Neem: వానాకాలం సమస్యలకు వేపతో చెక్
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:28 PM
వానాకాలంలో వచ్చే అనేక చర్మ సంబంధిత సమస్యలకు వేపతో చెక్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విశేషాలు ఏంటో కూలంకషంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సంప్రదాయక వైద్య విధానాల్లో వేపకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వానాకాలంలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలకు వేపకు మించిన పరిష్కారం లేదని అనుభవజ్ఞులు చెబుతారు. వేప నూనె, ఆకులు, పసరు ఇలా ఎన్నో రకాలుగా వేపను వినియోగించొచ్చు. వేపలో నింబిడిన్, అజాడిరెక్టిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి బయోయాక్టివ్ రసాయనాలు ఉన్నాయి. వీటి కారణంగా ఫంగల్, బ్యాక్టీరియల్ వ్యాధులతోపాటు ఇన్‌ఫ్లమేషన్ నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
వైద్యులు చెప్పే దాని ప్రకారం, వానాకాలంలో గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. వీటికి వేప చక్కని పరిష్కారం. వానాకాలంలో ఆక్నే సహజం. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు శ్వేదం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మ రంధ్రాలు మలినాలతో పూడుకుపోతాయి. ఇది చివరకు బ్లాక్ హెడ్స్, పింపుల్స్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. కానీ వేపలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా బ్యాక్టీరియా ఇబ్బంది తొలగి చర్మానికి సాంత్వన లభిస్తుంది.
చర్మంపై తెల్లని పొట్టు రేగడాన్ని ఎగ్జీమా అంటారు. ఈ సమస్య ఉన్న వారిని దురద కూడా వేధిస్తుంది. వానా కాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. వేపలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎగ్జీమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఫైటోకాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్, అజాడిరాడియోన్ కాంపౌండ్స్ ఎగ్జీమా తీవ్రం కాకుండా నిరోధిస్తాయి.
ఇక సోరియాసిస్ ఉన్న వారిలో చర్మంపై పొలుసులతో కూడిన ఎర్రటి ప్యాచెస్ ఏర్పడతాయి. దురద కూడా పెరుగుతుంది. వానాకాలంలో గాల్లోని తేమ కారణంగా సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే వేప పసరు చర్మానికి రాసుకుంటే సోరియాసిస్ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వేప నూనెలో గాయాలను త్వరగా మానేలా చేసే గుణం కూడా ఉంది.
వానాకాలంలో అథ్లెట్స్ ఫుట్, రింగ్ వార్మ్, కాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువవుతాయి. అయితే, వేపలోని యాంటీఫంగల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్యలకు సులువుగా చెక్ పెడతాయి. ఫంగస్ పెరుగుదలను అడ్డుకుని వ్యాధులను నిరోధిస్తాయి. కాబట్టి ఈ కాలంలో వచ్చే అనేక సమస్యలకు వేప మంచి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
గ్యాస్ట్రోఎంటిరాలజిస్టులు చెబుతున్న సూచనలు.. లివర్ క్యాన్సర్ ముప్పు తగ్గాలంటే..
హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..