న్యాయవాదుల నియంత్రణకే ఈ బిల్లు
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:09 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అడ్వకేట్ ఎమెండ్‌మెంట్ బిల్లు 2025’ బిల్లు పూర్తిగా అడ్వకేట్ల హక్కులను హరించే విధంగా ఉండడమే గాక న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని తీసివేసే విధంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అడ్వకేట్ ఎమెండ్‌మెంట్ బిల్లు 2025’ బిల్లు పూర్తిగా అడ్వకేట్ల హక్కులను హరించే విధంగా ఉండడమే గాక న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని తీసివేసే విధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్లను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటూ, న్యాయ వ్యవస్థను నియంత్రించే ప్రయత్నంగా దీనిని చూడవచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్లుగా ముగ్గురు కేంద్ర ప్రభుత్వం నియమించేవారు ఉండాలనే సవరణ బార్ కౌన్సిల్ పైన కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ కిందకే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సదరు చట్టంలోని నిబంధనలకు సంబంధించిన నియమాలను అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వవచ్చును అనే సవరణ కూడా బార్ కౌన్సిల్ మీద కేంద్ర ప్రభుత్వ పెత్తనం కిందకే వస్తుంది. ఇవి అభ్యంతరకరం.
ఎవరైనా అడ్వకేట్‌కి మూడేళ్ళ శిక్ష పడి, హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ శిక్షను ఖరారు చేసినట్లయితే అతని బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దు అవుతుంది అనే సవరణ చాలా కఠినంగా ఉంది. ఇంతటి కఠిన నిబంధన ఇతర వృత్తులలో ఉన్నవారికి గానీ, రాజకీయ నాయకులకు గానీ లేకపోవడం గమనార్హం. అలాగే ఏ అడ్వకేట్ అయినా మూడేళ్ళ శిక్ష ఉన్న నేరాలలో శిక్ష పడినా లేదా విచారణ ఎదుర్కొంటున్నా, అతను బార్ కౌన్సిల్ మెంబరుగా పోటీ చేయడానికి అనర్హుడు అనే సవరణ అభ్యర్థుల పైన తప్పుడు కేసులు బనాయించడానికి అవకాశం కల్పించేదిగా ఉంది. ఇది బార్ కౌన్సిల్ ఎన్నికలలో హింసకు దారి తీస్తుంది. అడ్వకేట్స్ కోర్టులు బాయ్‌కాట్ చేయడం, కోర్టు వర్క్ చేయకుండా దూరంగా ఉండటం వంటివి చేయకూడదు అనే సవరణ పూర్తిగా అడ్వకేట్ల హక్కులకు భంగకరం, ప్రజాస్వామ్య విరుద్ధం.
అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లు క్రింది కోర్టులలో అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి ఏర్పడిన స్వతంత్ర సంస్థలు. ఇప్పటికే వాటి ఎన్నికలను క్రమబద్ధీకరించే పేరుతో, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నియంత్రణ కోసం, బార్ అసోసియేషన్ల పైన బార్ కౌన్సిళ్ళు కొంత ఆధిపత్యం తీసుకున్నాయి. ఇప్పుడు ఈ అడ్వకేట్ ఎమెండ్‌మెంట్ బిల్లు సవరణల ద్వారా బార్ అసోసియేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో ప్రతి ఐదేళ్ళకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్, సదరు అడ్వకేట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూన్నాడా లేదా అని వెరిఫికేషన్... ఇవన్నీ అడ్వకేట్ల హక్కులను కాలరాచి అడ్వకేట్లను నియంత్రించే ప్రయత్నంగానే కనపడుతోంది. విదేశీ లా ఫర్మ్‌లను, విదేశీ లాయర్లను అనుమతించే అధికారం బార్ కౌన్సిల్ పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంచే ప్రయత్నం కూడా ఆమోదయోగ్యం కాదు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. న్యాయవాదుల స్వతంత్రతను, హక్కులను, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ప్రతి బార్ అసోసియేషన్ పూనుకోవాలి. లేనిపక్షంలో న్యాయ వ్యవస్థ తన ఉనికిని కోల్పోతుంది.
– పి.పి. శాస్త్రి, అడ్వకేట్, ఏలూరు
ఇవి కూడా చదవండి...
మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!
ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..
Read Latest AP News And Telugu News