కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్ సక్రమమే
ABN , Publish Date - May 15 , 2025 | 01:47 AM
ఆంధ్రజ్యోతి దినపత్రికలో మే 10న ప్రచురితమైన ‘కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్ అక్రమం’ అనే (అల్లూరి విజయ్) వ్యాసానికి ప్రతిస్పందన ఇది. తెలంగాణలోని పన్నెండు యూనివర్సిటీల్లో దాదాపు పన్నెండు వందలమంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు...
ఆంధ్రజ్యోతి దినపత్రికలో మే 10న ప్రచురితమైన ‘కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్ అక్రమం’ అనే (అల్లూరి విజయ్) వ్యాసానికి ప్రతిస్పందన ఇది. తెలంగాణలోని పన్నెండు యూనివర్సిటీల్లో దాదాపు పన్నెండు వందలమంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారి డిమాండ్ అశాస్త్రీయమని, అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని విజయ్ అర్థం లేని ఆరోపణలు చేశారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కావాలనే న్యాయమైన డిమాండ్ అప్రజాస్వామికం ఎలా అవుతుంది? ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనల ద్వారానే ప్రజాసమూహాలు తమ హక్కులను సాధించుకోగలవనే మౌలిక సూత్రం మార్క్సిస్టు భావజాలం ఆధారంగా ఏర్పడిన PDSU (విజృంభణ) నాయకునికి తెలియకపోవడం విడ్డూరం. నిపుణుల కమిటీ మార్గదర్శకాల ద్వారా మాత్రమే వర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల నియామక ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుత కాంట్రాక్టు అధ్యాపకులందరికీ పీహెచ్‌డీ, నెట్, సెట్ వంటి విద్యార్హతలున్నాయి. అంతేకానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా వారు దొడ్డిదారిన వచ్చినవారు కాదు. ‘దీర్ఘకాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయవచ్చు’నని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీర్పునిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించిన సందర్భాలు గతంలో కోకొల్లలు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం, మంథనిలో విద్యార్థులను ఒప్పంద అధ్యాపకులు తమ ఆందోళనలో భాగస్వామ్యం చేసి వాడుకున్నారనేది కేవలం అపవాదు.
తమ హక్కుల సాధన కోసం విద్యార్థులను వాడుకునే స్థితికి ఒప్పంద అధ్యాపకులు దిగజారలేదనే విషయాన్ని కొందరు తెలుసుకోవాలి. రెగ్యులరైజేషన్ డిమాండ్ న్యాయబద్ధమైన హక్కు కాబట్టే హరగోపాల్, కోదండరాం, రమా మేల్కొటే, పి.ఎల్. విశ్వేశ్వర్‌రావు, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లాంటి ఎందరో మా ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఇరవై ఏళ్ల క్రితం ఏర్పడిన ఖాళీల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వారిని ఆ ఖాళీల్లోనే కొనసాగిస్తూ, పది సంవత్సరాల క్రితం ఏర్పడిన ఖాళీల్లో కొత్తగా నియామకాలు చేపట్టడం సమంజసం. అప్పుడు అందరికీ న్యాయం చేకూరుతుంది.
డా. వంగర భూమయ్య
పాలమూరు విశ్వవిద్యాలయం
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి