Share News

భారత్‌ పాక్‌లను ఒకే గాటన కడతారా

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:11 AM

‘ఉగ్రవాదం ఒక మతాన్ని మించినది’ అంటూ జూన్ 17న సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి రాసిన వ్యాసం అసంబద్ధంగా ఉంది. ఆయన హిందూ వ్యతిరేకత, ముస్లిం సంతుష్టీకరణ ఈ వ్యాసంలో స్పష్టంగా కనపడింది. భారత్ ఉగ్రవాద పీడిత...

భారత్‌ పాక్‌లను ఒకే గాటన కడతారా

‘ఉగ్రవాదం ఒక మతాన్ని మించినది’ అంటూ జూన్ 17న సిహెచ్.ఎస్.ఎన్.మూర్తి రాసిన వ్యాసం అసంబద్ధంగా ఉంది. ఆయన హిందూ వ్యతిరేకత, ముస్లిం సంతుష్టీకరణ ఈ వ్యాసంలో స్పష్టంగా కనపడింది. భారత్ ఉగ్రవాద పీడిత దేశం కాదని, ఇది ఒక తప్పుడు ప్రచారం అని, ఉగ్రవాద నిర్మూలన పేరుతో ఈ దేశంలో ప్రభుత్వాలు ముస్లింలను టార్గెట్ చేసి, చంపి వేస్తున్నాయని వ్యాసంలో చెప్పడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

బెలూచిస్థాన్‌ ప్రాంతంలోని ముస్లిం ఉగ్రవాదుల వల్ల పాకిస్థాన్‌ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని, అందువల్లనే భారతదేశం కంటే పాకిస్థాన్‌లో ఎక్కువమంది ముస్లింలు చనిపోతున్నారని రచయిత వాపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కశ్మీర్ వేర్పాటువాదులకు వంతపాడి, బెలూచిస్థాన్‌ వేర్పాటువాదులను దెప్పిపొడవడం ఎందుకు? కశ్మీర్ 370 ఆర్టికల్‌ను అడ్డుపెట్టుకొని కశ్మీర్ వేర్పాటువాదులు జరిపిన నరమేధాన్ని ప్రజా పోరాటం అంటారా? ఈ వేర్పాటువాదుల దుశ్చర్యల వల్ల మూడు లక్షల మంది హిందువులు సర్వస్వాన్ని వదులుకొని, లోయ నుంచి పారిపోయి వచ్చారు. మైనారిటీలకు భయపడి మెజారిటీ మత‍స్థులు పారిపోయి రావడం ఈ భూమండలంపై ఎక్కడా జరగదు.


భారతదేశంలో 562 సంస్థానాలు విలీనమైనట్లే కశ్మీరు సంస్థానం కూడా విలీనమైంది. ఆనాటి కశ్మీర్ సంస్థానం రాజు రాజా హరిసింగ్‌ను ఒప్పందానికి ఒప్పించిన ఆరెస్సెస్‌ రెండవ అధ్యక్షులు గురూజీ ఇదే విషయాన్ని స్పష్టీకరించారు. ఒక ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఇవ్వబడతాయా? మరి హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి వాదనలు తలెత్తవా? కశ్మీర్ వేర్పాటు ఉద్యమాన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా ఈ దేశానికి వ్యతిరేకులే. కశ్మీరీల స్వయం నిర్ణయాధికారం కోసం నడిపిన ఉద్యమంలో కశ్మీరీ పండిట్లు పాల్గొన్నారని చెప్పడం పచ్చి అబద్ధం!

ఇక దేశ విభజన మతం ఆధారంగా ఎందుకు జరిగింది? విభజనను కోరింది ఎవరు? ఇందుకు పునాది ఏమిటి? ఈ విషయంలో హిందువుల పాత్ర ఎంత? ఇత్యాది విషయాలను కూలంకషంగా చర్చిస్తే వాస్తవాలు బోధపడతాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే స్వాతంత్ర్య ఉద్యమాన్ని అడ్డుకోవడానికి 1906లో బ్రిటిష్ నాయకుల సలహా మేరకు ముస్లిం లీగ్ సంస్థ ఏర్పాటు చేయబడిందనే విషయం అర్థమైతే వాస్తవ విషయాలు స్ఫురణకు వస్తాయి. ఇస్లాం సమాజంలో సంస్కరణలు కావాలని కోరిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ దేశంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ముస్లిం సమాజం ముందు ఉంచిన విషయంపై వ్యాసకర్తకు అవగాహన లేదనిపిస్తుంది. 1946లో రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలలో 80 సీట్లకు పోటీ చేసిన ముస్లిం లీగ్ ముస్లింలు మెజారిటీగా ఉండే ప్రాంతాల్లో 73 సీట్లు గెలిచింది. అఖండ భారత్ నిర్మాణమే లక్ష్యంగా జాతీయ కాంగ్రెస్ 1585 సీట్లకు పోటీ చేస్తే కేవలం 925 సీట్లు మాత్రమే గెలిచింది. హిందువులు ముస్లింలు కలిసి ఉండాలనే భావనకు మద్దతు లభించలేదనే విషయం స్పష్టమైంది. మతం ఆధారంగా దేశ విభజన జరగాలని ఈ దేశంలో ముస్లింలందరూ కోరుకున్నారు. అందుకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఎన్నికల విజయంతో చెలరేగిపోయిన ముస్లిం లీగ్ నాయకులు 1946 ఆగస్టులో డైరెక్ట్‌ యాక్షన్‌కు పిలుపునిచ్చి, హిందువులపై నరమేధానికి కారణమయ్యారు. ఈ నరమేధాన్ని కళ్ళారా చూసిన కాంగ్రెస్ నాయకులు భయపడి దేశ విభజనకు ఒప్పుకున్నారనేది వాస్తవం. ఈ చారిత్రక సత్యాన్ని దేశ ప్రజలకు తెలియనీయకుండా లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ వ్యతిరేక హిందువులు, స్వయం ప్రకటిత మేధావులు తమకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


అమెరికా, రష్యా మధ్య ఏర్పడిన ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు బంగ్లాదేశ్ ఏర్పాటుకు, భారత్ పాకిస్థాన్ యుద్ధానికి కారణమని వ్యాస రచయిత చెప్పడం చారిత్రక అవగాహన లేకపోవడమే! 1970లో షేక్ ముజిబుర్‌ రహ్మన్ ఆధ్వర్యంలో నేషనల్ అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉర్దూ మాట్లాడే పశ్చిమ పాకిస్థాన్‌ నాయకులకు ఒళ్ళు మండింది. సైన్యాన్ని ఉసిగొలిపి, బెంగాలీ ముస్లింలను ఊచకోత కోయించారు. అనేక లక్షలమంది హిందువులు, ముస్లింలు భారతదేశంలోకి పారిపోయి వచ్చారు. ఈ భయంకర పరిస్థితుల్లో తూర్పు పాకిస్థాన్‌లోని ప్రజల రక్షణార్థం భారత సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది. దీన్ని విస్తరణవాదం అని ఎలా సూత్రీకరిస్తారు.

పాకిస్థాన్‌, భారతదేశాల్లోని పాలకులు ఉగ్రవాదాన్ని మతాన్ని మేళవించి పాలన చేస్తున్నారని చెప్పడం అత్యంత వివాదాస్పదం. భారత్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను ఎన్నుకున్నది. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఎన్నుకోబడుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతుంది. ఇక పాకిస్థాన్‌లో మతవాదులు, సైన్యం కలిసి ప్రజలను పీక్కు తింటున్నారు. ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎంత కాలం పరిపాలనలో ఉంటాయో తెలియదు. ఇస్లామిక్ తీవ్రవాదానికి ఆ దేశం అడ్డాగా ఉంది.


నాగాలాండ్, అస్సాం, మణిపూర్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలలో తీవ్రవాద కార్యక్రమాలకు హిందువులు కారణమని చెప్పడంలో రచయిత హిందూ వ్యతిరేకత పరాకాష్ఠకు చేరింది. నాగాలాండ్, అస్సాం మణిపూర్‌లలో తీవ్రవాదం పెరగడానికి దేశ వ్యతిరేక అంతర్జాతీయ శక్తులు కారణం. తమిళ ప్రత్యేక రాజ్యం కోసం ఎల్‌టీటీఈ, సిక్కుల ప్రత్యేక రాజ్యం కోసం ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల చర్యలకు ఈ దేశ ప్రజలు మద్దతు ఇవ్వలేదన్న విషయం వాస్తవమే కదా? వాస్తవంగా తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా హిందూ సమాజం అంగీకరించదు. హిందూమత పెద్దలు, మతాచార్యులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే బోధిస్తారు. మత విషయాలు ఎన్నటికీ బోధించరు. ఈ కారణం వల్లనే హిందువులు మెజారిటీగా ఉండే భారతదేశంలో అన్ని మతాలవాళ్ళు శాంతియుత సహజీవనం చేస్తున్నారు. ఈ దేశం నాది, ఈ దేశానికి నేను వారసుడ్ని, ఈ దేశానికి గొప్ప సాంస్కృతిక, చారిత్రిక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది అని భావించే వారెవరూ భారత్‌ను పాకిస్థాన్‌ను ఒకే గాటన కట్టి ఇలాంటి విశ్లేషణలు చేయరు.

ఉల్లి బాలరంగయ్య

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:11 AM