RRB Group D Exam Dates: ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. కొత్త తేదీలివే..
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:26 PM
ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ సంబంధిత రివైజ్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల అయింది. తొలుత ఈ పరీక్షలు నవంబర్ 17 నుంచి ప్రారంభం కావాల్సిఉండగా.. నియామక ప్రక్రియకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా వాయిదాపడింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) గ్రూప్-డీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నూతన షెడ్యూల్(RRB Group D Exam New Dates Announced) విడుదలైంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పరీక్షలను 2025 నవంబర్ 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ఆధారంగా.. ఈ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నియామక ప్రక్రియకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా వాయిదాపడింది. గత వారం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన తర్వాత నూతన తేదీలను ఖరారు చేశారు.
సిటీ స్లిప్ రేపే.. 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్..
ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు.. పరీక్ష రాయాల్సిన నగరం, తేదీ(City Slip) వంటి ప్రాథమిక సమాచారాన్ని బుధవారం నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు ఆర్ఆర్‌బీ ప్రకటించింది. ఇందులో సిటీ స్లిప్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధిత ఉచిత ప్రయాణ ధృవీకరణ పత్రాన్ని(Travel authority) డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుకల్పిస్తున్నట్టు తెలిపింది. అయితే.. అడ్మిట్ కార్డులు మాత్రం పరీక్షకు నాలుగు రోజుల ముందు జారీచేస్తామని స్పష్టం చేసింది. అంటే నవంబర్ 27న పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు నవంబర్ 23 లేదా 24 తేదీల్లో సంబంధిత హాల్ టికెట్లను డౌన్లోడ్(Hall Ticket Download) చేసుకోవచ్చు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి ఆధార్ కార్డు(Aadhaar Card) లేదా ఇ-వెరిఫైడ్ ఆధార్ ప్రింట్(printed, e-verified Aadhaar)ను తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆర్ఆర్‌బీ తెలిపింది. ఎగ్జామ్ సెంటర్ వద్దే ఆధార్-లింక్డ్ బయోమెట్రిక్ ప్రామాణీకరణను నిర్వహిస్తామని పేర్కొంది. ఆధార్ ధృవీకరణ పూర్తిచేయని వారు rrbapply.gov.inకు లాగిన్ అయి, ప్రవేశ సమయంలో జాప్యాన్ని నివారించేందుకు వారి గుర్తింపును ప్రామాణీకరించాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియలో ఆధార్‌ను ధృవీకరించిన అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకునే ముందు UIDAI ఆధ్వర్యంలో వారి ఆధార్ అన్‌లాక్ అయిందని నిర్ధారించుకోవాలంది.
ఎగ్జామ్ మోడ్..
ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) మోడ్‌లో నిర్వహిస్తారు. ఇది 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి.
జనరల్ సైన్స్- 25
గణితం- 25
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్- 30
జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్- 20
ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు నెగెటివ్ మార్కు వస్తుంది. తుది స్కోర్‌లను లెక్కించడానికి బోర్డు నార్మలైజేషన్ ఫార్ములాను అనుసరిస్తుంది. ఖాళీల సంఖ్యకు మూడు రెట్లు సమానమైన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు.