Indias Economic Reforms: నాటి సంస్కరణలను సమీక్షించాల్సిన తరుణం
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:47 AM
ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తున్న పరిణామాలు పేద మధ్య తరగతి ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిని మరింత దిగజార్చుతున్నాయి. 1974లో డబుల్ డిజిట్ (28శాతం)లో ఉన్న ధరల పెరుగుదల సూచిక (ద్రవ్యోల్బణం)...
ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తున్న పరిణామాలు పేద మధ్య తరగతి ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిని మరింత దిగజార్చుతున్నాయి. 1974లో డబుల్ డిజిట్ (28శాతం)లో ఉన్న ధరల పెరుగుదల సూచిక (ద్రవ్యోల్బణం) క్రమంగా తగ్గుతూ 2002లో 4.30శాతంగా నమోదయింది. రెండు సంవత్సరాల నుంచి మరీ తగ్గుతూ గత మే నెలలో 2.59శాతం మాత్రమే నమోదు అయిందని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానకర్తలు హర్షిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి వచ్చింది వాస్తవమే కానీ అది ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతకు నిదర్శనమని ప్రభుత్వ ఆర్థికవేత్తలు గుర్తుచేయడం లేదు.
ధరలు నియంత్రణలో ఉండడం వినియోగదారుల పక్షాన ఆహ్వానించదగిన అంశమే అయినప్పటికీ ద్రవ్యోల్బణ ప్రభావం నగర ప్రజలకు, గ్రామీణ ప్రజలకు ఒకే తీరుగా ఉండదు. ఆహార ధాన్యాల ధరల సూచికలు పారిశ్రామిక ఇతర వినియోగ వస్తువుల ధరలు సూచికలు రంగాల వారీగా వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ సాధారణ వినియోగదారుల ధరల సూచికను మాత్రమే పరిగణిస్తున్నది. కొద్ది సంవత్సరాల నుంచి దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిరేటుతో పాటు మొత్తం ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది. 1950లో కేవలం 50 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి జరగగా అది ప్రస్తుత సంవత్సరం 330 మిలియన్ టన్నులకు చేరింది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక ఉత్పత్తి. వ్యవసాయ ఉత్పత్తి పెరగడం వలన వాటి ధరలు నియంత్రణలో ఉండడం, ఆహార ధాన్యాల ధరల సూచిక కేవలం 0.95 శాతం మాత్రమే నమోదు కావడం విశేషమే. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సాధారణ ధరల సూచిక నిర్మాణంలో కేవలం సంప్రదాయంగా ఆహార ఉత్పత్తులు ఇతర అత్యవసర సరుకులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. మన ప్రజలు విద్య, వైద్య రంగాలపై చేస్తున్న ఖర్చును నగరాలలో ద్రవ్యోల్బణం సూచికలో పరిగణించడం లేదు. ప్రభుత్వ రంగ విద్య, వైద్య రంగాలు నిర్వీర్యమై పేద వర్గాలు కూడా అత్యధిక డబ్బు చెల్లిస్తూ ఆయా సేవలు కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రజలు చేస్తున్న ఈ వ్యయాన్ని ధరల సూచిక అంచనాలో పరిగణించడం లేదు.
దేశంలో 50 శాతం ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత ప్రైవేట్ విద్య, వైద్య రంగాల సేవలతో పాటు మందుల ధరలు అనేక రెట్లు పెరిగినప్పటికీ దాన్ని ధరల సూచిక అంచనాలలో పరిగణించడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించిన దేశ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ ఆదాయ అవకాశాలను కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. అసంఘటితరంగాలలో కూడా ముఖ్యంగా నిర్మాణ రంగంలో శ్రామికుల అడ్డాల వద్ద ఉపాధి లభించక నిరాశకు గురవుతున్నారు. కొనుగోలు శక్తి లేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కుప్పకూలినాయి. సాంఘిక భద్రత లేక కోట్లాది శ్రామికులు అశాంతికి లోనవుతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకం కాదు. గత రెండు దశాబ్దాల నుంచి వివిధ రంగాలలో కార్పొరేటీకరణ జరుగుతున్న పరిస్థితులలో వేతనాలు నియంత్రించబడుతున్నాయి, అదనపు పని గంటలు కూడా పెరుగుతున్నాయి. కార్పొరేట్ – అసంఘటిత రంగంలో ఒకటి రెండు శాతం ఉద్యోగులకు మాత్రమే ఒక మోస్తరు స్థాయి వేతనాలు చెల్లిస్తున్నారు, అత్యధిక శాతం కార్మికులకు వేతనాలు తగ్గిపోతున్నాయి. మరోపక్క కార్పొరేట్ సంస్థల వార్షిక నికరాదాయాలు అనేక రెట్లు పెరుగుతున్నాయి. ఇదే మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు.
పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మన దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల గురించి ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో పునరాలోచించాలి. వివిధ వర్గాల ప్రజలపై ఆర్థిక సంస్కరణల మంచీ చెడులను అంచనా వేయాలి. వ్యవస్థ మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోకముందే తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. మధ్యతరగతి ప్రజలపై ప్రత్యక్ష పన్నులను తగ్గించి ప్రభుత్వ, ప్రైవేటు అసంఘటిత రంగాలలో కనీస వేతనాలను, రైతులకు గిట్టుబాటు ధరలను పెంచాలి.
ప్రధానమంత్రి మోదీ మన ఆర్థిక వ్యవస్థలో, ఆదాయ పంపిణీలో గల లోపాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూనే తగిన స్థాయిలో వేతనాలు చెల్లించనిదే సమగ్ర డిమాండ్ పెరగడం సాధ్యపడదనీ 1929-–30 నాటి మహా ఆర్థిక మాంద్యం సందర్భంలో ప్రముఖ ఇంగ్లీష్ అర్థశాస్త్రవేత్త జె.ఎం.కీన్స్ చెప్పిన విధంగా కార్పొరేటు సంస్థలకు ఊడిగం చేయడం కాస్త మాని, అసంఘటిత శ్రామికుల పనిగంటలు తగ్గిస్తూ వేతనాలు పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతున్న మాంద్యం లక్షణాలను నివారించడానికి వీలవుతుందని విధానకర్తలు గుర్తెరగాలి. నిర్లక్ష్యం చేస్తే నిరాటంకంగా దోపిడీ చేసే కార్పొరేట్ వ్యవస్థతో పాటు, దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు కూడా ప్రజల ఆగ్రహానికి మట్టికరిచే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.
ప్రొఫెసర్ కూరపాటి వెంకట్‌నారాయణ
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..