Telugu Literary Criticism:: పరిశోధనలు విమర్శ కానేరవు
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:03 AM
‘ప్రమాణాల్లేని నేటి విమర్శ’ పేరుతో సుంకర గోపాలయ్య రాసిన వ్యాసానికి (03.11.2025) సమాధానంగా ‘బహుళ స్వరాల నేటి విమర్శ’ పేరుతో వెంకట రామయ్య వ్యాసం రాసారు (10.11.2025). ఈ వ్యాసంలో వెంకట రామయ్య– ‘‘ఆధునిక (?) విమర్శలో...
‘ప్రమాణాల్లేని నేటి విమర్శ’ పేరుతో సుంకర గోపాలయ్య రాసిన వ్యాసానికి (03.11.2025) సమాధానంగా ‘బహుళ స్వరాల నేటి విమర్శ’ పేరుతో వెంకట రామయ్య వ్యాసం రాసారు (10.11.2025). ఈ వ్యాసంలో వెంకట రామయ్య– ‘‘ఆధునిక (?) విమర్శలో... ‘విశ్లేషకుడు’ లేదా ‘వ్యాఖ్యాత’ పాత్ర బలపడింది. ఇది పతనం కాదు, పరిణామం’’ అన్నారు. విశ్లేషణా, వ్యాఖ్యానము రెండూ ఈనాటివి కాదు గానీ, నాకిక్కడ ఆయన విమర్శా ప్రక్రియను పరిణత రూపంగా చూడకపోవడమే ఆశ్చర్యం కలిగించింది. సుంకర గోపాలయ్య కొత్త పరికరాలు, నిర్దిష్టమైన నిరూపణలు లేని విమర్శ ప్రబలిపోతోందని వాపోయాడు. విమర్శకు ఉండే ఎటువంటి మౌలిక లక్షణానికయినా ప్రమాదం ఏర్పడుతుందన్న భయం కలిగినప్పుడు ఇటువంటి ఆక్రోశం సహజం. రామయ్య కొత్త సిద్ధాంతాలు ఆకాశం నుండి ఊడిపడవన్నారు గానీ ఆయన కూడా నవీన సిద్ధాంతాలను వేటినీ ఉటంకించలేదు. కొంతమంది పేర్లు ప్రస్తావించి విషయాత్మక చర్చను కాస్తా వ్యక్తిగతం చేసేశారు. సిద్ధాంత అన్వయాలు సిద్ధాంతాలు కానట్టే పరిశోధనలు విమర్శ కానేరవన్న సంగతి తెలుసుకోవాలి.
‘‘పరిశోధన వ్యాసంలో ఒక వినూత్న సిద్ధాంతం గాని, సమన్వయం గాని, విశ్లేషణం గాని ప్రతిపాదించబడుతుంది. విమర్శ వ్యాసంలో ఒక వినూత్న వివేచనం గాని, దృక్పథం గాని సప్రమాణంగా సమర్పించబడుతుంది’’ అని జీవీ సుబ్రమణ్యం చెప్పారు. ఆయనే కొత్తదనం ప్రయోగం కావచ్చు గానీ, ప్రయోగానికీ విప్లవానికీ తేడా ఉందని అన్నారు కూడా. కనుక Narrative (వివరణాత్మక), Descriptive (వర్ణనాత్మక), Participative (భాగస్వామ్యత), Application (అనువర్తిత)... వంటివి ప్రక్రియా (Genre) విమర్శలో భాగాలే కానీ కొత్త సిద్ధాంతాలు కావు. అలా అయినప్పుడు వ్యాసకర్త ఉదహరించిన పుస్తకాల కన్నా పెద్ద జాబితానే తయారు చేయవచ్చు. ముందుమాటలు, పుస్తక సమీక్షలు, సదస్సుల్లో సమర్పించిన పరిశోధనా వ్యాసాలను గుదిగుచ్చి విమర్శ పేరుతో సంకలనాలు తెచ్చినంత మాత్రాన అవి సాహిత్య విమర్శ అనిపించుకోవు. ఆయా సమీక్షకులను, పరిశోధకులను విమర్శకులుగా గుర్తించడంలో మనకు మరింత పర్యాలోచన, సంయమనం అవసరం.
వర్తమాన విమర్శ అభిరుచి స్థాయిలోనే ఉండిపోతోందన్న గోపాలయ్య మనసులో మాటను రామయ్య తెలుసుకోలేకపోయారు. అందుకు గోపాలయ్య వాడిన ‘‘గత పదిహేను సంవత్సరాల’’ అన్న తొందరపాటు ప్రస్తావన కారణం కావచ్చు. అయితే ఇద్దరూ సాహిత్య విమర్శలో అంబేడ్కర్, బౌద్ధం వంటి సిద్ధాంతాల ప్రవేశాన్ని, గణనీయ ప్రభావాన్నీ విస్మరించారు. వర్తమాన సాహిత్య విమర్శకు కొత్త సిద్ధాంతాల అవసరం ఉందన్నది ఎంత నిజమో, అసలు అటువంటి ప్రమేయమే మన్నించలేని ఒక వింత కాలంలోకి మనం నడచి వెళ్తున్నామన్నది అంతే నిజం. అదే ఇక్కడ అతి ముఖ్యమైన ప్రమాణ చర్చ. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా విమర్శలో అంతటి స్తబ్ధత కొనసాగుతోందన్న బాధగానే గోపాలయ్య వ్యాసం నాకు అర్థమయ్యింది.
సామాజిక మాధ్యమాలను ఎంత శక్తివంతంగా వాడుకోవచ్చో ‘కవిసంగమం’ వంటి ప్రయోగాలు నిరూపించినప్పటికీ– ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వస్తున్న అన్ని వ్యాసాలనూ లోతైన చర్చలుగా భావించినట్లైతే తెలుగునాట విమర్శకులు లేరని దిగులు చెందవలసిన పని లేదు. గోపాలయ్య కలతపడ్డ ప్రమాణాలు అవి కాదు, పత్రికల్లో వచ్చే సమీక్షలు కూడా కాదు. విమర్శలో కోల్పోతున్న సృజనాత్మక విలువల గురించి ఆయన రాశారు. రామయ్య పరిశోధనకూ లంకె వేశారు గనుక ఇప్పుడు ‘మరొకమారు’ దాని ఉపజ్ఞత గురించి కూడా అని భావించాలి. విమర్శకు ఆలంబన దృక్పథమే.
రామయ్య ‘‘బహుళ ప్రమాణాల వైపు పరిణామం’’ అన్న మాటను చాలా ఆలోచించే వాడారు. ఆధునికోత్తరవాద (పోస్ట్ మాడర్నిజం) ప్రస్తావన కూడా తెచ్చారు. కానీ గోపాలయ్య గోసపడ్డ అప్రమాణికత ఏకత్వమో, బహుళత్వమో కాదు. అధ్యయనశీలత, ప్రాసంగిక స్వభావము మాత్రమే. అయినప్పటికీ Heterogeneity (వైధర్మ్యము), Hybridity (మిశ్రితత్వం), Multiplicity (బహుళత్వము) వంటి ధోరణులు ప్రక్రియకుండే శాస్త్ర మూలాన్ని మార్చలేవు. వర్తమాన సాహిత్యంలో ఈ బహుళతాత్వికత వరమా శాపమా ఇంకా తేలవలసి ఉంది. కొప్పర్తి, బి. తిరుపతిరావు, సుంకిరెడ్డి, జిలుకర శ్రీనివాస్, అఫ్సర్ వంటివారు ఆ దిశగా ఎంతో కృషి చేస్తున్నారు కూడా. అయితే గతాన్ని ఆదర్శీకరిస్తున్నారని తేలిగ్గా తీసిపారేస్తున్నారు గానీ కట్టమంచి, రాళ్ళపల్లి, రారా, టీఎమ్మెస్ వంటి వారికి తెలుగు సాహిత్య విమర్శలో క్లాసిక్ స్థానం ఇవ్వడం సముచితమే. వీళ్ళే కాదు విమర్శకున్న ప్రయోగశీలతను, దార్శనికతను, విలక్షణతను నిలబెట్టిన మహానుభావులెందరినో ఈ తరం స్పూర్తిగా తీసుకోని అధ్యయనం చేయాలి.
శ్రీరామ్ పుప్పాల
99634 82597
ఇవి కూడా చదవండి
బీసీ రిజర్వేషన్లపై మరో మోసానికి తెర తీసిన కాంగ్రెస్: తలసాని
రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తా.. ముగ్గరు మృతి