. చంపేందుకూ వెనకాడవు. ఇంతటి ప్రతికూల వాతావరణం ఉన్నా.. ఏటా సుమారు 5 లక్షల మంది అక్రమంగా అమెరికాలోకి చొరబడుతుంటారు. ఇలా వెళ్లేవారిలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, హైతీ, ఈక్వెడార్, వెనెజువెలా దేశాలకు చెందిన యువకులే ఎక్కువగా ఉంటారు. ఇప్పటి వరకు 18 వేల మంది భారతీయులు అక్రమంగా తమదేశంలోకి చొరబడ్డట్లు అమెరికా ప్రకటించగా.. వారిలో 8 వేల మందికి పైగా పంజాబీలు ఉండడం గమనార్హం..!
కాళ్లు చేతులకు సంకెళ్లు
భారత్‌కు తిప్పి పంపిన యువకులకు సంకెళ్లు వేశారంటూ.. కాదుకాదు.. అదంతా ఫేక్ అని విపక్షా లు, అధికార ఎన్డీయే మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అమృత్‌సర్ తిరిగి వచ్చిన బా ధితులు అసలు విషయం వెల్లడించారు. అమెరికాలో సైనిక విమానంలోకి ఎక్కించింది మొదలు.. తమ కాళ్లు, చేతులను గొలుసులతో బంధించారని పేర్కొన్నారు. అమెరికా కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం చీఫ్ మైఖేల్.డబ్ల్యూ.బ్యాంక్స్ కూడా అమృత్‌సర్‌కు బయలుదేరిన విమానంలో సంకెళ్లు వేసిన అక్రమ వలసదారులంటూ.. ఎక్స్‌లో ఫొటోలను షేర్ చేశారు.
ఆస్తులు, డబ్బు అంతా పోగొట్టుకున్నాం
మాది డేరాబస్సీ బ్లాక్‌లోని జడోత్ గ్రామం. మా అబ్బాయి ప్రదీప్ 12వ తరగతి పాసవ్వగానే అమెరికా పంపేందుకు భూములు అమ్మి రూ.42 లక్షలను ఏజెంట్ల చేతుల్లో పెట్టాను. మాది పేద కుటుంబం. పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. ప్రదీప్ అమెరికాలో సంపాదించి, మా కష్టాలు తీరుస్తాడనుకున్నాం. ఆర్నెల్ల క్రితం ఏజెంట్లతో వెళ్లిన ప్రదీ్‌పను అమెరికా ప్రభుత్వం తిప్పి పంపింది. ఇప్పుడు మేమేం చేయాలి? భూముల్లేవు, డబ్బుల్లేవు.
- నరీందర్ కౌర్, పంజాబ్
విమానం ఎక్కించి కాళ్లు చేతులకు సంకెళ్లు వేశారు
నా అమెరికా కల చెదిరిపోయింది. ఏజెంట్లు నిండా మోసం చేశారు. రూ.40 ల క్షలు తీసుకుని, అమెరికాకు పంపిస్తున్నామంటే.. అంతా సక్రమంగా ఉంటుందనుకున్నా. అప్పుచేసి, డబ్బులిచ్చా. ఐరోపాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి బ్రెజిల్‌కు.. ఆ తర్వాత కాలినడకన అమెరికా సరిహద్దులకు చేర్చారు. 2024 జూలైలో ఐరోపాకు వెళ్తే.. ఆర్నెల్లపాటు వేర్వేరు దేశాల్లోని డంకీ మార్గాల్లో తిప్పారు. పనామా అడవుల్లోనూ గడిపాను. అమెరికా సరిహద్దు దాటగానే.. సైనికులు అరెస్టు చేశారు. చీకటి గదుల్లో ఉంచారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పరు. చివరకు అమృత్‌సర్ వచ్చేప్పుడు కూడా విమానం ఎక్కించి, కాళ్లు, చేతులకు గొలుసులతో సంకెళ్లు వేశారు. కిందకు దిగేవరకు కూడా నాకు తెలియదు.. నేను భారత్‌కు వచ్చానని..!
- జస్పాల్ సింగ్, గురుదా్‌సపూర్
జైలులోనే సుఖ్‌పాల్!
రూ.45 లక్షలు చెల్లించి, నా కొడుకు సుఖ్‌పాల్‌ను 8 నెలల క్రితం అమెరికా పంపాను. ఏజెంట్లు తొలుత ఇటలీ వర్క్ పర్మిట్‌తో తీసుకెళ్లారు. నెలక్రితం అక్కడి నుంచి అమెరికాకు డంకీ మార్గాల్లో తరలించారు. 22 రోజుల క్రితం అమెరికాకు చేరుకున్నట్లు సుఖ్‌పాల్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వా త సమాచారం లేదు. బహుశా.. అక్కడి పోలీసులు జైలులో పెట్టారేమో..! మా అబ్బాయిని వెంటనే భా రత్‌కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
- ప్రేమ్‌కుమార్, ధారాపూర్ తండా(పంజాబ్)