Women Health: జాగ్రత్త.. అధిక బరువు రొమ్ము క్యాన్సర్‌కు ప్రమాదం.. WHO తాజా హెచ్చరిక..!
ABN , Publish Date - Jul 24 , 2025 | 07:08 PM
రుతుక్రమం ఆగిన మహిళల్లో అధిక బరువు, రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతోందా? WHO తాజా అధ్యయనం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న మహిళలు, ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళల్లో బరువు ఎక్కువగా ఉన్నట్లయితే (అధిక BMI) రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా అధ్యయనంలో తెలిపింది. BMIలో ప్రతి 5 kg/m² పెరిగితే, గుండెజబ్బులు ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 31% పెరుగుతుంది. గుండెజబ్బులు లేనివారిలో ఈ ప్రమాదం 13% పెరుగుతుంది. బరువు ఎక్కువగా (అధిక BMI) ఉండటం వల్ల, టైప్ 2 షుగర్ ఉన్నా లేకపోయినా, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఒకే రకంగా పెరుగుతుందని WHO నివేదిక చెబుతోంది. అంటే షుగర్ కన్నా బరువు ఎక్కువగా ఉండటమే ఎక్కువ ముప్పుగా మారుతోంది.
ఈ అధ్యయనం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC) నేతృత్వంలో జరిగింది. ఇందులో యూరప్‌లోని EPIC, UK బయోబ్యాంక్ అనే డేటా ఆధారంగా 1.68 లక్షల మందికి పైగా రుతుక్రమం ఆగిన మహిళల ఆరోగ్య సమాచారం పరిశీలించారు. సగటుగా 10 సంవత్సరాలపాటు వీరి ఆరోగ్యాన్ని గమనించారు. ఆ కాలంలో 6,793 మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు.
బరువు ఎక్కువగా ఉండడం, గుండెజబ్బులు కలిపి ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణంగా పెరుగుతోంది. అంచనా ప్రకారం, ప్రతి లక్ష మంది మహిళల్లో సాధారణంగా వచ్చే సంఖ్యతో పోల్చితే, అదనంగా 153 కేసులు రొమ్ము క్యాన్సర్ వస్తున్నాయని WHO అధ్యయనంలో తెలిపింది. ఈ విషయాలు భవిష్యత్‌లో క్యాన్సర్ పరీక్షలు (స్క్రీనింగ్‌లు) ఎలా చేయాలో, వాటిని ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించడంలో ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు.
ముఖ్యగమనిక:
మహిళల ఆరోగ్యానికి బరువు నియంత్రణ చాలా అవసరం. ఇది కేవలం గుండె ఆరోగ్యం లేదా షుగర్ (డయాబెటిస్) కోసమే కాదు.. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా బరువు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే అవకాశమున్న మహిళలు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.
Also Read:
రోజూ ఈ 5 పనులు చేస్తే.. 90% సమస్యలు సాల్వ్..
పదే పదే జుట్టు దువ్వడం వల్ల పురుషులకు బట్టతల వస్తుందా?
For More Health News