Share News

Rajampet District Status: హామీ ఇచ్చారు నెరవేరుస్తారా

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:14 AM

గత సాధారణ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్...

Rajampet District Status: హామీ ఇచ్చారు నెరవేరుస్తారా

గత సాధారణ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజంపేట బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఇప్పుడు వారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన సూపర్ సిక్స్ హామీలనే స్వల్ప వ్యవధిలో నెరవేర్చిన వీరు, ఈ హామీని కూడా కచ్చితంగా నెరవేరుస్తారని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలలో గంపెడు ఆశలు రేకెత్తాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే వారికి మళ్లీ ఆశాభంగం కలిగేటట్లు కనిపిస్తోంది.

చరిత్రాత్మకంగా, మౌలికవసతుల పరంగా, నైసర్గికంగా జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలు కలిగిన రాజంపేట... గత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. గతంలో జగన్మోహన్‌రెడ్డి రాజంపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించి, జీఓ కూడా విడుదల చేశారు. కానీ కొద్ది రోజులకే ఆ మెడికల్ కాలేజీని మదనపల్లికి తరలించారు. దానికి ప్రతిగా రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు కంటి తుడుపు మాటలు చెప్పారు. కానీ సుదూర ప్రాంతమైన రాయచోటిని జిల్లా కేంద్రం చేసింది వైసీపీ ప్రభుత్వం. వాస్తవంగా రాజంపేట నియోజకవర్గం అన్ని విధాలుగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్రిటీషు వారి కాలం నుంచే ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఉంది. నవాబుల పాలనలో 1807 నుంచి 1812 వరకు రాజంపేట నియోజకవర్గంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న సిద్దవటం జిల్లా కేంద్రం ఉండేది. వర్షాలు వచ్చినప్పుడు పెన్నా నది పొంగుతుండడంతో ఆ జిల్లా కేంద్రాన్ని అప్పట్లో కడపకు మార్చారు. క్రీ.శ 1303లో మట్లి రాజులు సిద్దవటంలో బలమైన కోటను నిర్మించుకుని అక్కడి నుంచి సుదీర్ఘకాలం పరిపాలించినట్లు చరిత్ర తేటతెల్లం చేస్తోంది. రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట కూడా ఎంతో చారిత్రాత్మక, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కలిగి ఉంది. మహాభారతాన్ని తెలుగులో రచించిన బమ్మెర పోతన కూడా 1450 నుంచి 1510 వరకు ఒంటిమిట్టలో నివాసం ఉన్నాడు. రాష్ట్ర విభజన తరువాత 2015లో రెండవ భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవ నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు ఇచ్చింది. పద కవితా పితామహుడు అన్నమాచార్యులు రాజంపేట సమీపంలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. 1408 నుంచి 1503 వరకు అన్నమయ్య తిరగాడిన రాజంపేటను కాదని అదే అన్నమయ్య పేరుతో గత పాలకులు రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం రాజకీయ విశ్లేషకులను, మేధావులను, చరిత్రకారులను విస్మయానికి గురిచేసింది.


రాజంపేటలో ఇప్పటికిప్పుడు జిల్లా కేంద్రం నెలకొల్పేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. చరిత్రను, సదుపాయాలను, నైసర్గికతను విస్మరించి సుదూర ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసిన గత పాలకుల తప్పును సరిదిద్దడంతో పాటు, గత ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవలసిన బాధ్యత కచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలపై ఉంది.

కైలసాని శివప్రసాద్

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 04:14 AM