విశాఖకు విశ్వఖ్యాతి
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:17 AM
యోగా డే నాడు విశాఖ చరిత్రలో మహా అద్భుతం జరిగింది. తెల్లవారుజాము నుంచే కనుచూపుమేర ఆర్కే బీచ్ రోడ్డు యోగా అభ్యాసకులతో కిక్కిరిసిపోయింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 30 కిమీ పరిధిలో ఒకే చోట 3.01 లక్షల మందితో...
యోగా డే నాడు విశాఖ చరిత్రలో మహా అద్భుతం జరిగింది. తెల్లవారుజాము నుంచే కనుచూపుమేర ఆర్కే బీచ్ రోడ్డు యోగా అభ్యాసకులతో కిక్కిరిసిపోయింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 30 కిమీ పరిధిలో ఒకే చోట 3.01 లక్షల మందితో యోగాసనాలు వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు అనే బృహత్తర యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో గతంలో గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో 1.47 లక్షల మందితో నిర్వహించిన రికార్డును అధిగమించినట్టయింది. నిజానికి 30 కిమీ మేర 326 కంపార్ట్‌మెంట్‌లలో 3.19 లక్షల మంది ప్రజలు యోగాసనాలు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో చాలామంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. అంతేగాక ఏయూ ఇంజనీరింగ్ మైదానం వేదికగా ఒకేచోట దాదాపు 22 వేల మందికి పైగా విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి మరో రికార్డు నెలకొల్పారు. దీంతో రెండు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుని విశాఖ కేంద్రంగా యోగాంధ్ర సరికొత్త చరిత్ర సృష్టించింది. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది ఆసనాలు వేస్తూ యోగాడేలో పాల్గొనడం, యోగా దినోత్సవానికి 175 దేశాలు మద్దతు ఇవ్వడం, యోగా ప్రపంచ దేశాలను ఏకం చేయ్యడం, ఇది సాధారణ విషయం కాదు.
ఆరోగ్యంపై అవగాహన కలిగిన పెద్దలు, పిల్లలు, విద్యార్థులు, యువత ప్రత్యేక ఆసక్తితో బీచ్‌కు స్వచ్ఛందంగా తరలిరావడం విశేషం. యోగాతో జీవనశైలి మార్చుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో కలిగింది. లక్షలాది మందితో యోగా నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం వెనుక సీఎం చంద్రబాబు ప్రణాళిక, పట్టుదల, కృషి ఉంది. సముద్రతీరంలో లక్షల మంది ఒకేసారి యోగా సాధన చేయడం చరిత్రలోనే అపూర్వఘట్టం.
యోగాంధ్రను విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నది కూటమి ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు చంద్రబాబు. పర్యవేక్షణ కోసం బీచ్ రోడ్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 2,500కు పైగా సీసీ టీవీ కెమెరాలు అమర్చారు. యోగ సాధనలో గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, గిరిజనులు కూడా పాల్గొన్నారు. అందరిలోనూ అవగాహన పెరిగింది.
నేను సూర్యదేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు సైకిల్‌పై వచ్చి యోగా డేలో పాల్గొన్నాను. ఈ తొమ్మిది గంటల సైకిల్ ప్రయాణంలో నాకు రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పిలుపును గౌరవంగా తీసుకుని ఉత్తరాంధ్ర ప్రజలు యోగా డే కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ. ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల మంది ప్రజలు యోగాలో భాగస్వామ్యమయ్యారు. ప్రధానమంత్రి యోగా డే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, ఏపీలోని ఎన్డీఏ నాయకత్వంపట్ల ఎంతో ప్రేమను చూపించారు. యోగాంధ్ర విజయవంతం కావడంతో మంత్రి లోకేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అలాగే పవన్ కల్యాణ్ గారిని కూడా మెచ్చుకున్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేనికైనా హైదరాబాద్ తరువాత విశాఖపట్నం అని పేరు ఉండేది. నేడు విశాఖ నగరం ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు పొందిన ఒక మహానగరంగా ఎదిగింది. మొదటి నుంచీ చంద్రబాబు గారికి విశాఖపట్నంపై ప్రత్యేక గౌరవం, శ్రద్ధ ఉంది. గతంలో హుద్‌హుద్ తుపాను విలయానికి విశాఖ విలవిల్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పది రోజులు బస్సులోనే బస చేసి, విశాఖ సాధారణ స్థితి వచ్చే వరకు నగరం నుంచి బయటకు వెళ్లలేదు. నేడు విశాఖకు ప్రపంచంలో గుర్తింపు రావడానికి చంద్రబాబు కారకులయ్యారు. ‘విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజలందరి సెంటిమెంట్’ అని కూటమి ప్రభుత్వం దానిని కాపాడింది. విశాఖ రైల్వే జోన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ సంస్థలు రానున్నాయి. భవిష్యత్‌లో విశాఖ నగరం మరో ముంబై లాగా తయారు కానున్నది.
యోగాడేపై పెద్ద ఖర్చు చేశారని నేడు జగన్ అండ్ కో నోరు పారేసుకొంటున్నారు. మరి ఋషికొండపై రూ.500 కోట్లతో కట్టిన ప్యాలెస్ గురించి వారు ఏమి సమాధానం చెబుతారు? మొత్తం భారతదేశం యోగా డే ఉత్సవాన్ని శభాష్ అంటూ విశాఖపట్నం వైపు చూస్తుంటే తట్టుకోలేక ఆ విజయాన్ని వైసీపీ నాయకులు పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన సమయంలోనూ వారు ఇదే విధమైన కడుపు మంట మాటలు మాట్లాడారు. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడానికి వెళ్లడం, బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ లాంటి కార్యక్రమాలకు వెళ్లడం ద్వారా జగన్ మోహన్‌రెడ్డి సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు? ఈ పర్యటనలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దేశమంతా మెచ్చుకుంటున్న ‘యోగాంధ్ర డే’ కార్యక్రమంపై జగన్ బురదచల్లటాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
కలిశెట్టి అప్పల నాయుడు
పార్లమెంట్ సభ్యులు, విజయనగరం
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి