Gender Based Violence: రాధికను చంపింది తండ్రి మాత్రమేనా
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:09 AM
ఇటీవల గుర్‌గావ్‌లో తండ్రి చేతిలో మరణించిన కూతురు రాధిక యాదవ్ ఒక రాష్ట్రస్థాయి టెన్నిస్ ప్లేయర్. ఎన్నో టోర్నమెంట్లు ఆడి గెలిచింది, తన లాంటి యువ క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు...
ఇటీవల గుర్‌గావ్‌లో తండ్రి చేతిలో మరణించిన కూతురు రాధిక యాదవ్ ఒక రాష్ట్రస్థాయి టెన్నిస్ ప్లేయర్. ఎన్నో టోర్నమెంట్లు ఆడి గెలిచింది, తన లాంటి యువ క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేసింది. చివరకు పాతికేళ్ళకే తండ్రి పేల్చిన రివాల్వర్‌కి హతమైంది. పోలీసుల ముందు ఆ తండ్రి తన నేరాన్ని ఒప్పుకుంటూ– కూతురి సంపాదన మీద ఆధారపడ్డావంటూ తమ ఊళ్ళోవాళ్ళు వెటకారంగా మాట్లాడటంతో తాను ఈ పని చేశానని అన్నాడు. టెన్నిస్ అకాడమీ పని మానేయమని చాలాసార్లు కూతురితో చెప్పాడట. కానీ రాధికా యాదవ్ అందుకు ఒప్పుకోలేదు. ఇదేగాక, కూతురు సోషల్ మీడియాలో ఏక్టివ్‌గా ఉంటూ రీల్సూ, మ్యూజిక్ వీడియోలూ షేర్ చేయటం కూడా ఆ తండ్రికి నచ్చలేదట! ఈ ఘోరాన్ని జీర్ణించుకునే క్రమంలో కొన్ని ఆందోళనకరమైన అంశాలు మన ముందుకు వస్తాయి. ఒక స్త్రీ తనకంటూ ఒక కొత్త మార్గాన్ని నిర్మించుకుంటున్నప్పుడు చుట్టూ ఉన్న సమాజం ఎంత తీవ్రంగా దాన్ని ప్రతిఘటిస్తుందీ అన్నది ఇందులో ముఖ్యమైన అంశం. ఈ విషాదకర ఘటన మన సమాజంలో మనం ఒప్పుకోవటానికి ఇష్టపడని అంశాలు కొన్నింటిని తేటతెల్లం చేసింది. స్త్రీలు అడ్డుగోడలను బద్దలుకొట్టుకొని ముందుకు పోయినంత మాత్రాన పితృస్వామ్యం మాయమైపోదు. అది కొత్త రూపాల్లోకి పరిణామం చెంది, పునఃప్రవేశానికి కొత్త దారుల్ని వెతుక్కుంటుంది. వెళ్ళిన చోటల్లా సరికొత్త రూపాల్లో ప్రత్యక్షమవుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. పలు మాధ్యమాల ద్వారా కనపడి/ వినపడే స్త్రీలపై తీవ్రమైన ట్రోలింగ్ చూస్తున్నాం. ఆర్థిక సహకారానికి చట్టబద్ధ వెసులుబాటు కల్పించే మనోవర్తికీ సామాజిక దురాచారమైన వరకట్నానికీ అసంబద్ధంగా ముడిపెట్టి చేసే వాదనలూ వింటున్నాం. స్త్రీల సాధికారతపై విషం గక్కుతూ అంతకంతకూ పెరుగుతున్న ‘ఇన్సెల్’ సంస్కృతికి ఇవి కొన్ని ఉదాహరణలు. ఈ విషాదం మనకు గుర్తు చేసే మరో అంశం– పితృస్వామ్యం లాభాలను మగవారు అనుభవిస్తున్నప్పటికీ వారు కూడా పితృస్వామ్యం దాడికి అతీతం కాదు. అది వాళ్లనెప్పుడూ పరిపూర్ణ మానవులుగా ఎదగనివ్వదు. తోటి మానవుల్లో మానవీయతను గుర్తించనివ్వదు.
పితృస్వామ్యం నైతికంగా స్త్రీలనే గాక, పురుషులనూ లోతుగా గాయపరుస్తుంది– అంటుంది ఫెమినిస్ట్ మేధావి కరోల్ గిలిగన్. ఎందుకంటే పితృస్వామ్యం ఒత్తిడి కింద నలిగే ఆడవారూ మగవారూ ఇరువురూ ‘ఆడతనం’, ‘మగతనం’ అన్న కృతకమైన చట్రాల్లో ఇమడని తమలోని విశిష్ట వ్యక్తిత్వ అంశాలను రద్దు చేసుకుంటారు. హద్దులు దాటితే స్త్రీని శిక్షించే ఈ సమాజమే, పురుషుడి విలువను అతను ప్రదర్శించే ఆధిక్యతను బట్టి, స్త్రీపై అతను చెలాయించే అదుపును బట్టి అంచనా వేస్తుంది. తమకు చెందిన స్త్రీపై ఆధిక్యతను ప్రదర్శించలేని, ఆమెను అదుపు చేయలేని మగవాడిని ఈ సమాజం వెక్కిరిస్తుంది. స్త్రీని అణచివేసినందుకు మగవాడిని మెచ్చుకుని, ఆమెకి స్వేచ్ఛ ఇచ్చినందుకు తప్పుపట్టే ఈ సమాజం ఎంత క్రూరమైనది! దీన్ని ఈ స్థితి దాకా ఎలా దిగజారనిచ్చాం మనం! ఈ సందర్భంలో సమాజం నుంచి వినపడిన వెక్కిరింతలు ఒక బలహీనమైన మగతనాన్ని గాయపరిచాయి. స్త్రీ పురుష హోదాలు తారుమారు అవటాన్ని కూడా సహించలేనంత బలహీనమైన మగతనం అది! రాధికా యాదవ్ తండ్రిని వెక్కిరించిన ఇరుగుపొరుగువాళ్లు ఆ తుపాకీ ట్రిగ్గర్‌ను నొక్కకపోయి ఉండచ్చు, కానీ ఈ హింస వెనుక ఉన్న భావజాలాన్ని ప్రేరేపించింది వారి మాటలే. ఇలా అంటున్నామంటే– ఆ నేరస్థుడిని నింద నుంచి మినహాయిస్తున్నట్టు కాదు. స్త్రీద్వేషం కేవలం వ్యక్తులకు పరిమితం కాదని గుర్తిస్తున్నాం. స్త్రీ ద్వేషం సామూహికమైనది, వ్యవస్థాగతమైనది, పైపెచ్చు మెచ్చుకోలు అందుకునేది! విజేతలైన స్త్రీలు కూడా స్త్రీ ద్వేషం నుంచి తప్పించుకోలేరని, పైగా ఆ విజయాలు ఆమెపై మరింత వ్యతిరేకతను పెంచుతాయనీ ఈ విషాదం మనకు గుర్తు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో లైంగిక న్యాయం జరగాలంటే స్త్రీలకు సమాన ప్రాతినిధ్యం లభించటం ఒక్కటే సరిపోదు. వ్యవస్థల్లోనూ మన మనసుల్లోనూ గూడుకట్టుకుపోయి ఉన్న పితృస్వామ్యాన్ని కూలదోసే విధంగా సామాజిక రాజకీయ అమరికల్లో విప్లవాత్మకమైన మార్పు సాకారం కావాలి.
శివాని నాగ్
అంబేడ్కర్ యూనివర్సిటీ,
ఢిల్లీ (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్)
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి