Share News

విరసం సాహిత్య పాఠశాల!

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:32 AM

ఇటీవలే మనకు దూరమైన ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా తన జీవితంతో, మరణంతో రగిలించిన ఉత్తేజమూ, సమాజంపైకి సంధించిన చురుకైన ప్రశ్నలూ ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి..

విరసం సాహిత్య పాఠశాల!

ఇటీవలే మనకు దూరమైన ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా తన జీవితంతో, మరణంతో రగిలించిన ఉత్తేజమూ, సమాజంపైకి సంధించిన చురుకైన ప్రశ్నలూ ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. సంకెళ్లలోనే స్వేచ్ఛాగానం చేయడం, చీకటిలో వెలుగును కలగనడం, అణచివేస్తే విముక్తిని ప్రకటించుకోవడం, అంతిమంగా మృత్యువులో కూడా చావును నిరాకరించడం అనేవి ఇంకెంత మాత్రం రొమాంటిక్‌ వ్యక్తీకరణలు కాదని ఆయన నిరూపించారు.

సాయిబాబా సందర్భంలో సాహిత్యకారుల పాత్ర గురించి మాట్లాడుకోవడమంటే ఇదేదో విప్లవ సాహిత్యోద్యమం సొంత గొడవ వెళ్లబోసుకోవడం కాదు. సాహిత్యం నిర్వహించే పాత్రను, సాహిత్యకారుల సామాజిక ఆచరణను మరోసారి మాట్లాడుకోవడమే. ఫాసిజం సాహిత్య కళా మేధో రంగాల ముందుకు తీసుకొచ్చిన అనేక సంక్లిష్ట సవాళ్లను చూడాలి. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకపోవడానికి వాటితో సవ్యంగా వ్యవహరించాలి.


సమస్త కళా సాహిత్యాల ప్రాథమిక షరతు మనుషుల్నీ, సమాజాన్నీ సెన్సిటైజ్‌ చేయడమే. దానితోపాటు రచయితలు, బుద్ధిజీవులు వ్యక్తులుగా, ఒక సమూహంగా ప్రజా జీవితంలో ఎక్కడ నిలబడతారు? తమ విలువలతో, ఆచరణతో సంక్షుభిత సమాజంలో ఏ వైఖరులు తీసుకుంటారు? అనేవి అంతకంటే ముఖ్యం. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం బలపడుతున్న ఈ సంక్షోభ కాలంలో రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు తమ సామాజిక, రాజకీయ ఆచరణను తాజాగా పునర్నిర్వచించుకోవాలి. రాజకీయార్థిక, సాంస్కృతిక, సైనిక, నైతిక తలాల్లో కార్పొరేట్ల కోసం, హిందుత్వ రాష్ట్ర కోసం ఫాసిస్టులు చేస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా సాహిత్య కళా మేధో రంగాల నుంచి ప్రజలను కూడగట్టవలసి ఉన్నది. ముఖ్యంగా మెజారిటీ మత ప్రజలపై ఫాసిస్టు భావజాల ప్రభావం తీవ్రమవుతున్న సమయంలో గెలుచుకోవాల్సిన ప్రజా సమూహాలు పెరిగిపోతున్నాయి. హేతుబద్ధ వాదనతో గతాన్ని సరికొత్తగా చూసి, ప్రగతిదాయకమైన భవిష్యత్తు మీద ఆశ పెంచవలసి ఉన్నది. దీనికి రచన, పరిశోధన అనే ముఖ్యమైన ఆచరణ రూపాలతోపాటు రాజకీయ, సామాజిక ఆచరణను రచయితలు నిర్భీతిగా, మరింత నిబద్ధతతో ఎంచుకోవాల్సి ఉన్నది. రచన వ్యక్తిగత అనుభవాలను దాటి సంక్షుభిత సామాజిక అనుభవంలోకి, గతాన్ని అధిగమించి భవిష్యత్‌ దార్శనికతలోకి, సకల మానవ ఉద్వేగాల సారమైన చారిత్రక వాస్తవికతలోకి చేరుకోడానికి రచయితలు, బుద్ధిజీవులు వీలైనన్ని ఆచరణ రూపాలను ఎన్నుకోవలసి ఉన్నది. సామాజిక చైతన్య ప్రతిఫలనంగానేగాక ఈ సంక్షోభ మూలాలను ఎత్తిచూపుతూ, పరిష్కారానికి ఉన్న అవకాశాలను సాహిత్యంలోకి తీసుకరావాలి. రచన చేయడంతోపాటు సమాజాన్ని కాపు కాయాల్సిన బాధ్యత సాహిత్యకారులదే.


ఫాదర్‌ స్టాన్‌స్వామి, నర్మద, ప్రొ. సాయిబాబ ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో అద్భుతమైన నమూనాలను అందించి వెళ్లిపోయారు. ఇంకా వేల మంది ప్రజలు హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ప్రాణత్యాగాలు చేశారు. జైళ్లలో మగ్గుతున్నారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ఫాసిస్టు వ్యతిరేకంగా రచన, ప్రసంగం, ప్రచురణ, ప్రచారం చేసి ఎందరో నిత్యం బెదిరింపులను అనుభవిస్తున్నారు. ఈ ఫాసిస్టు అణచివేతకు, దోపిడీకి, కుట్రలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగు సాహిత్య, మేధోరంగాలను మరింత సమాయత్తం చేయమని, మిలిటెన్సీ పెంచమని సాయిబాబ స్ఫూర్తి మనందరినీ ప్రేరేపిస్తున్నది. అందులో భాగంగానే విరసం నిర్వహిస్తున్న సాహిత్య పాఠశాల ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కర్నూలులో జరుగుతున్నది.

– అరసవిల్లి కృష్ణ


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

For National News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 04:32 AM