Insurance Sector FDI: ఏమైంది ఆ స్వదేశీ నినాదం
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:44 AM
పంద్రాగస్టు సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన స్వదేశీ నినాదాన్ని బేఖాతరు చేస్తూ, భారత ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించుకొమ్మంటూ విదేశస్థులకు పార్లమెంట్ ఆహ్వానాన్ని పలికింది. అందుకేనేమో...
ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74శాతం నుంచి 100శాతానికి పెంచడాన్ని దేశీయ కంపెనీలు గానీ, ప్రజానీకం గానీ కోరుకోలేదు. కేవలం విదేశీ పెట్టుబడికి తలొగ్గి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.
పంద్రాగస్టు సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన స్వదేశీ నినాదాన్ని బేఖాతరు చేస్తూ, భారత ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించుకొమ్మంటూ విదేశస్థులకు పార్లమెంట్ ఆహ్వానాన్ని పలికింది. అందుకేనేమో విదేశీ కంపెనీలు భారత్‌లో ఇన్సూరెన్స్ వ్యాపారం చేసుకోవచ్చనే చట్టం తయారవుతున్న సందర్భంలో ప్రధానమంత్రి విదేశీ యాత్రలో ఉన్నారు!
ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74శాతం నుంచి 100శాతానికి పెంచడం వల్ల విదేశీ కంపెనీలకు పెద్ద మొత్తంలో అవకాశం (యాక్సెస్) లభిస్తుంది తప్ప, దేశీయ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎలాంటి లాభమూ ఉండదు. ఇప్పుడున్న 74శాతం ఎఫ్‌డీఐ పరిమితిని ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీ పూర్తిగా వినియోగించుకోలేదు. విదేశీ భాగస్వామ్య కంపెనీలు తమకు లభించిన అనుమతి ప్రకారం ఇండియా భాగస్వామితో ప్రారంభించిన కంపెనీలో 74శాతం విదేశీ పెట్టుబడినీ తీసుకురాలేదు. 25 ప్రైవేట్ కంపెనీలలో కలిపి ఇప్పటి వరకు సగటున కేవలం 32.6శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎఫ్‌డీఐల పరిమితి 100శాతానికి పెంచడం ద్వారా మూడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి: 1) విదేశీ కంపెనీలకు స్వదేశీ కంపెనీలు తమ వాటా మొత్తాన్ని అమ్ముకొని ధారాదత్తమైపోవచ్చు. 2) వందశాతం విదేశీ పెట్టుబడితో ఏర్పడబోయే కొత్త ప్రైవేట్ కంపెనీలతో భారత ఇన్సూరెన్స్ మార్కెట్‌పై విదేశీ కంపెనీల ప్రాబల్యం పెరుగుతుంది. 3) భారతదేశ ప్రజల పొదుపుపై విదేశీ కంపెనీల ఆధిపత్యం మరింత పెరుగుతుంది.
దేశీయ కంపెనీలు గానీ, లేదా ప్రజానీకం గానీ ఈ పెంపును కోరుకోలేదు. కేవలం విదేశీ పెట్టుబడికి తలొగ్గి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ పెట్టుబడి అజమాయిషీ మన దేశంపై ప్రబలంగా ఉందనడానికి ఇది ఇదర్శనం. ఈ ఎఫ్‌డీఐ పెంపు ద్వారా ‘సబ్ కా బీమా’ సాధించడమనే నినాదం అర్థరహితం. అందరికీ బీమా సౌకర్యాన్ని అందివ్వాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగాలి తప్ప, విదేశీ కంపెనీలొచ్చి పాలసీలను అమ్మడానికి ప్రయత్నిస్తే జరగదు. పైగా పట్టణ వ్యాపారమంతా విదేశీ కంపెనీలకు ధారాదత్తమయ్యే ప్రమాదముంది. భారతదేశంలో ప్రారంభం కానున్న విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలను పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలోనే పనిచేయవలసిందిగా ఆదేశిస్తే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ విస్తరించే అవకాశమే లేదు.
ఇక పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు, విదేశీ కంపెనీలు తమ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోకుండా చూస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిని రిపాట్రియేషన్ క్లాజ్ అంటారు. నిజానికి 2021 కన్నా ముందు, అనగా ఎఫ్‌డీఐల పరిమితి 49శాతం వరకే ఉన్నప్పటి వరకు, ఈ రీపాట్రియేషన్ క్లాజ్ వర్తించేది. 2021 తర్వాత దీనికి చరమగీతం పాడారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీలు తాము తీసుకొచ్చిన పెట్టుబడి తరలించడానికి వీలు లేదు కానీ, ఆర్జించిన లాభాలను ఎప్పుడైనా తరలించుకుని పోయే వెసులుబాటు ఉన్నది. ‘ప్రజలు దేన్నైనా నమ్ముతారు, వెరిఫై చేసుకోరు’ అనే ఒక అంచనాతో పాలకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు.
2000 సంవత్సరంలో... ప్రైవేట్ కంపెనీలకు భారత ఇన్సూరెన్స్ మార్కెట్‌లో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంలో, ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ పలు వాదనలు ముందుకువచ్చాయి. భారతదేశంలో ఇన్సూరెన్స్ విస్తరణ చాలా తక్కువగా ఉన్నదనీ, అందుచేత ప్రైవేట్ కంపెనీల ఆగమనంతో దానిని పెంచవచ్చుననీ కొందరు అన్నారు. కొత్త కంపెనీల ఆవిర్భావంతో ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు అని కూడా అన్నారు. పోటీతత్వం పెరిగి పాలసీ ప్రీమియంల రేట్లు తగ్గి, అవి మరింతగా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. కానీ పాతికేళ్ళ క్రితం 3.1శాతం ఉన్న ఇన్సూరెన్స్ విస్తరణ ఈనాటికీ అదేస్థాయిలో 3.5శాతం దగ్గర తచ్చాడుతున్నది. ఉపాధి కల్పన, పోటీతత్వం ద్వారా రేట్లు తగ్గడం అన్న వాదనలు ఏవీ నిజరూపం దాల్చలేదు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు ఏవీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడానికి ముందుకు రాలేదు. మహా అయితే ఏజెంట్ల సంఖ్యలో కొంత పెరుగుదల ఉన్నది. కానీ ఎల్‌ఐసీ ఏకస్వామ్యమే కొనసాగినా ఇదే స్థాయిలో ఏజెంట్ల రిక్రూట్‌మెంట్ జరిగి ఉండేది. ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ కంపెనీలు భాగస్వాములుగా 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాయి. దఫదఫాలుగా 26శాతం నుంచి 2015లో 49శాతానికి, 2021లో 74శాతానికి ఎఫ్‌డీఐల పరిమితిని పెంచినప్పటికీ ఫలితాలు ఆశించినంతగా రాలేదు. ఏదేమైనా ఆగమేఘాల మీద దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా నిలిచే ఇన్సూరెన్స్ చట్ట సవరణను పూర్తిచేశారు. దీనివల్ల ప్రజల పొదుపులపై విదేశీ సంస్థల ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రతి ఏటా రూ.10,00,000కోట్లకు పైబడి కొత్త ఇన్సూరెన్స్ వ్యాపారం జరుగుతున్నది. ఇది దాదాపు పది రాష్ట్రాల సంవత్సర బడ్జెట్‌తో సమానం! దేశీయ ఇన్సూరెన్స్ మార్కెట్‌ను పూర్తిగా విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసే ఈ చర్యతో తిరోగమన ఫలితాలకు నాంది పలికినట్లే.
జి. తిరుపతయ్య
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..