The Storm Within N Gopi poems: చకితం
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:54 AM
మూడ్ అనేది చిన్నమాట ఇదొక తుఫాను! గొప్ప కవిత చదివితే అది గడ్డపారగా మారి నిన్ను తవ్వితవ్వి పొయ్యాలి నీలోంచి ఆవిరి జ్వాలలు ఎగయాలి...
మూడ్ అనేది చిన్నమాట
ఇదొక తుఫాను!
గొప్ప కవిత చదివితే
అది గడ్డపారగా మారి
నిన్ను తవ్వితవ్వి పొయ్యాలి
నీలోంచి ఆవిరి జ్వాలలు ఎగయాలి.
ఇవాళ
నాయింటి ముందు
నేనే పచారులు చేస్తున్నాను
లోపలి ఆలోచనలు
బయటి కెగిరిపోకుండా
కాపలా కాస్తున్నాను.
జీవితం ఒక జ్ఞాపకాల పెట్టె
బాధల ఖజానా
నిశ్శబ్దానికి
కొత్తనోరు మొలుస్తున్న భావన
ప్రతి కవితా
అనుభవాల విముక్తికి దీవెన.
జీవితంలో సింహభాగం
ఆభాసమే
షుగర్ ఫ్రీ లాగ
అసలు రుచి కోసమే తండ్లాట!
పడుకునేటప్పుడు
పుస్తకం తలాపున పెట్టుకునేవాడిని
తెల్లారగట్ల
దిండులోంచి ఏవో మాటలు వినపడేవి.
కలవరిస్తుంటే
వీనికి పిచ్చిమళ్లీ మొదలైంది అనేది మా అమ్మ.
నిజంగా
అలాంటి మానసికస్థితే
ఇవాళ కలిగింది
అహంకార రాహిత్యమే కవిత్వమని తెలిసింది.
n ఎన్. గోపి
Also Read:
ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ