Share News

Fatty Liver-Cancer Risk: ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్లకు క్యాన్సర్ ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ABN , Publish Date - Aug 18 , 2025 | 08:41 AM

ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్లు చేసే కొన్ని పొరపాట్లు లివర్ క్యాన్సర్ ముప్పును పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ పొరపాట్లు ఏమిటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Fatty Liver-Cancer Risk: ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్లకు క్యాన్సర్ ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Fatty Liver Cancer Risk

ఇంటర్నెట్ డెస్క్: కాలేయంలో కొవ్వు పేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ వ్యాధిగా పిలుస్తారు. ఇది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, ఈ వ్యాధి ఉన్న వాళ్లు చేసే కొన్ని తప్పుల కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పొరపాట్లు ఏమిటో, ఈ ముప్పును తగ్గించేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్లు ప్రాసెస్డ్ చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలు అస్సలు తినకూడదు. ఈ తరహా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ వల్ల లివర్‌లో కొవ్వులు మరింతగా పెరుగుతాయి. ఒకానొక అధ్యయనం ప్రకారం, చక్కెరలు అధికంగా ఉండే డ్రింక్స్ వల్ల ఫ్యాటీ లివర్ ముప్పు 40 శాతం అధికమని తేలింది. కాబట్టి, ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లొద్దని నిపుణులు చెబుతున్నారు.

శారీరక శ్రమ లేకుండా నిత్యం ఒకే చోట కూర్చుండిపోయే వారికి కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. శారీరక శ్రమ లేని సందర్భాల్లో కొవ్వుల వినియోగం తగ్గుతుంది. దీంతో, అధికంగా ఉన్న వీటిని శరీరంలోంచి తొలగించేందుకు లివర్‌ మరింతగా కష్టపడాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ముదిరితే సిర్రోసిస్, క్యాన్సర్ వంటి భయానక సమస్యలు వస్తాయి. ఈ ముప్పును తగ్గించుకునేందుకు వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఓ మోస్తరు స్థాయి ఎక్సర్‌సైజులు చేయాలని నిపుణులు చెబుతున్నారు.


బాగా వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో పేరుకుపోతే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. కొలెస్టెరాల్ అసాధారణ స్థాయిలో పెరుగుతుంది. కాలక్రమంలో క్యాన్సర్ ముప్పు ఇదే స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి, ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు ఆలివ్ ఆయిల్ లాంటి నూనెలు వాడాలని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాటీ లివర్ ఉన్న వారికి ఊబకాయం కూడా తోడయితే ముప్పు పలు రెట్లు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికబరువు కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి లివర్‌లో మరింత ఎక్కువగా కొవ్వులు పేరుకుంటాయి. కాబట్టి, ఫ్యాటీ లివర్ ఉన్న వారు ఆహారం విషయంలో కచ్చితమైన పరిమితులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్లు మద్యపానం, ధూమపానాన్ని వెంటనే మానేయాలి. వీటి వల్ల ఫ్యాటీ లివర్, సిర్రోసిస్‌గా ముదిరి చివరకు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. సిగరెట్స్‌లోని విషపూరిత పదార్థాలు లివర్‌ను నాశనం చేసి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. కాబట్టి, లివర్‌ను కాపాడుకునేందుకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..

Read Latest and Health News

Updated Date - Aug 18 , 2025 | 08:57 AM