అంబేడ్కర్ ఉంటే ఏం చేసే వారంటే
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:33 AM
‘ఇప్పుడు అంబేడ్కర్ ఉంటే ఏం చేసేవారు?’ అని ‘డానీ’ రాసిన వ్యాసం చూశాను (మే 24). అంబేడ్కరూ, రాజ్యాంగమూ, హింసామార్గమూ- అనే విషయాల్లో, డానీ గమనించని సంగతులు కొన్ని ఉన్నాయనిపించి, ఇది రాస్తున్నాను...
‘ఇప్పుడు అంబేడ్కర్ ఉంటే ఏం చేసేవారు?’ అని ‘డానీ’ రాసిన వ్యాసం చూశాను (మే 24). అంబేడ్కరూ, రాజ్యాంగమూ, హింసామార్గమూ- అనే విషయాల్లో, డానీ గమనించని సంగతులు కొన్ని ఉన్నాయనిపించి, ఇది రాస్తున్నాను.
(1) ‘మావోయిస్టులది, ప్రకటిత హింసా మార్గం’ -అన్నారు డానీ. మావోయిస్టులు హింసని ప్రయోగించిన సందర్భాల్ని గమనించవలిసిందే గానీ, వారి మార్గాన్నంతా హింసా మార్గంగానే భావించరాదని నా అభిప్రాయం.
అసలు చరిత్రలో, శ్రామికుల వర్గాన్ని అన్యాయంగా, బలప్రయోగంతో అణచడానికి దోపిడీ వర్గం ఏర్పర్చుకున్నదే రాజ్యాంగ యంత్రం! మానవ చరిత్రలో ప్రారంభం నించీ, శ్రమ దోపిడీ వర్గానిదే ప్రకటిత హింసామార్గం. అనాదిగా, బానిస యజమానుల కాలం నించీ ప్రారంభమైంది దోపిడీ వర్గ హింసా మార్గమే. ఆ హింసా మార్గాన్ని ఎదుర్కొని, పాలకవర్గాధికారాన్ని కూల్చివేసి, దోపిడీనించీ విముక్తి చెందడానికి, శ్రామిక వర్గానికి ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ చూపిన మార్గం ‘బలప్రయోగం’! ఆ మార్గంలో, ఆ వర్గం ఎన్ని అపజయాలు పొందినా, అదే దానికి స్వయం రక్షణ మార్గం. చరిత్రని చూస్తే, హింసని ప్రారంభించింది, దోపిడీ పీడనలకు గురి అయ్యే శ్రామిక జనాలు -అని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లేవు. ఈ కాలపు ఉదాహరణే తీసుకుంటే, చారెడైనా భూమిలేని కూలీలూ, కౌలు రైతులూ, ‘దున్నేవాళ్ళకే భూమి’ అనే నినాదంతో, కమ్యూనిస్టుల నాయకత్వంలో సిద్ధపడితే, ప్రభుత్వం ఊరుకోదు. బలప్రయోగంతో అణిచివేస్తుంది. అప్పుడు స్వయంరక్షణ కోసం కమ్యూనిస్టులు కూడా, తప్పనిసరై, హింసా మార్గాన్నే అనుసరిస్తారు. ‘సాయుధ పోరాటమే ఏకైక మార్గం!’, ‘వర్గ శతృవు రక్తంలో చేతులు ముంచనివాడు విప్లవకారుడే కాదు!’ అనే తప్పుడు నినాదాల్ని, ప్రారంభకాలం నాటి మావోయిస్టు నాయకుడు చారుమజుందారు కూడా, మొదట్లోనే ఇవ్వలేదు. తెలంగాణ రైతాంగ పోరాటంలో గానీ, నక్సల్ బరీ పోరాటంలో గానీ, హింసని మొదట ప్రారంభించింది కమ్యూనిస్టులు కాదని చరిత్ర చెబుతోంది. కాబట్టి, ‘మావోయిస్టులది ప్రకటిత హింసా మార్గం’ అనడం న్యాయం కాదు.
(2) ‘భారత రాజ్యాంగం ఆధునిక పవిత్ర గ్రంథం’ అనీ, ప్రభుత్వం చేసే హింస, ఆ పవిత్ర గ్రంథంలో ఉన్న ‘ఆదర్శాలకూ, మార్గదర్శకాలకూ అనుగుణంగా’ లేదనీ భావించారు డానీ. ప్రభుత్వం చేపట్టిన హింసామార్గాన్ని ఖండించడానికి, రాజ్యాంగాన్ని ‘పవిత్ర గ్రంథం’గా వర్ణించనక్కరలేదు. వర్గాలుగా విడిపోయివున్న ఏ దేశంలో అయినా, రాజ్యాంగం అనేది, అక్కడ ఉండే ప్రభుత్వాలకు, ప్రత్యర్థుల్ని, ముఖ్యంగా విప్లవకారుల్ని అణచడానికి రకరకాల చట్టాల్ని అందుబాటులో ఉంచుతుంది. అసలు, ఒక సమాజంలో సైన్యమూ, పోలీసూ, రకరకాల సాయుధ బలగాలూ, ఆయుధాలూ, గూఢచారి వ్యవస్థ ఉన్నాయంటే, అవసరమైనప్పుడు, ఆ ప్రభుత్వాలు హింసా మార్గం అనుసరించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం. అందుకే, ఇప్పటి సందర్భంలో, కగార్లనీ, బ్లాక్ ఫోరెస్టుల్నీ, డ్రోన్లనీ, రకరకాల పేర్లున్న అరడజను సాయుధ బలగాల్నీ ఉపయోగించడం! వీటిని ఉపయోగించకూడదని, డానీ చెప్పిన ‘పవిత్ర రాజ్యాంగం’లో ఎక్కడా లేదు!
(3) ‘ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమానత్వాన్ని’ సాధించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించకపోతే, బాధితులైన ప్రజలు తిరగబడతారని రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్‌గా అంబేడ్కర్ హెచ్చరించార’ని డానీ అంటున్నారు. అవును, ఆయన అలా అన్న మాట నిజమే! మరి, ఆయన అలా హెచ్చరించిన సమయంలోనే, 1948 సెప్టెంబరులో, తెలంగాణ గ్రామాలలోకి, కమ్యూనిస్టుల నాయకత్వాన నడుస్తున్న రైతాంగ పోరాటం ఒక రకమైన సమానత్వాన్ని కోరుతూ జరుగుతున్నదే గదా? మరి అలాంటి బాధితుల పోరాటాన్ని అణచడానికి, 50 వేల సైన్యాన్ని పంపిన ప్రభుత్వంలో అంబేడ్కర్ ఒక మంత్రిగా ఎలా ఉండగలిగారు? ఇప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్న హింసా మార్గాన్ని ఖండించడానికి, అణచివేత చట్టాలకూ, సాయుధ బలగాలకూ వీలునిచ్చిన రాజ్యాంగాన్ని తయారుచేసిన రచనా కమిటీలో ఉన్నవ్యక్తి మాటల్ని ఉటంకించడం వల్ల, పాఠకులు అటు రాజ్యాంగాన్ని గానీ, ఇటు ఆ వ్యక్తిని గానీ, సరిగా అర్థం చేసుకోవడం వీలు కాదు. ఆనాడే, రైతాంగం మీదా, వారి తరఫున పోరాడుతున్న కమ్యూనిస్టుల మీద, తన ప్రభుత్వమే హింసాకాండ జరుపుతున్నప్పుడు, ఏమి చెయ్యని అంబేడ్కరు, ఇప్పుడు జరుగుతున్న హింసని చూసి ‘ఏమి చేసేవాడో’ అని ప్రశ్నించడం తార్కికంగా లేదు.
కొన్ని విషయాల్ని గమనించకపోయినా, ఆదివాసీల పట్లా, వారిని సంఘటితం చేసి, వారి తరఫున పోరాడుతున్న మావోయిస్టుల పట్లా, సహృదయమైన ప్రేమతోనే సాగింది డానీ వ్యాసం. కానీ, అణచివేతకి ఆస్కారం ఇచ్చే రాజ్యాంగాన్ని ‘పవిత్ర గ్రంథం’ అనడం, అంబేడ్కరు ఉంటే ఏదో చేసే వారన్నట్టు రాయడం వల్ల, కొన్ని భ్రమల్ని కలిగించే ప్రమాదం ఉంది.
నౌరోజీ
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News