Share News

Early Signs of Heart Attack: గుండెజబ్బుకు ముందస్తు హెచ్చరికలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:42 AM

గుండె జబ్బు.. గుండె పోటు.. ఒకప్పుడు నడివయసు దాటిన తర్వాత వచ్చే హృదయ సంబంధ రుగ్మతలు

Early Signs of Heart Attack: గుండెజబ్బుకు ముందస్తు హెచ్చరికలు

  • పలు సంకేతాలను ఇచ్చే శరీరం.. వాటిని గమనించి అప్రమత్తం కాకపోతే ముప్పు

  • కడుపు, ఛాతీలో నొప్పి, మంట.. నడిచినా, మెట్లెక్కినా ఆయాసం

  • గుండెలో ఇన్ఫెక్షన్‌తో తీవ్ర జ్వరం

  • గ్యాస్ట్రిక్‌ సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు

  • సొంత వైద్యంతో ముప్పు: వైద్య నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గుండె జబ్బు.. గుండె పోటు..! ఒకప్పుడు నడివయసు దాటిన తర్వాత వచ్చే హృదయ సంబంధ రుగ్మతలు ఇప్పుడు చిన్నవయసు వారినీ వదిలిపెట్టట్లేదు. పట్టుమని మూడు పదులు కూడా దాటని యువత గుండెపోటుతో చనిపోతున్న ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. పనిభారం, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం.. కాలంతోపాటు పరుగులు తీసేలా వృత్తి, ఉద్యోగాలకు అంకితమవ్వడం వంటివి యువతలో గుండెపోటుకు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఇదేమీ అకస్మాత్తుగా జరిగిపోదని.. అలసిన గుండె ఆగిపోవడానికి ముందు శరీరం పలు హెచ్చరికలు జారీ చేస్తుందని.. వాటిని పెడచెవిన పెడితే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూనే కుప్ప కూలిపోవడం.. బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఉన్నఫళంగా పడిపోవడం.. కన్నడ సినీనటుడు పునీత్‌ డెడ్‌లిఫ్ట్‌ చేస్తూ చనిపోవడం వంటి ఘటనలు.. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగినవేనని చెబుతున్నారు.

ఇవీ సంకేతాలు..

గుండెపోటు రావడానికి ముందు చాలా సంకేతాలు కనిపిస్తాయని.. విపరీతమైన నీరసం వాటిలో ప్రధాన లక్షణమని వైద్యులు చెబుతున్నారు. ఆ నీరసం రోజంతా కష్టపడి పనిచేయడం వల్లనో, పని ఒత్తిడితో అలసిపోవడం వల్లనో వచ్చిందని భావిస్తారని, కానీ అది గుండె పోటుకు కూడా సిగ్నల్‌ కావొచ్చని పేర్కొన్నారు. నీరసంతోపాటు.. కడుపులో మంట.. ఛాతీ నొప్పి, కళ్లు మసకబారడం, ఆయాసం, బీపీ తగ్గడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. రక్తంలో క్రమంగా కాల్షియం పెరిగి, గడ్డ కట్టి రక్తనాళాలు బ్లాక్‌ అవ్వడంతో కొందరిలో గుండె వైఫల్యం సంభవిస్తుందని.. ఇలా రక్తనాళాలు బ్లాక్‌ అవుతుంటే.. కడుపులో మంట, ఛాతీ నొప్పి వస్తాయని వైద్యులు వివరించారు. చాలా మంది దీన్ని గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి.. సొంత వైద్యం చేసుకోవడమో.. మెడికల్‌ దుకాణానికి వెళ్లి మందులు తీసుకోవడమో చేస్తుంటారని.. మరికొందరైతే సోడా, శీతల పానీయాలతో సరిపెట్టుకోవడానికి ఇష్టపడతారని, అలా 7-8 నెలలపాటు పట్టించుకోకుండా ఉంటే.. ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


పరీక్షలు తప్పనిసరి

వయసుతో సంబంధం లేకుండా.. పై లక్షణాలు కనిపించినవారు వైద్యులను సంప్రదించి ఈసీజీ, 2డి ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. 40-45 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొంత మందిలో గుండె నొప్పికి సంబంధించిన లక్షణాలు పైకి కనిపించవని, అలాంటి వారి గుండె కవాటాల్లో ఇబ్బందులు ఉంటాయని వివరించారు. ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె పనితీరును తెలుసుకోవచ్చని, గుండెలో విద్యుత్తు ప్రేరేపణలు అసాధారణంగా ఉంటే హృదయ స్పందనలు ఎక్కువగా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. దీంతో ఉన్నఫళంగా హృదయ స్పందనలు పెరిగి.. మరణానికి దారి తీస్తుందని చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా లిపిడ్‌ ప్రొఫైల్‌, హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలు తప్పనిసరి గా చేయించుకోవాలని.. ఎప్పటికప్పుడు రక్తపోటును చెక్‌ చేసుకుని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చని వివరిస్తున్నారు.

Asf.jpg

ఈ లక్షణాలుంటే.. జాగ్రత్తపడాలి

గుండెపోటుకు ముందు ఆయాసం రావడం, బీపీ తగ్గడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. గుండెలో ఇన్ఫెక్షన్‌ ఉంటే తీవ్ర జ్వరం వస్తుంది. కడుపు, ఛాతీలో నొప్పి ఉంటుంది. ఛాతీలో నొప్పి ఇతర భాగాలకు పాకుతుంది. కొందరికి ఎడమ చేతి వద్ద ఒక చోట నొప్పి మొదలై.. మెల్లిగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. మరికొందరిలో చెమటలు బాగా పడతాయి. ఇంకొందరిలో.. మెట్లు ఎక్కినా, కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తుంది. ఉదయం పూట ఆయాసం, అకస్మాత్తుగా కళ్లు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాలి.

- డాక్టర్‌ రాజేశ్‌ దేశ్‌ముఖ్‌,

కార్డియోథోరాసిక్‌,

వ్యాస్కులర్‌ సర్జన్‌, కామినేని ఆస్పత్రి


SRG.jpg

గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి..

ఓ పేషెంట్‌ వయసు 37 ఏళ్లు.. కడుపులో మంట వస్తుండడంతో గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించాడు. పది రోజులు గడిచినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో మా దగ్గరకు వచ్చాడు. పరీక్షలు చేయగా అతనికి పెద్ద స్థాయిలో గుండెపోటు వచ్చిందని నిర్ధారణ అయ్యింది. అతనికి అవసరమైన చికిత్స అందించాం. గుండెపోటు అంటే.. చాలా మంది తీవ్రమైన నొప్పి అని, చాలా సేపు వస్తుందని భావిస్తారు. చిన్న నొప్పులను నిర్లక్ష్యం చేస్తారు. గుండె నొప్పి లక్షణాలు ఏ రూపంలో అయినా రావచ్చు. ఒకటి, రెండు నిమిషాలు వచ్చి తగ్గిపోవచ్చు. దాని ప్రభావం మాత్రం గుండెపై తీవ్రంగా ఉంటుంది. ఛాతీలో పట్టేసినట్లు అనిపించడం, ఆయాసం, గుండెదడ, నాలుగు అడుగులు వేయలేక ఇబ్బంది పడడం వంటి లక్షణాలను గుండె నొప్పి సిగ్నల్స్‌గా భావించాలి.

- డాక్టర్‌ శివప్రసాద్‌,

చీఫ్‌ ఇంటర్వెన్షల్‌ కార్డియాలజిస్ట్‌,

వన్‌ కార్డియాక్‌ సెంటర్‌ ఆస్పత్రి

Updated Date - Aug 10 , 2025 | 03:42 AM