Share News

CISF: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు..నెలకు రూ.81 వేల జీతం సహా..

ABN , Publish Date - May 14 , 2025 | 03:45 PM

పోలీస్ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా CISF నుంచి 403 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, వయస్సు, జీత భత్యాల వంటి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

CISF: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు..నెలకు రూ.81 వేల జీతం సహా..
CISF Head Constable Recruitment 2025

మీరు ఇంటర్ పాసై ఉండి పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా కింద 403 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించిన ఆటగాళ్లకు ఈ నియామకం మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ పోస్టులు ప్రస్తుతం తాత్కాలికమే కానీ భవిష్యత్తులో శాశ్వతం చేయనున్నారు.


ఈ క్రీడల వారికి ప్రత్యేకం..

ఈ నియామకం ద్వారా మొత్తం 403 పోస్టులు భర్తీ చేయనుండగా, ఇందులో 204 ఖాళీలు పురుష అభ్యర్థులకు, 199 ఖాళీలు మహిళా అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. ఈ ఉద్యోగాలన్నీ వుషు, టైక్వాండో, జూడో, రెజ్లింగ్, వాలీబాల్, స్విమ్మింగ్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, ఆర్చరీ, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్, బాస్కెట్‌బాల్, షూటింగ్, కబడ్డీ, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్ వంటి వివిధ క్రీడలలో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఒకే క్రీడ/కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 18, 2025

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 6, 2025

ఈ కోటా తప్పనిసరి

ఈ నియామకానికి అభ్యర్థి విద్యా అర్హతగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. దీంతో పాటు, సంబంధిత క్రీడలో ఏదైనా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడం లేదా సాధన చేసి ఉండాలి. ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం, రాష్ట్ర స్థాయిలో జాతీయ పోటీలో పాల్గొనడం, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం లేదా జాతీయ పాఠశాల క్రీడలలో బంగారు పతకం సాధించడం వంటివి.


వయస్సు ఎంత ఉండాలి..

ఇక అభ్యర్థుల వయస్సు విషయానికి వస్తే ఆగస్టు 01, 2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థి ఆగస్టు 2, 2002కి ముందు, ఆగస్టు 1, 2007 తర్వాత జన్మించి ఉండకూడదు. నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు ఇవ్వబడుతుంది, SC/ST కేటగిరీకి 5 సంవత్సరాలు, OBC కేటగిరీకి 3 సంవత్సరాలు.

సెలక్షన్ విధానం..

ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది. మొదటి దశలో ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ట్రయల్ టెస్ట్‌లో కనీసం 10 మార్కులు, ప్రావీణ్య పరీక్షలో కనీసం 20 మార్కులు పొందడం తప్పనిసరి. వీటన్నింటిలోనూ విజయం సాధించిన అభ్యర్థులను చివరకు వైద్య పరీక్షకు పిలుస్తారు.


జీతం ఎంత..

ఈ పోస్టుకు జీతం స్థాయి 4 ప్రకారం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. దీంతో పాటు, కేంద్ర ప్రభుత్వం సూచించిన ఇతర అలవెన్సులు కూడా ఇవ్వబడతాయి. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100/- కాగా, మహిళా, SC, ST కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు https://cisfrect.cisf.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - May 14 , 2025 | 03:48 PM