Loneliness: డబ్ల్యూహెచ్‌వో సంచలన నివేదిక.. ప్రతి గంటకు 100 మంది..
ABN , Publish Date - Jul 02 , 2025 | 01:20 PM
ఈ వ్యాధి ప్రతి గంటకు 100 మందిని చంపుతోంది. ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమైనది? దీన్ని నివారించడానికి మార్గమేమిటి? అది ప్రజలను దాని బాధితులుగా ఎలా మారుస్తుందో తెలుసుకుందాం..
Loneliness: ఆధునిక యుగంలో జీవనశైలి చాలా మారిపోయింది. గతంలో ఉమ్మడి కుటుంబంతో ఉండటానికి ఇష్టపడేవారు ఇప్పుడు సోలోగా ఉండటమే సో బెటర్ అంటూ ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ, ఈ ఒంటరితనం ఇప్పుడు ప్రజల ప్రాణాలను తీస్తోంది. ఇటీవల WHO నివేదిక ఫ్రమ్ లోన్లీనెస్ టు సోషల్ కనెక్షన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలో ప్రతి గంటకు 100 మంది ఒంటరితనం కారణంగా మరణిస్తున్నారని పేర్కొంది. ఇది ఎంత ప్రమాదకరమైనది? దీనిని నివారించడానికి మార్గమేమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒంటరితనం వల్ల ఎలాంటి తేడా వస్తుంది?
WHO నివేదిక ప్రకారం, ఒంటరితనం మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్, అకాల మరణాల ప్రమాదం పెరుగుతుంది. కొత్త పరిశోధనల ప్రకారం, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. నగరాల్లో నివసించే యువత, ప్రజలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.
ఒంటరితనం ప్రమాదకరమా?
ఒక పరిశోధన ప్రకారం, కరోనా మహమ్మారి తర్వాత భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ 22% మంది ప్రజలు ఒంటరితనం అనుభవిస్తున్నారు. నివేదిక ప్రకారం, 16-24 సంవత్సరాల వయస్సు గల యువతలో 40% మంది ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఇది 65-74 సంవత్సరాల వయస్సు గల వృద్ధులలో 29 శాతం కంటే చాలా ఎక్కువ. దీనితో పాటు, ఒంటరితనంతో సహా మానసిక ఆరోగ్య సమస్యలు 2012-2030 మధ్య భారతదేశానికి $1.03 ట్రిలియన్ల ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని ఆర్థిక సర్వే 2024-25లో ప్రస్తావించింది.
భారత్‌లో ఒంటరితనం పెరుగుతోంది..
భారతదేశంలో ఒంటరితనం సమస్య ఆందోళనకరంగా ఉంది. నివేదిక ప్రకారం, దేశంలో 10.1% మంది ఈ సమస్యతో పోరాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం చాలా ఎక్కువగా ఉంది. కోవిడ్-19 తర్వాత పెరుగుతున్న సామాజిక దూరం, డిజిటల్ కనెక్షన్ కారణంగా ఒంటరితనం పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది. చిన్న కుటుంబాలు, పట్టణీకరణ, బిజీ జీవనశైలి కారణంగా ఈ సమస్య తీవ్రంగా మారుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో యువతలో ఒత్తిడి, ఒంటరితనం సమస్యలు పెరిగాయి.
ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
WHO ప్రకారం, ఒంటరితనం గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే, ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులతో ముడిపడి ఉంది. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా నిరాశ, ఆందోళన, ఆత్మహత్య ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఒంటరితనంతో పోరాడుతున్న వ్యక్తులు శారీరక, మానసిక స్థాయిలో బలహీనంగా మారతారు.
ఏం చేయాలి?
ఒంటరితనాన్ని తగ్గించడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమలు, సామాజిక సంబంధాలు చాలా ముఖ్యమైనవని నిపుణులు అంటున్నారు. ఇంట్లో ఉండటానికి బదులుగా పార్కులో నడవడం లేదా స్నేహితులను కలవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో యువత స్క్రీన్ సమయాన్ని తగ్గించి ఆఫ్‌లైన్ కార్యకలాపాల్లో పాల్గొనాలి. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read:
మీ భార్య తరచుగా కోపంగా ఉంటుందా.. ఇలా కూల్ చేయండి..
సహజ సౌందర్యానికి ముక్కుపుడక..దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
For More Health News