U.S. visa: వీసా గడువు ముగిసినా అమెరికాలోనే
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:51 AM
వీసా గడువు ముగిసినా.. ఏడు వేల మంది భారతీయులు ఇంకా అమెరికాలోనే ఉన్నారని అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ జెస్సికా.ఎం.వాఘన్ తీసుకువెళ్లారు.

ఇదీ 7 వేల మంది భారతీయుల పరిస్థితి.. వీరిలో 2 వేల మంది విద్యార్థులు
అమెరికా కాంగ్రె్‌సకు ‘సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీ్‌స’ డైరెక్టర్ వాఘన్ నివేదిక
ఇకపై 75 వేల హెచ్-1బీలే.. 2 ఏళ్ల కాలపరిమితి.. పొడిగింపు 4 ఏళ్లకే
గ్రీన్‌కార్డు దరఖాస్తులకు ఆటోరెన్యువల్ వద్దు.. వాఘన్ ప్రతిపాదనలు
నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటనామో బేకు తరలిస్తాం: ట్రంప్
వాషింగ్టన్, జనవరి 30: వీసా గడువు ముగిసినా.. ఏడు వేల మంది భారతీయులు ఇంకా అమెరికాలోనే ఉన్నారని అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ జెస్సికా.ఎం.వాఘన్ తీసుకువెళ్లారు. వీరంతా స్టూడెంట్(ఎఫ్-1, ఎం-1) వీసాలు, ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసా(జే వీసా)లపై అమెరికాకు వచ్చారని, 2023లో వీరి వీసాల గడువు ముగిసిందని స్పష్టం చేశారు. ఈ 7 వేల మందిలో 2 వేల మంది విద్యార్థులున్నట్లు చెప్పారు. బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ నుంచి రెండేసి వేల మందికి పైగా విద్యార్థులు గడువు ముగిసినా.. అమెరికాలోనే నివసిస్తున్నట్లు కాంగ్రెస్ దృష్టికి తీసుకువచ్చారు. ‘‘32 దేశాలకు చెందిన విద్యార్థులు, ఎక్స్‌చేంజ్ విజిటర్లలో 20 శాతానికి పైగా వీసా గడువు దాటినా.. అమెరికాలోనే ఉంటున్నారు. ఎఫ్, ఎం కేటగిరీల్లో వీసాలు తీసుకున్నవారే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు’’ అని వాఘన్ పేర్కొన్నారు. కాగా.. హెచ్-1 వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఫుల్‌టైమ్ కోర్సులు చేసేవారు, స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునేవారికి జారీ చేస్తారు.
వృత్తివిద్య, నాన్-అకడమిక్ ప్రోగాములు చదివేవారికి ఎం1 వీసాలను అందజేస్తారు. వీసాల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో వ్యవస్థలో, చట్టాల్లో ప్రక్షాళన అవసరమని వాఘాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయాలి. వీసా గడువు ముగిశాక మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా గుర్తించి, వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను అభివృద్ధి చేయాలి. ఇందుకోసం కాంగ్రెస్ చట్టసవరణ చేయాలి. ప్రతి విద్యార్థి చదువు పూర్తవ్వగానే వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధపడాలి’’ అని సూచించారు. అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ వీసాల జారీని కఠినతరం చేయాలని వాఘాన్ అభిప్రాయపడ్డారు. ‘‘రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ వంటి వీసాలు అపరిమితంగా ఉండకూడదు. వాటి సంఖ్యను 75 వేల లోపునకు కుదించాలి. ఒకవేళ వీసా సబ్‌స్ర్కిప్షన్లు ఎక్కువగా ఉంటే.. అధికంగా వేతనాలు చెల్లించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలి.
హెచ్-1బీ గడువును రెండేళ్లకు నిర్ణయించాలి. అవసరాన్ని బట్టి మాత్రమే నాలుగేళ్లకు పొడిగించే వెసులుబాటు ఉండాలి. గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే.. ఆటోమేటిక్‌గా హెచ్-1బీ పొడిగింపు విధానాన్ని రద్దుచేయాలి’’ అని వ్యాఖ్యనించారు. స్టెమ్ కోర్సులు చేసిన అమెరికన్లలో ఆరింట ఒక వంతు మంది (20లక్షల మంది)ఎలాంటి ఉద్యోగాలు చేయడం లేదని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకునేందుకు వీసా విధానాలను ప్రక్షాళన చేయాలని సూచించారు. కాగా.. నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను ‘గ్వాంటానామో బే’కి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం ఆ మేరకు ప్రెసిడెన్షియల్ మెమోరండంపై సంతకం చేశారు. 30 వేల మంది సామర్థ్యమున్న గ్వాంటానామో బేలో ఇప్పటి వరకు ఉగ్రవాదులను నిర్బంధించేవారు. అక్రమ వలసదారులను ఆయా దేశాలు కట్టడి చేస్తాయనే నమ్మకం లేకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు.