సంక్షేమ పథకాలతోనే సంక్షోభం
ABN , Publish Date - May 15 , 2025 | 01:58 AM
‘‘రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు.. అప్పు పుడుతలేదు.. ఎవడూ అణాపైసా ఇస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోయేటట్టున్నడని ఎవడూ కూడా అపాయింట్‌మెంట్ ఇస్తలేరు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి...
‘‘రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు.. అప్పు పుడుతలేదు.. ఎవడూ అణాపైసా ఇస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోయేటట్టున్నడని ఎవడూ కూడా అపాయింట్‌మెంట్ ఇస్తలేరు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోన్ని. 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్న ఏంజేస్తరు నన్ను? కోసుకొని తింటరా? ఏం జేస్తరు?’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ.. ఉచితాలు తగ్గించాలి. నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి. తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి.. అమ్ముకునే వారికి ఇవ్వొద్దు. కిలో బియ్యం రూ.3 ఉన్నప్పుడు 2 రూపాయలకే అందించిన ఎన్టీ రామారావును దేవుడన్నారు. కానీ ఇప్పుడు కిలో బియ్యం రూ.60గా ఉన్నా ఉచితంగా ఇస్తారా? తెలంగాణలో కోటి పది లక్షల కుటుంబాలు ఉంటే.. కోటి పాతిక లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అంటే పక్క రాష్ట్రాల వారికి కూడా ఇక్కడ కార్డులు ఉన్నాయనేది స్పష్టమవుతోంది.’’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పెట్టడం, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్న పెద్ద సవాల్. సంక్షేమ పథకాలే సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయన్న విషయం ప్రభుత్వం గుర్తెరగాలి. ఆర్థికంగా రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి అనేక మార్గాలున్నాయి. వాటిలో కొన్నిటినైనా అమలు చేస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైన పథకాలను మాత్రమే కొనసాగిస్తూ, ప్రభుత్వానికి అధికంగా ఆదాయం ఇచ్చే వనరులను సమకూర్చుకోవడం ఎంతైనా అవసరం.
ఉచిత పథకాలు ప్రజలకు అలవాటు చేసి వాటిని ఎలాగోలా బీఆర్‌ఎస్ అమలు చేసింది. కాని, వీటితో రాష్ట్రం అధోగతి పాలవుతుందని మేధావులు ముందే హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. వాస్తవంగా సంక్షేమ పథకాలు అర్హుల కంటే అనర్హులకే అధికంగా అందుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తే సంక్షేమ పథకాలైన రేషన్‌కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వారిలో 90శాతం మందికి పైగా అనర్హులే ఉంటారు. రాజకీయ ఒత్తిళ్ళు, అధికారుల లంచగొండితనంతో అనేక పథకాలు అనర్హులకు అందుతున్నాయి.
ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించని కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. వృద్ధాప్య పెన్షన్లు పూర్తిగా దిక్కుమొక్కూ లేని అనాథలకు మాత్రమే అమలు చేయాలి. రేషన్‌కార్డులకు కూడా పరిమితి విధించాలి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రేషన్‌కార్డు ఇచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇలాంటివి ఇంటింటికీ వెళ్ళి సర్వే చేసి ఆ రేషన్ కార్డులు తొలగించాలి. చాలా వరకు సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందజేస్తే ఆర్థిక భారం తగ్గుతుంది.
మహ్మద్ మక్సూద్ షరీఫ్
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి