Dont Rely On Books For Surgery: పుస్తకాలు చూసి సర్జరీలు చేయవద్దు
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:45 AM
పుస్తకాలు చూసి శస్త్రచికిత్సలు చేయవద్దని, పూర్తిస్థాయిలో అనుభవం వచ్చిన తర్వాతే చేయాలని
పూర్తి అనుభవం వచ్చాకే చేయాలి
లేకపోతే పేషంట్లకు ఇన్ఫెక్షన్లు, ఇతరత్రా సమస్యలు
ఇతర ఆపరేషన్లకు సౌందర్య శస్త్రచికిత్సలకు తేడా ఉంది
అందాన్ని మెరుగుపర్చాలేగానీ చెడగొట్టొద్దు
ప్లాస్టిక్ సర్జన్లకు డాక్టర్ సంజయ్ పరాశర్ పిలుపు
హైదరాబాద్‌లో ‘సేఫ్ ప్లాస్ట్-2025’ సదస్సు ప్రారంభం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పుస్తకాలు చూసి శస్త్రచికిత్సలు చేయవద్దని, పూర్తిస్థాయిలో అనుభవం వచ్చిన తర్వాతే చేయాలని ప్లాస్టిక్ సర్జన్లకు దుబాయికి చెందిన సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ పరాశర్ పిలుపునిచ్చారు. ‘మిగిలిన విభాగాలలో చేసే చికిత్సలు వేరు. ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు చేసే చికిత్సలు వేరు. కాస్త అందంగా కనపడాలని, ఉన్న లోపాన్ని సరిచేయించుకోవాలని వచ్చేవాళ్లకు మనం పూర్తి సంతృప్తి ఇవ్వగలగాలి. అంతేతప్ప ఉన్నదాన్ని మరింత చెడగొడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. చికిత్స తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా లైపోసక్షన్, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ముక్కు, గడ్డం, బుగ్గలు వంటివి సరిచేయించుకునే చికిత్సలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటివి చాలా సున్నితమైనవి. వీటి విషయంలో రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’ అని సూచించారు. హైటెక్ సిటీలోని టీ-హబ్ వేదికగా రెండురోజుల పాటు జరిగే ‘సేఫ్ ప్లాస్ట్-2025 సదస్సు’ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ పరాశర్ ప్రసంగించారు. ప్లాస్టిక్, ఈస్థటిక్ సర్జరీలు చాలా సంక్లిష్టమైనవని, నూటికి నూరుశాతం కృషిచేసినా కూడా కొన్ని సందర్భాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయన్నారు. సమగ్రమైన అనుభవం ఉంటేనే వాటిని అధిగమించగలమని, కేవలం పుస్తకజ్ఞానంతో సాధ్యం కాదని హితవు పలికారు. డాక్టర్ గురుకర్ణ వేముల మాట్లాడుతూ.. ఈ చికిత్సలు చేయించుకోవడానికి ముందు సరైన వైద్యులు, ఆస్పత్రుల గురించి పేషంట్లు సమాచారం సేకరించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లాంటివాటిలో నమోదయ్యారా అన్నది సరిచూసుకోవాలని సూచించారు. తగిన శిక్షణ లేని వాళ్లు చికిత్సలు చేయడం వల్ల పలురకాల సమస్యలు వస్తున్నాయన్నారు. సౌందర్య శస్త్రచికిత్సల గురించి మనదేశంలో వైద్యులకు ఇంకా శిక్షణ మెరుగుపడాలని, శిక్షణ కార్యక్రమాలు పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు అనుక్షణం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.