AP Capital Confusion: రాజధానిపై వైసీపీ సన్నాయి నొక్కులు
ABN , Publish Date - Sep 26 , 2025 | 02:27 AM
ప్రజా రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేతలు సందిగ్ధం నుంచి బయట పడలేదనిపిస్తోంది. ఒకవైపు మూడు రాజధానులపై తాము ఇంకా చర్చించలేదంటూనే, కావాలంటే విజయవాడ–గుంటూరు మధ్య సింగిల్ రాజధాని నిర్మిస్తే సరిపోతుందని సన్నాయి నొక్కులు నొక్కడం...
ప్రజా రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేతలు సందిగ్ధం నుంచి బయట పడలేదనిపిస్తోంది. ఒకవైపు మూడు రాజధానులపై తాము ఇంకా చర్చించలేదంటూనే, కావాలంటే విజయవాడ–గుంటూరు మధ్య సింగిల్ రాజధాని నిర్మిస్తే సరిపోతుందని సన్నాయి నొక్కులు నొక్కడం అందుకు ఉదాహరణ.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముక్కు, చెవులు, కళ్లుగా చెప్పుకొనే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇటీవల జరిగిన ఒక కంక్లేవ్‌లో మూడు రాజధానుల గురించి ప్రశ్నించారు. దానికి ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా తాము అధికారంలో ఉండగా పరిపాలన అమరావతి నుంచే కొనసాగిందని, జగన్మోహన్‌రెడ్డి కూడా అమరావతి ప్రాంతం నుంచే కార్యకలాపాలు నిర్వహించారని, ఇకపై కూడా అక్కడే ఉంటారని చెప్పారు. అంతేకాకుండా తాము అధికారంలో ఉండివుంటే అమరావతి రైతులకు మరింత మేలు చేసేవారమని తాలింపు మాటలు కూడా మాట్లాడారు (అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు ఇవ్వకపోగా, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఉద్యమం నిర్వహించిన మహిళలు, రైతులను గత పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు ఇంకా మరచిపోలేదు). అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో మాత్రమే జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నం, కర్నూలు అంశాన్ని ముందుకు తెచ్చినట్టు సజ్జల చెప్పారు. కానీ నేడు జగన్మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నదా? లేక ప్రజా రాజధాని అమరావతికి ఆమోదం తెలుపుతున్నారా? అనే అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అయితే జగన్మోహన్‌రెడ్డి కూడా అమరావతి ప్రాంతం నుంచే కార్యకలాపాలు నిర్వహించారని, ఇకపై కూడా అక్కడే ఉంటారంటూ చెప్పిన మాటలకు సోషల్ మీడియాలో... వైసీపీ మూడు రాజధానుల నుంచి తప్పుకొన్నట్టు, ప్రజా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించినట్టు ప్రచారం జరిగింది.
ఈ కథనాలకు వివరణ ఇవ్వడం కోసం సజ్జల ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆయన మళ్లీ గతంలో చెప్పిన విషయాలనే తిప్పి చెప్పారే కానీ, తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని స్పష్టంగా ప్రకటించలేదు. ఇది చాలదన్నట్టుగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాజధాని అమరావతి ఎక్కడ ఉంది? అంటూనే చంద్రబాబు సింగిల్ రాజధాని కావాలనుకొంటే విజయవాడ – గుంటూరు మధ్య 500 ఎకరాల్లో నిర్మిస్తే సరిపోతుందని తమ నాయకుడు జగన్ చెప్పారని ప్రకటించారు. ఇదే సమయంలో తమ పార్టీలో మూడు రాజధానులపై ఇంకా చర్చ జరగలేదని కూడా చెప్పారు. అంబటి కూడా మూడు రాజధానులకు పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేయకపోగా, తమ నాయకుడు విజయవాడ–గుంటూరు మధ్య ఏక రాజధాని ఏర్పాటుకు అంగీకరించారని పరోక్షంగా చెప్పారు. వీరి మాటలను బట్టి ఆ పార్టీ ఏక రాజధానికి అంగీకారానికి వచ్చినా, అమరావతి అనే పేరు ఉచ్చరిస్తే ప్రజలకు చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తాడనే దుగ్ధతో కొత్తగా విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని అని ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.
జగన్మోహన్‌రెడ్డి పాలనా కాలంలో ‘అమరావతి ప్రాంత రైతులు, మహిళలు రాజధాని అమరావతి కోసం చేసిన ఉద్యమాలు, పాలనా రాజధాని విశాఖపట్నం’ అంటూ వైసీపీ నేతల ప్రకటనలతోనే కాలం గడిచింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన వాగ్దానాల సంగతి ఎలా ఉన్నా, 2024లో మూడు రాజధానులు ప్రధాన అంశంగా ఎన్నికలు జరిగాయి. దీనిపై ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన పాలనా రాజధాని విశాఖపట్నంతో సహా మూడు రాజధానులలో పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనిని బట్టి ప్రజలు మూడు రాజధానులను తిరస్కరించారని ఎంతటి అమాయకులకైనా అర్థమవుతుంది. అయినా రాజధాని విషయంలో వైసీపీ నేతలలో సందిగ్ధం కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా సమర్థించిన నోటితోనే... ఇప్పుడు విజయవాడ –గుంటూరుల మధ్య 500 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే చాలునని వ్యాఖ్యానించడం ‘నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది’ అనే నానుడికి నిదర్శనం.
ఇదే సమయంలో వైసీపీ నేతలు నిన్న మొన్నటి వరకు ‘సూపర్ సిక్స్’ను ప్రచార కవచంగా వాడుకున్నారు. చివరకు సూపర్‌సిక్స్ సూపర్ హిట్ కావడంతో దిక్కుతోచక మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (పిపిపి) విషయాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కనీసం 10 శాతం కూడా పూర్తికాలేదని, ఒక్కొక్క కాలేజీకి వందల కోట్ల రూపాయలు కావలసి వుందన్న విషయం ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలకు మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగిలిన ప్రజలు ఏమిచెప్పినా నమ్ముతారనే ధోరణిలో వేల కోట్ల రూపాయల మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నట్టు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో పబ్లిక్ అంటే ప్రభుత్వమని అర్థం. అందువల్ల మెడికల్ కాలేజీల నిర్వహణలో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుంది. మెడికల్ కాలేజీలను పిపిపి తరహాలో నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం, తగిన సూచనలు చేయడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వంలోని నాయకులను ‘బావుల్లో పడి చావండి’ వంటి మాటలను ఉపయోగించడం జగన్‌లో పేరుకుపోయిన ఉక్రోషాన్ని తెలియజేస్తోంది.
అన్నవరపు బ్రహ్మయ్య
సీనియర్ పాత్రికేయులు
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్
యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట