ఆత్మహత్యల్లో హంతకులెవరు
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:14 AM
ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి అంటే, మన సమాజంలో ఆత్మహత్యల రేటు పెరిగిందని అర్థం. హతుడే హంతకుడైనప్పుడు దాన్ని ఆత్మహత్య అంటారు. హంతకుడు మరొకడైనప్పుడు దాన్ని హత్య అంటారు. మన కుటుంబ, దాంపత్య...
ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి అంటే, మన సమాజంలో ఆత్మహత్యల రేటు పెరిగిందని అర్థం. హతుడే హంతకుడైనప్పుడు దాన్ని ఆత్మహత్య అంటారు. హంతకుడు మరొకడైనప్పుడు దాన్ని హత్య అంటారు. మన కుటుంబ, దాంపత్య వ్యవస్థల్లో చెలరేగుతున్న సంక్షోభాలకు ఇవి సంకేతాలు. సమాజంలో ఏదైనా సరే, పాతదిపోయి కొత్తది రాకతప్పదు. అయితే, మనం మరచిపోకూడని అంశం ఏమంటే– పాత దానితోపాటు పాత నిబంధనలు పోయినట్టే... కొత్త దానితోపాటు కొత్త నిబంధనలు వస్తాయి. వాటిని పాటించక తప్పదు. వివాహిత స్త్రీతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించే పురుషుల్ని గతంలో నేరస్తులుగా భావించి శిక్షించేవారు. ఇప్పుడు వాటిని న్యాయస్థానాలు శిక్షార్హమైన నేరంగా పరిగణించడం లేదు; కేవలం సామాజిక తప్పిదంగా మాత్రమే భావిస్తున్నాయి. వివాహేతర సంబంధంలోకి ప్రవేశించిన–వివాహిత స్త్రీకి ఆమె భర్త, వివాహిత పురుషుడికి అతని భార్య విడాకులు ఇవ్వవచ్చు. అయితే విడాకులు ఇవ్వడం కూడా అంత సులువుకాదు. దానికి అనేక ఆర్థిక పరిమితులుంటాయి.
ఆత్మహత్యల్లో ఒక అమూర్త(కనిపించని) హంతకురాలు ఉంటుంది; అది సమాజం. కటువుగా అనిపించవచ్చుగానీ, అదే నిజం. సామాజిక అనుబంధాలు, నియమాల కారణంగానే ఆత్మహత్యలు జరుగుతాయని 19వ శతాబ్దపు సమాజ శాస్త్రవేత్త డేవిడ్ ఎమిల్ డ్యూర్కైమ్ (David Émile Durkheim) తెలిపాడు. ఆయన 1897లో ‘లా సూసైడ్’ పేరిట ఆత్మహత్యలపై ఒక విస్తార సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. ఆ సిద్ధాంతాన్నే సమాజ విశ్లేషకులు, పరిశోధకులు ఇప్పటికీ ప్రామాణికంగా భావిస్తుంటారు.
డ్యూర్కైమ్ సిద్ధాంతం ప్రకారం ఆత్మహత్యలు నాలుగు రకాలు. మనుషులతో అనుబంధాలు ఎక్కువైనవారు వారికోసం చనిపోవడానికి సిద్ధమవుతారు. ప్రజల్ని విపరీతంగా ప్రేమించే విప్లవకారులు ప్రజలకోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడడాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇది బలిదానాల ఆత్మహత్య (Altruistic suicide). మనుషులను అతిగా ద్వేషించేవారు కూడా అనుబంధాలు పూర్తిగా లోపించి, ఒంటరివారైపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది అహంభావ ఆత్మహత్య (Egoistic Suicide). అధిక నియంత్రణ, నిర్బంధాలను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇది బలవన్మరణం (Fatalistic Suicide). నియమ నిబంధనల్ని బంధనాలుగా భావించేవారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది నిబంధనోల్లంఘన ఆత్మహత్య (Anomic Suicide). నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నప్పుడు మనకు అభ్యుదయకరంగా, విప్లవకరంగా అనిపిస్తుంటుంది. ఉల్లంఘించలేకపోతే.. ఓ సాలెగూడు బంధించేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. పాత నిబంధనల్ని ఉల్లంఘించినప్పటికీ కొత్త నిబంధనల్ని రూపొందించుకుని పాటించేవారు బహు అరుదుగా ఉంటారు. వాళ్లు మార్గదర్శకులు అవుతారు.
ఆత్మహత్యల రేటు కొన్ని దేశాల్లో ఎక్కువగానూ, కొన్ని దేశాల్లో తక్కువగానూ ఉంటుంది. దానికి కారణం ఆయా సమాజాల్లోని సంఘీభావ స్థాయిల్లో వ్యక్తమయ్యే హెచ్చుతగ్గులే. మనం కల్లోల దేశాలుగా భావించే ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్‌లలో ఆత్మహత్యల రేటు చాలా తక్కువ. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల్లో ఆత్మహత్యల రేటు చాలా ఎక్కువ. సంఖ్యాపరంగా చూస్తే అత్యధిక ఆత్మహత్యలు మనదేశంలోనే జరుగుతున్నాయి. చారిత్రక దశలను బట్టి ఆత్మహత్యల రేటు మారుతూ ఉంటుంది. ఉద్యమాలు, విప్లవ పోరాటాలు, పొరుగుదేశాలతో యుద్ధాలు కొనసాగుతున్న కాలంలో మనుషుల మధ్య అనుబంధాలు, సంఘీభావం చాలా ఉన్నతస్థాయిల్లో ఉంటాయి. ఆ ఉద్యమాలు, యుద్ధాలు, పోరాటాలు ముగిశాక ఫలాల కోసం పోటీ పెరిగి సంఘీభావం అంతరించిపోతుంది. సామాజిక నైతికతను, న్యాయ నియమాలనూ ఉల్లంఘించే ఒక అరాచక సంస్కృతి విజృంభిస్తుంది. అలాంటి దశల్లోనే ఆత్మహత్యల రేటు పెరుగుతుంది. ప్రేమైక సంఘీభావ సమాజాల్లో (Altruistic Society) ఆత్మహత్యల రేటు తక్కువగా ఉంటుందని, విద్వేష సమాజాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుందని పదేళ్లక్రితం సోషల్ మీడియాలో నేనొక పోస్టు పెట్టాను. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మహిళా లెక్చరర్ నా వాదనను గట్టిగా వ్యతిరేకించారు. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు తదితర మానసిక దౌర్బల్యాల కారణంగానే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారని ఆమె వాదించారు. కొన్ని రోజుల పాటు మా మధ్య వాదన కొనసాగింది. నేను సమాజశాస్త్ర విద్యార్థిని, ఆమె మనస్తత్వశాస్త్ర ఉపన్యాసకురాలు. మా మధ్య ఎక్కడా రాజీ కుదరలేదు. విషాదకర విషయం ఏమిటంటే... సదరు అధ్యాపకురాలు ఓ మూడు నాలుగేళ్ల తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు పెళ్లయింది; భర్త ఉన్నాడు. విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తితో సహజీవనం ఆరంభించారట. అతనూ వివాహితుడు, భార్యా, పిల్లలు ఉన్నారు. అతను కూడా విడాకులు తీసుకోలేదు. కనీసం భార్య నుంచి నిరభ్యంతర పత్రం (NOC) కూడా తీసుకోలేదు.
విడాకులు తీసుకోని వివాహిత స్త్రీ పురుషులు సహజీవనాన్ని కొనసాగించడం సామాజిక తప్పిదం. వాళ్ల శాసనోల్లంఘనం అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ పత్రాలు వేటిల్లోనూ తాము సహజీవనం చేస్తున్నట్టు నమోదు చేసుకోలేదు. పెన్షన్ పత్రాల్లో నామినీగా చేర్చుకోలేదు. సదరు సహజీవన పురుషుని సమీప బంధువు పేరిట ఉన్న స్థలంలో ఈమె ఒక ఇల్లు కట్టారు. ఇంటి డాక్యుమెంట్స్‌ను తన పేరిట మార్పించుకోలేదు. భావోద్వేగాల ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ అక్కరలేదు అనుకుని ఉండవచ్చు. కొన్నాళ్లకు ఆ సహజీవన పురుషుడు చనిపోయాడు. శవాన్ని అతని భార్యా పిల్లలు తీసుకునిపోయారు. శవాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే.. ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్టే (మళ్ళీ మార్క్స్ గుర్తుకు వస్తున్నాడు). మరికొన్నాళ్లకు ఆ స్థల యజమాని వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ లేడీ లెక్చరర్ అన్నింటినీ కోల్పోయారు. విషాదం ఏమంటే ఆమె క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఏ ఒక్కటీ మిగలలేదు. నిబంధనోల్లంఘనల ఫలితం ఆమె ఆత్మహత్య.
సామాజిక అంశాలను మాత్రమే పట్టించుకుని వ్యక్తిత్వ, మనస్తత్వ అంశాలను నిర్లక్ష్యం చేశాడని డ్యూర్కైమ్ మీద ఒక విమర్శ ఉంది. తరచి చూస్తే.. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, నైతికత మొదలైన వ్యక్తిత్వ, మనస్తత్వ అంశాలు కూడా ఆధునిక సమాజ ఉత్పత్తులే. భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తెలిసిన ఏ భార్య అయినా ముందుగా భావోద్వేగంతో తీవ్ర అభ్యంతరం చెప్తుంది. ఆ వెనుక ఆమెకు తన భయానికి అసలు కారణం తెలుస్తుంది. తనదీ, తన పిల్లలది అనుకుంటున్న ఆస్తికి మరొకరు వాటాదారులుగా వస్తుంటే తాము నిరాశ్రయులమైపోతామనేది ఏ భార్యకయినా సమంజసమైన ఆందోళనే. భావోద్వేగాలకు మాత్రమే పరిమితమయ్యేవారు అక్కడే ఆగిపోతారు. కొంచెం లౌక్యం తెలిసినవారు దానికో ఆర్థిక పరిష్కారాన్ని వెతుకుతారు.
వివాహేతర సంబంధాల్లో పురుషులకు ఉన్నంత అనుకూలత స్త్రీలకు లేదు. అయితే, స్త్రీలు కొంచెం తెలివిని ఉపయోగించి పరిస్థితిని తమకు అనుకూలంగా కాకపోయినా, ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ‘కొత్తగా వచ్చే ఆమెకు భర్త ఆస్తిలో వాటా ఇవ్వరాదు, కొత్తామెతో పిల్లల్ని కనరాదు’ వంటి కొన్ని షరతులు పెట్టి రెండు కుటుంబాలు అన్యోన్యంగానే కొనసాగిన సెలబ్రిటీల ఉదాహరణలు మన ముందు కొన్ని ఉన్నాయి. ఒక వివాహిత పురుషునితో సహజీవనం చేయాలనుకున్న స్త్రీ ముందుగా మొదటి భార్య నుంచి అతను విడాకులో, కనీసం నిరభ్యంతర పత్రమో పొందేలా జాగ్రత్తపడాలి. ఈ సంప్రదాయం కూడా ఇప్పుడు మన సమాజంలో ఉంది. విడాకులో, నిరభ్యంతర పత్రమో పొందడం వేరు; పొందుతామనే నమ్మకంతో ముందుగానే సహజీవనం మొదలు పెట్టేయడం వేరు. ఇలాంటి తప్పులు ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు.
ఆర్థిక నియమాల ఆధారంగా ఇప్పుడు సమాజంలో సంక్లిష్ట కుటుంబాలు, మిశ్రమ కుటుంబాలు, సవతి కుటుంబాల (complex family, blended family and step family) పేరిట కొత్త దాంపత్య బంధాలు ఏర్పడుతున్నాయి. ఈ ధోరణి పెరుగుతోంది కూడా. ఇప్పటికీ చాలామంది దాంపత్యానికి ఉన్న ఆర్థిక పునాదిని గుర్తించక, నివారించదగ్గ ఇబ్బందుల్ని కూడా విస్మరించి కొత్త చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. ‘ప్రేమ భావోద్వేగ అంశం’ అన్నంత వరకు పేచీ లేదుగానీ, వివాహాన్ని భావోద్వేగానికి పరిమితం చేయడం కుదరదు. వివాహం ఒక వ్యవస్థ. వివాహ బంధంలోకి ప్రవేశించాలన్నా, అందులో నుంచి బయటికి రావాలన్నా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
డానీ
సమాజ విశ్లేషకుడు
ఇవి కూడా చదవండి..
క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి