తెలంగాణకు కాళేశ్వరమే శ్రీరామరక్ష
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:08 AM
తెలంగాణకు కాళేశ్వరమే శ్రీరామరక్ష. ఈ ప్రాజెక్టుపై జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అక్కసు వెళ్లగక్కారు. ‘ఏ కోణంలోనూ కాళేశ్వరాన్ని సమర్థించలేం’ పేరుతో జూలై 2న ‘ఆంధ్రజ్యోతి’లో...
తెలంగాణకు కాళేశ్వరమే శ్రీరామరక్ష. ఈ ప్రాజెక్టుపై జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అక్కసు వెళ్లగక్కారు. ‘ఏ కోణంలోనూ కాళేశ్వరాన్ని సమర్థించలేం’ పేరుతో జూలై 2న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వ్యాసంలో ప్రాజెక్టు గురించి ఆయన అనేక అసత్యాలు రాశారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారడం దురదృష్టకరం.
తెలంగాణ రాష్ట్రం కృష్ణా, గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు గోదావరి జలాలను తరలిస్తా’మని చెబుతూ ‘ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టు’ను ప్రతిపాదించింది. 2014 వరకు కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ప్రధానమైన హెడ్ వర్క్స్ పనుల్లో తట్ట మట్టి కూడా తీయకుండానే కాంట్రాక్టర్లకు రూ. వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి ఫక్తు కమీషన్ల ప్రాజెక్టుగా మార్చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి అనేక ప్రయత్నాలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. 148 మీటర్ల ఎత్తులో మాత్రమే బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకుంటామని మహారాష్ట్ర స్పష్టం చేసింది. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నికర జలాల లభ్యత ఉన్నా అందులో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 63 టీఎంసీలు కూడా ఉన్నాయనే విషయాన్ని సీడబ్ల్యూసీ ఎత్తిచూపింది. 165 టీఎంసీల నీటిని వినియోగించే ప్రాజెక్టులో కేవలం 16 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించడాన్ని కూడా తప్పుబట్టింది. వీటన్నింటికీ మించి వైన్‌గంగా, వార్థ నదుల సంగమం తర్వాత ప్రాణహిత నది ప్రవాహం మొదలవుతుంది. అదే ప్రాంతంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీని ప్రతిపాదించారు. తుమ్మిడిహెట్టి వద్ద మహారాష్ట్ర వైపున నదీ ప్రవాహం 40 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. ఆ ప్రదేశంలో బ్యారేజీ నిర్మాణానికి సాంకేతికంగా ఎన్నో అవాంతరాలు ఉన్నాయి. ఫలితంగానే కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వచ్చింది.
నిపుణుల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించింది అనేది పచ్చి అబద్ధం. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీటిని తరలించాలన్న ప్రతిపాదనను మాత్రమే నిపుణుల కమిటీ వద్దని చెప్పింది. మేడిగడ్డ వద్ద 240 టీఎంసీలకు పైగా నికర జలాల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించింది. అందుకే ప్రాజెక్టు సోర్స్ పాయింట్‌ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు కేసీఆర్ ప్రభుత్వం మార్చాల్సి వచ్చింది. ప్రాణహిత–చేవెళ్లకు అన్ని అనుమతులు వచ్చినట్టు వ్యాసకర్త రాశారు. అది కూడా తప్పే. ప్రాణహిత ప్రాజెక్టుకు కొన్ని అనుమతులు వచ్చిన మాట నిజమే అయినా కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసిన తర్వాతనే కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించారనేది వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రయోజనమే లేదని చెప్పడానికి వ్యాసకర్త ప్రయత్నించారు. 20 లక్షల ఎకరాలకు పైగా భూములకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఈ వాస్తవాన్ని తొక్కిపెట్టి కాళేశ్వరంపై వ్యాసకర్త విషం చిమ్మారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 100 రూపాయలు ఖర్చు చేస్తే 52 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్టు లాభసాటి కాదు అని వ్యాసకర్త తెలిపారు. విద్య, వైద్యం, రైతులు, మహిళల సంక్షేమం కోసం చేసే ఖర్చును లాభనష్టాల కోణంలో చూడటమే తప్పు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల విధ్యుక్త ధర్మం. రాష్ట్రానికి హక్కుగా దక్కే నదీజలాలను ఒడిసిపట్టేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడొద్దు అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఏపీ ప్రభుత్వం రూ.82 వేల కోట్లతో తలపెట్టిన గోదావరి– బనకచర్ల లింక్ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరా అయినా కొత్త ఆయకట్టు ఉందా అన్న విషయం కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్లు గుర్తించాలి.
20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే, మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించలేమని వ్యాసకర్త అంటున్నారు. అంటే ఏపీ ప్రభుత్వం జలదోపిడీ కోసం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆయన వంత పాడుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. వ్యాసకర్త తన రాజకీయ బాస్‌ను మెప్పించడానికి ఈ ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో నిర్మించిన భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ లాభాల సాధన కోసం మాత్రమే కాదు. ఆయా దేశాలు, రాష్ట్రాల నీటి హక్కులు కాపాడుకోవడంతో పాటు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించుకోవడానికి అన్న వాస్తవాన్ని అంగీకరించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇకపై నిధులు వినియోగిస్తే ఆ వ్యయం కూడా వృథా అనే తప్పుడు సూత్రీకరణలకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టాలి. గోదావరి నదిలో మనకు హక్కుగా దక్కే నీటిలో అతి ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఉన్నది. ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. కాళేశ్వరమే తెలంగాణకు శ్రీరామరక్ష. కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్.
కల్వకుంట్ల కవిత
శాసనమండలి సభ్యురాలు
ఇవి కూడా చదవండి..
క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి