Share News

ఈ వలసల ఆరాటం ఏనాటిదో..!

ABN , Publish Date - Feb 26 , 2025 | 06:12 AM

పంతొమ్మిదవ శతాబ్దపు చివరి దశాబ్దాలకే అమెరికా ‘ది న్యూ వరల్డ్’ (కొత్త ప్రపంచం)గా ఆవిర్భవించింది. విశాలమైన భూభాగం; దినదిన ప్రవర్ధమానమౌతున్న పారిశ్రామిక రంగం; విస్తరించిన వ్యవసాయ, ఉత్పాదన రంగాలు...

ఈ వలసల ఆరాటం ఏనాటిదో..!

పంతొమ్మిదవ శతాబ్దపు చివరి దశాబ్దాలకే అమెరికా ‘ది న్యూ వరల్డ్’ (కొత్త ప్రపంచం)గా ఆవిర్భవించింది. విశాలమైన భూభాగం; దినదిన ప్రవర్ధమానమౌతున్న పారిశ్రామిక రంగం; విస్తరించిన వ్యవసాయ, ఉత్పాదన రంగాలు; ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్న లాభాలు, పటిష్ఠమైన ప్రజాస్వామ్య, ఉన్నత విద్యా వ్యవస్థలు, అపారమైన వ్యక్తి స్వేచ్ఛ, వేళ్లూనుకుంటున్న ఆధునిక జీవనశైలి లాంటి అంశాల దృష్ట్యా అమెరికాను పాశ్చాత్య నాగరికతకు ప్రతీకగా, అవకాశాల పెన్నిధిగా యావత్ ప్రపంచం గుర్తించింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు అమెరికాకు వలసపోవడానికి ఉద్యుక్తులయ్యారు. వీరిలో శ్రామికులు, విద్యావంతులు, వ్యాపారులు, వ్యవసాయదారులు ఉండేవారు. అత్యధికులు ఉపాధి అవకాశాల కోసమే అక్కడకు వెళ్ళేవారు.

1790లో ఒక క్రైస్తవ మతబోధకుడితో మొదలైన భారతీయుల అమెరికా వలస పంతొమ్మిదవ శతాబ్దపు నడుమకల్లా పశ్చిమ తీరాన చిన్న చిన్న వ్యాపార స్థావరాల ఏర్పాటుతో ఊపందుకున్నది. వందల సంఖ్యలో పంజాబీలు, ముఖ్యంగా సిక్కులు వివిధ మార్గాలగుండా అమెరికా చేరుకునేవారు. 1910 కల్లా అధికారికంగా భారతీయుల సంఖ్య 3000కు చేరుకోగా అనధికారంగా అమెరికా పౌరులుగా చలామణి అయ్యేవారి సంఖ్య ఎన్నోరెట్లు అధికంగా ఉండేది.


ఆసియా ఖండం నుండి ప్రజల వలసలను నిరోధించడానికి ‘ఆసియన్ ఎక్స్‌క్లూజన్‌ లీగ్’ అనే సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ‘ఓరియంటల్ ఎక్స్‌క్లూజన్‌ ఏక్ట్ అఫ్ 1923’ అనే చట్టాన్ని ప్రవేశపెట్టించింది. పెరుగుతున్న జపాన్ ప్రాబల్యం, పారిశ్రామిక ప్రగతిని 1897లో జాక్వెస్ నోవికోవ్ అనే రష్యన్ మేధావి ‘ఎల్లో పెరిల్’ (పసుపు ప్రమాదం)గా అభివర్ణించగా, రష్యాపై జపాన్ గెలుపు, అదే విధంగా జపాన్, చైనాల నుండి పెరుగుతున్న వలస నేపథ్యంలో ‘ఎల్లో పెరిల్’కు మరింత ప్రాచుర్యం లభించింది. పాశ్చాత్య దేశాల అస్తిత్వానికి ఏషియన్లు ప్రమాదకారులన్న ఒక జాత్యహంకార భావన ఇది. వీరి నుండి తమ అవకాశాలకు ముప్పు వాటిల్లనుందని అభద్రతా భావంతో శ్వేతజాతి దురహంకార సంస్థలు జపనీయుల నివాస సముదాయాలపై భౌతిక దాడులు కూడా చేసేవారు. భారతీయులకు పౌరసత్వాన్ని నిరాకరించడానికి ప్రధాన ప్రాతిపదిక వారు తెల్లజాతివారు (కకెసియన్ తెగ) కాకపోవడమే. ఈ కారణంగా యూరోపియన్లకు సునాయాసంగా లభించే పౌరసత్వం భారతీయులకు గగనమయ్యేది.

అమెరికాలో న్యాయ పోరాటం చేసి ఆ దేశ పౌరసత్వాన్ని చేజిక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడు భికాజీ బల్సారా. జొరాస్ట్రియన్ (పార్శి) అయిన బల్సారా 1900లో నూలు వర్తకునిగా అమెరికాలో అడుగుపెట్టాడు. న్యూయార్క్‌లో స్థిరపడి 1906లో పౌరసత్వానికై దరఖాస్తు చేసుకోగా అది తిరస్కారానికి గురైంది. అప్పటికి అమలులో ఉన్న దేశీయకరణ చట్టం, 1790, ప్రకారం కేవలం స్వతంత్ర శ్వేత జాతీయులే పౌరసత్వానికి అర్హులు. ఆ నిరాకరణను వలస దేశం నుండి వచ్చిన శ్వేతేతరుడైన బల్సారా న్యూయార్క్ సర్క్యూట్ కోర్టులో సవాలు చేస్తూ తాను పార్సీని గనుక శ్వేత (ఇండో యూరోపియన్ ఆర్య) జాతికే చెందుతానని వాదించాడు. ఈ ప్రాతిపదికపై అతనికి పౌరసత్వాన్ని ఇస్తే పెక్కుమంది ఆఫ్ఘన్లు, హిందువులు, అరబ్బులు కూడా పౌరసత్వానికి అర్హులవుతారని పేర్కొంటూ అతని వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. అయితే, బల్సారా ఉన్నత వ్యక్తిత్వం కలవాడని, ఆయన సర్క్యూట్ కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చునని సెలవిచ్చింది. సర్క్యూట్ కోర్టు ‘శ్వేతజాతి’ అంటే, నలుపు, పసుపు, గోధుమ వర్ణ సమూహాలకు చెందనిది కనుక పార్సీలను శ్వేతజాతిగా పరిగణిస్తూ బల్సారాకు 1909లో పౌరసత్వాన్ని ప్రసాదించింది.


ఇక, అమృత్‌సర్‌ జిల్లాలో పుట్టి పట్టభద్రుడైన భగత్‌సింగ్ థీండ్ ఫిలిఫైన్స్‌లో కొంత కాలం పనిచేసి మనీలా నుండి కష్టాలు పడి సముద్ర మార్గాన మిన్నెసోటా చేరుకున్నాడు. ప్రయాణం మధ్యలో ఆయన సోదరుడు మరణించాడు. గద్దర్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈయనతో పాటు మరొక ఏడువేల మంది పంజాబీలపై నిఘా పెట్టింది. 1918లో ప్రథమ ప్రపంచ సంగ్రామంలో అమెరికన్ సైనికుడిగా వాషింగ్టన్‌లో సేవలందించినందుకు గాను థీండ్‌కు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ‘క్యాంపు లూయిస్’ జిల్లా కోర్టు ద్వారా ప్రభుత్వం అందించింది. కానీ థీండ్ హిందువు గనుక శ్వేత జాతి కింద పరిగణించలేమని అతని ధ్రువీకరణపత్రాన్ని ‘బ్యూరో ఆఫ్ నేచురలైజేషన్’ తృణీకరించింది. అప్పట్లో భారత ఉపఖండం నుండి వలస వెళ్లిన ముస్లిమేతరులందరూ హిందువులుగానే పరిగణింపబడేవారు. వెంటనే థీండ్ స్టేట్ ఆఫ్ ఒరెగాన్‌కు దరఖాస్తు చేయగా ఆయన విద్యార్హతలు, శ్వేతజాతి వారితో ఉన్న సత్సంబంధాలు, ఆయన ఉన్నత కులం (జాట్), ఆయన సత్ప్రవర్తన లాంటి అంశాలను చూపి, బ్యూరో ఆఫ్ నేచురలైజేషన్ అభ్యంతరాలనూ ఆయన బ్రిటిష్ వ్యతిరేక విద్రోహ చర్యలనూ సైతం తోసిపుచ్చి పారసత్వానికి అర్హుడిగా ప్రకటించింది. దీనిని కూడా బ్యూరో సుప్రీమ్ కోర్టులో సవాలు చేసి రద్దు చేయించింది. ఇదే సమయంలో డబ్బై మంది భారతీయుల పౌరసత్వం రద్దయింది. అదే తరుణంలో మొదటి ప్రపంచ యుద్ధ వీరులందరికీ పౌరసత్వాన్ని ప్రసాదించవచ్చునన్న చట్టం అమలులోకి వచ్చి థీండ్‌కు పౌరసత్వం లభించింది. తన న్యాయ పోరాటం ఆద్యంతమూ థీండ్ తాను అగ్రకులానికి చెందిన ఆర్యుడిననే వాదిస్తూ వచ్చాడు.


అక్షయ కుమార్ మజుందార్ పౌరసత్వ వివాదం కూడా ఆసక్తికరమైనదే. కలకత్తా సమీపంలో ఒక కులీన బ్రాహ్మణ కుటుంబంలో 1881లో జన్మించిన మజుందార్ తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక చింతనలో పరిపూర్ణ విఙ్ఞానాన్ని సంపాదించాడు. క్రైస్తవాన్ని ఔపోసన పట్టిన ఆయన చైనా జపాన్లలో కొంతకాలం బోధించి 1904లో సీటెల్ చేరుకొని అమెరికాలో తన ‘న్యూ థాట్’ ఉద్యమాన్ని మేధావి వర్గంలోనికి చొచ్చుకుపోయేలా చేయగలిగాడు. హైందవ క్రైస్తవ భావజాలాన్ని మిళితపరిచి ‘క్రిస్టియన్ యోగా’ను అమెరికన్ సమాజానికి పరిచయం చేసాడు. 1930లో ముద్రితమైన ఈయన గ్రంథం ‘ది హిందూ హిస్టరీ’ ప్రజాదరణ పొందింది. మజుందార్ దేశ స్వాతంత్రాన్ని కాంక్షించేవాడు. ఈయన కూడా బల్సారా, థీండ్‌ల వలె తాను హైందవ సమాజంలో అత్యున్నత స్థాయి కులానికి చెందినవాడిని గనుక ఆర్యుడిగా (కకెసియాన్) పరిగణించాలని స్పోకేన్ జిల్లా కోర్టును ఒప్పించి పౌరసత్వాన్ని పొందాడు. అయితే థీండ్ పౌరసత్వ విషయంలో సుప్రీమ్ కోర్టు తీర్పు ఆధారంగా మజుందార్ పౌరసత్వం రద్దు చేయబడింది. 1946లో తూర్పు భారతదేశం నుండి వలస వచ్చిన వంద మందికి పౌరసత్వ అర్హతను కల్పిస్తూ అమలులోనికి వచ్చిన ల్యూస్ సెల్లర్ చట్టం కింద మజుందార్ 1950లో అమెరికా పౌరుడు కాగలిగాడు.

అమెరికా పౌరసత్వానికై భారతీయుల ఆరాటానికి వందేళ్ళకు పైబడిన చరిత్ర ఉంది. ఇక, 1965లో వచ్చిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌ వలన తెరుచుకున్న అమెరికా ద్వారాలు లక్షల మందికి ప్రవేశాన్ని, ఉపాధిని కల్పించాయి. అక్కడి విలాసవంతమైన ఆధునిక జీవన శైలి, అవకాశాలు, అవినీతిరహిత సమాజం, పటిష్ఠమైన ప్రభుత్వ యంత్రాంగం, స్వేచ్ఛ, వినిమయ సంస్కృతి ఆ దేశాన్ని ఆకర్షణీయమైన గమ్యంగా నిలిపాయి. అగ్రరాజ్యంగా అమెరికా వెలుగొందుతున్నంత కాలం వలసలు కొనసాగుతూనే ఉంటాయి.

ప్రొ. కొట్టు శేఖర్

మిజోరం యూనివర్సిటీ


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 06:12 AM