Share News

సర్కారుకు ఆదాయ మార్గాలు ఇవీ!

ABN , Publish Date - Feb 26 , 2025 | 06:08 AM

గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు, ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చలేక ప్రస్తుత కాంగ్రెస్‌...

సర్కారుకు ఆదాయ మార్గాలు ఇవీ!

గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు, ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చలేక ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. చివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు, అలాగే వివిధ ప్రాజెక్టులకు ఇదివరకే ఖర్చుపెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో తగు ఆదాయ మార్గాలను వెతుకుతున్నది. ఈ నేపథ్యంలో ఈ క్రింది విధానాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

గతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటే కొన్నిసార్లు నోటీసులు ఇచ్చి, మరికొన్నిసార్లు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చేవారు. అయినా అక్రమ నిర్మాణాలను అరికట్టకపోవడం, వాటిలో చాలామంది నిరుపేదలు, మధ్యతరగతి వారు ఉన్నందున గత ప్రభుత్వం 2014లో 125 గజాల లోపు అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే ఉచితంగా అసైన్‌మెంట్‌ పట్టా సర్టిఫికెట్‌ జారీ చేసింది. అలాగే 125 గజాల పైన అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో భూ పట్టణ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం మిగులు భూమిలో జూన్‌ 2, 2014 లోపు ఇళ్లు నిర్మించుకుంటే దాని విస్తీర్ణాన్ని బట్టి అప్పటి బేసిక్‌ వాల్యూలో నిర్ధారించిన పరిమితి ప్రకారం నగదును వసూలు చేశాక కన్వేయన్స్‌ డీడ్‌ ద్వారా క్రమబద్ధీకరించింది. ఈ దరఖాస్తుల గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. అయితే ఎన్నికల ముందు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో విలువైన భూములను మార్గదర్శకాలు ఉల్లంఘించి ఖాళీ స్థలాలను కూడా క్రమబద్ధీకరణ చేశారన్న ఆరోపణలతో కన్వేయన్స్‌ డీడ్స్‌ తదుపరి లావాదేవీలను నిలిపివేశారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం వాటిపై దృష్టిపెట్టి క్రమబద్ధీకరణ చర్యలు చేపడితే రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే తిరస్కరించిన భూముల్ని స్వాధీనపరుచుకుంటే తిరిగి ఆక్రమణ గురయ్యే అవకాశం ఉండదు.


భూ పట్టణ గరిష్ట పరిమితి చట్టం కింద హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోన్ని కొన్ని ప్రాంతాలు, వరంగల్‌ పట్టణ ప్రాంతంలో కొన్ని వేల చదరపు మీటర్ల స్థలాన్ని మిగులు భూమిగా స్వాధీనపరుచుకున్నారు. ఆ భూములు అప్పటికే థర్డ్‌ పార్టీ పొసెషన్‌లో ఉండడం, లేదా డిక్లరెంట్‌ పొసెషన్‌లో ఉండడంతో వాటిని ప్రాంతాల వారీగా, విస్తీర్ణం వారీగా నిర్ణీత ధరను నిర్ణయించి 2002లో జీఓల ద్వారా మార్గదర్శకాలను జారీ చేసి, చాలా విస్తీర్ణాన్ని క్రమబద్ధీకరించి, రాష్ట్ర ఖజానాకి ఆదాయం సమకూర్చారు. దీని గడువును కూడా ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అయితే కొంతమంది దరఖాస్తుదారులతో నగదు కట్టించుకుని క్రమబద్ధీకరించకపోవడం, ఇంకా కొంతమంది నగదు కట్టకపోవడంతో ఎన్నో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ యూఎల్‌సీ చట్టం 2008లో కూడా రిపీట్‌ అయింది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్ష జరిపి, అటువంటి భూములకు మరొకసారి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడమో లేదా వాటిని తిరిగి స్వాధీనపరుచుకుని బహిరంగ వేలం వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు.


అసైన్డ్‌ భూముల విషయంలో కోర్టు కేసులపై ప్రస్తుత ప్రభుత్వం తగు దృష్టి పెట్టి అనుభవజ్ఞులైన సీనియర్‌ న్యాయవాదుల ద్వారా కేసు గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తే విలువైన భూములు ప్రభుత్వపరం అవుతాయి. ఒకవేళ ఆ భూములు థర్డ్‌ పార్టీ పొసెషన్‌లో ఉంటే నిబంధనల ప్రకారం నిర్ణీత ధర నిర్ణయించి క్రమబద్ధీకరించినా, లేదా బహిరంగ వేలం వేసినా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే ధరణి పోర్టల్‌ ద్వారా పట్టా మార్చి, వాటిపై ట్రాన్సాక్షన్స్‌కు అవకాశం కల్పించిన భూములపై విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలి. ఇప్పటికే థర్డ్‌ పార్టీ పొసెషన్‌లో ఆ భూములు ఉంటే వాటిని నిర్ణీత ధరకు అర్హులైన వారికి క్రమబద్ధీకరించడం లేదా స్వాధీనం చేసుకుని వేలం వేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


అలాగే లే అవుట్‌ రెగ్యులరైజేష్ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను పకడ్బందీగా అమలు చేసి, ఆ దరఖాస్తులను పరిష్కరిస్తే ఆదాయం సమకూరుతుంది. అలాగే ప్రభుత్వానికి, ప్రైవేట్‌ వ్యక్తుల మధ్య వివాదాలు, వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి న్యాయనిపుణులు, అనుభవజ్ఞులైన రెవెన్యూ అధికారులతో కమిటీ వేసి, తగు ఆధారాలను సేకరించి కోర్టులకు సమర్పిస్తే ఆ కేసులు గెలిచే అవకాశం ఉంది.

గతంలో వివిధ ఉద్యోగుల సొసైటీలకు, సంస్థలకు, ప్రభుత్వ భూమిని కేటాయించడమే కాకుండా స్వాధీనపరిచి, నిర్ణీత ధర నిర్ణయించకుండా (అలియనేషన్‌ ప్రక్రియ) పూర్తికాని కేసులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అటువంటి వాటి వివరాలు సేకరించి సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకుంటే కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములపై ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష జరిపి, తగు చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.

సురేష్‌ పొద్దార్‌

విశ్రాంత సంయుక్త కలెక్టర్‌


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 06:08 AM