Share News

Premature Greying: జుట్టు నెరవడాన్ని అడ్డుకోవాలంటే ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి

ABN , Publish Date - May 22 , 2025 | 08:43 AM

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి పోషకాహార లోపం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి వారు తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Premature Greying: జుట్టు నెరవడాన్ని అడ్డుకోవాలంటే ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి
Premature Greying

ఇంటర్నెట్ డెస్క్: వయసు పైబడే కొద్దీ జుట్టు తెల్లబడక తప్పదు. దీన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. అయితే, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని కొన్ని రకాల ఫుడ్స్‌తో అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

జుట్టు రంగు మెలనిన్ అనే రసాయనంపై ఆధారపడి ఉంటుంది. మెలానోసైట్స్ అనే చర్మ కణాలు దీన్ని ఉత్పత్తి చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో జుట్టు నెరుస్తుంది. అయితే, పోషకాహార లోపం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా జుట్టు నెరవడానికి ఓ ప్రధాన కారణం. ఈ సమస్యను నివారించే ఫుడ్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఉసిరితో జుట్టు తెల్లబడటాన్ని చాలా వరకూ నిరోధించవచ్చు. ఇందులోని విటమిన్ సీ, ఇతర యాంటీఆక్సిడెంట్స్.. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తాయి.


ఆకు కూరల్లో కూడా తల నెరుపును అడ్డుకునే గుణాలు ఉన్నాయి. వీటిల్లోని ఫోలేట్, ఐరన్, విటమిన్ బీ.. మెలనిన్ ఉత్పత్తికి కీలకం. ఇక వీటిల్లోని క్లోరోఫిల్ కూడా శరీరాన్ని డీటాక్సీఫై చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెత్తిపై ఉన్న చర్మం ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తుంది.

బాదంపప్పులు, పొద్దుతిరుగుడు పువ్వు పప్పులు, ఫ్లా్క్స్ సీడ్స్ వంటి వాటిల్లోని కాపర్, జింక్, ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు మెలనిన్ పుష్కలంగా ఉత్పత్తి అయ్యేలా ప్రోత్సహిస్తాయి. మెలనిన్ ఉత్పత్తికి కాపర్ మరింత కీలకం. అయితే, రోజుకు గుప్పెడు గింజలకు మించి తినొద్దని నిపుణులు చెబుతున్నారు.

కోడి గుడ్లల్లో సమృద్ధిగా ఉండే విటమిన్ బీ12, బయోటిన్ కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరం. జుట్టు త్వరగా తెల్లబడటానికి బీ12 విటమిన్ లోపం కూడా ఓ ప్రధాన కారణం. ఇక కెరాటిన్ ఉత్పత్తికి బయోటిన్ అవసరం. కాబట్టి, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతున్నట్టైతే కోడి గుడ్లు తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.


బ్లూ బెర్రీలు, స్ట్రా బెర్రీలు, రాస్బెర్రీలు వంటి వాటిల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సీ సమృద్ధిగా ఉంటాయి. జుట్టుపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి అవసరం. శరీరం ఐరన్‌ను పూర్తిస్థాయిలో గ్రహించేందుకు కూడా ఇవి అవసరం. జుట్టు చర్మానికి పోషకాలు అందించడంలో, రక్తప్రసరణ మెరుగు పరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

జన్యుపరంగా వచ్చే నెరుపును అడ్డుకోవడం కష్టమైనప్పటికీ ఇది నెమ్మదించేలా చేయడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి మీరూ ఈ సలహా పాటించండి.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్లు దాటిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే

స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

40ల్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది

Read Latest and Health News

Updated Date - May 22 , 2025 | 08:50 AM