Share News

సైబర్‌ సెక్యూరిటీలో కీలక ముందడుగు

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:01 AM

డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ కలిసి క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌లో ప్రయోగాత్మక పురోగతి సాధించాయి

సైబర్‌ సెక్యూరిటీలో కీలక ముందడుగు

న్యూఢిల్లీ, జూన్‌ 17: డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ కలిసి క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌లో ప్రయోగాత్మక పురోగతి సాధించాయి. క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌ను ఉపయోగించి వారు ఒక కిలోమీటరు దూరం నుంచి ఫ్రీ-స్పేస్‌ క్వాంటమ్‌ ద్వారా సమాచారాన్ని సురక్షితంగా చేరవేశారు. క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ డొమైన్‌లో భారత్‌ ప్రయోగాత్మక పురోగతి ప్రదర్శించిందని, ఇది సైబర్‌ భద్రతలో కీలక ముందడుగు అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌ అనేది క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌లో చాలా కీలకం. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ క్వాంటమ్‌ కణాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఇవి ఎంత దూరంలో ఉన్నా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీ బృందం ఇప్పుడు ఈ సాంకేతికతను ఉపయోగించి సురక్షితమైన కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు ఫైబర్‌ను కాకుండా గాలిని ఉపయోగించారు. ఈ పురోగతి క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌ (క్యూకేడీ), క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ల అభివృద్ధి, క్వాంటమ్‌ సైబర్‌ భద్రతలో రియల్‌ టైమ్‌ అనువర్తనాలకు మార్గం సుగమం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘ఐఐటీ ఢిల్లీ క్యాంప్‌సలో ఏర్పాటు చేసిన ఫ్రీ-స్పేస్‌ ఆప్టికల్‌ లింక్‌ ద్వారా క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌ను ఉపయోగించి ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం సమాచారాన్ని సురక్షితంగా పంపించాం’’ అని ప్రకటించింది. దీంతో భారత్‌ కొత్త క్వాంటమ్‌ యుగంలోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన డీఆర్‌డీవో, ఐఐటీ ఢిల్లీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. భవిష్యత్తు యుద్ధాల్లో ఇది ‘గేమ్‌ చేంజర్‌’ అవుతుందని చెప్పారు.


నో ఫ్లై జోన్‌’లుగా అమర్‌నాథ్‌ యాత్ర మార్గాలు

శ్రీనగర్‌, జూన్‌ 17: భద్రత కారణాల దృష్ట్యా అమర్‌నాథ్‌ యాత్ర మార్గాలను ‘నో ఫ్లై జోన్‌’లుగా ప్రకటిస్తూ జమ్మూ-కశ్మీర్‌ యంత్రాంగం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. యాత్ర సాగే పహల్గాం, బల్తాల్‌ మార్గాలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం విమానాలు, హెలికాప్టర్లు తిరగడం సహా యూఏవీలు, డ్రోన్లు, చివరకు బెలూన్లు ఎగురవేయడం కూడా నిషేధం. జులై ఒకటో తేదీ నుంచి ఆగస్టు పదో తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ప్రకృతి వైపరీతాలు, అత్యవసర ఆరోగ్య పరిస్థితులు, భద్రతా దళాల నిఘా విషయంలో ఇందుకు మినహాయింపు ఉంది.

Updated Date - Jun 18 , 2025 | 05:03 AM