‘కోనేరు’ కమిటీ నేటికీ ఆచరణీయమే!
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:28 AM
పేదలకు భూములను పంచడం అనేది నాడు స్వాతంత్ర్య పోరాటంలోని అనేక అంశాలలో ఒకటి. స్వాతంత్ర్యం రాకముందు భూములన్నీ భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు...
పేదలకు భూములను పంచడం అనేది నాడు స్వాతంత్ర్య పోరాటంలోని అనేక అంశాలలో ఒకటి. స్వాతంత్ర్యం రాకముందు భూములన్నీ భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు... ఈ ఫ్యూడల్స్ అధీనంలో ఉన్నాయి. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత అన్ని జాగీర్లు రద్దు అయినప్పటికీ భూములు వాళ్ళ అధీనంలోనే ఉండిపోయాయి. బెంగాల్ కరువును దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా జమీందార్లు కోర్టును ఆశ్రయించారు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 31లో పొందుపరచబడి ఉన్నందున కోర్టు తీర్పు భూస్వాములకు అనుకూలంగా వెలువరించింది. ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తూ ఆర్టికల్ 31లో ఉన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది. ఆస్తి అనేది కేవలం చట్టపరమైన హక్కుగా సవరణ చేసి ఆర్టికల్ 300ఏ లో పొందుపరిచింది. దీనిని 9వ షెడ్యూల్‌లో చేర్చారు.
1950 నుండి నాలుగు ఐదు దఫాలుగా చట్ట సవరణ జరిగి చివరకు 1973లో తీసుకురాబడిన భూ సంస్కరణల చట్టం ద్వారా– ఐదుమంది సభ్యులు ఉన్న కుటుంబానికి తరి గరిష్ఠంగా 27 ఎకరాలకు, ఖుష్కి 54 ఎకరాలకు పరిమితం చేసింది. అయినప్పటికీ భూస్వాములు ఎన్నో తప్పుడు లెక్కలు బినామీల పేర్లను రాయించి భూములన్ని వాళ్ళ దగ్గరే ఉండేలా పైరవీలు చేసారు. ఆ రోజులలో ప్రభుత్వాలకు రెవెన్యూ రాబడులు భూమి కేంద్రంగా ఉండడం వలన భూములపై విధించిన పన్నులు కట్టలేక పేద, వెనుకబడిన కులాల వారు భూములకు యజమానులు కాలేకపోయారు.
వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూములు పంచమని భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమాలు భూమి కేంద్రంగానే ముందుకు సాగాయి. భూ పంపిణీ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు నడిచాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన హక్కుల ఉద్యమాలు, ఆయా హక్కుల సంఘాలు కూడా కొంచెం ఆలస్యంగా అయినా భూమిని పంపిణీ చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పటి నక్సలైట్లతో జరిగిన చర్చల ఫలితంగా, భూ సమస్యలు పరిష్కరించడానికి 2004 డిసెంబర్ 23వ తేదీన ఎనిమిది మందితో కూడిన ఒక అధ్యయన కమిటీని నియమించింది. అందులో ఇద్దరు మంత్రులు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి, ముగ్గురు అనుభవజ్ఞులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, కొంత మంది సీనియర్ స్థాయి అధికారులు నియమితులయ్యారు. వీరు అందుబాటులో ఉన్న భూములను పరిశీలించి సూచనలు చేయాలి. వీరిలో ఒకరు పురపాలక శాఖ మంత్రి కోనేరు రంగారావు. ఈ కమిటీకి కోనేరు రంగారావు కమిటీగా నామకరణం చేశారు.
కోనేరు రంగారావు కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం చేసి 2006 చివరలో ఫైనల్ రిపోర్ట్ అందజేసింది. అక్టోబర్ 6, 2007న మొదటి సర్క్యులర్ జారీ అయింది. నివేదికను బయట పెట్టమని విపక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతుల నాయకులు ఆందోళనలు చేశారు. చివరకు అందులోని 104 అంశాలలో 74 సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొద్ది రోజుల తర్వాత 2007లో జీవోఎంఎస్ నెంబర్ 1049ను విడుదల చేసింది. వాటి అమలు కోసం మరో కమిటీని వేసింది. దీనికి అనుగుణంగా కింది స్థాయిలో పనులు జరగటానికి ఎన్నో జీవోలు, మెమోలు, సర్క్యులర్లు, కార్యనిర్వాహక ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ కమిటీ నివేదికలో ప్రధానంగా 12అంశాల మీద అధ్యయనాలు ఉన్నాయి. ఇనాం భూములు, భూమి హక్కుల రికార్డులు, నివాస స్థలాలు, భూసేకరణ, టెనెంట్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, ఆదివాసీల భూములు, కౌలు రైతులకు సంబంధించి ఋణ అర్హత కార్డులు, సాదా బైనామాలు, ఇవన్నీ భూమిలేని వారికి భూములు పంచేలా చేయడానికి తీసుకోబడిన నిర్ణయాలు. ముఖ్యంగా గిరిజనుల భూములు గిరిజనేతరులు కొనకుండా సూచన చేసింది. గిరి జనులకు వ్యతిరేకంగా పోలీసుల జోక్యం ఉండరాదని తెలిపింది. ల్యాండ్ ట్రిబ్యునల్ ద్వారా స్వాధీనం చేసుకున్న భూములను వెంటనేపంచాలని ఆదేశాలు జారీచేసింది. ఇట్టి విషయంలో భూస్వాములు కోర్టుకు వెళ్లి ఎలాంటి ఉత్తర్వులు తీసుకోకముందే భూ పంపిణీ చేసి వారికి పట్టాలు జారీచేసి రికార్డులలో నమోదు చేసేలా చూడమంది. వారికి పట్టాదారు పాసుపుస్తకాలు టైటిల్ డీల్స్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. ఆ పాస్ పుస్తకాలకు జిల్లాల వారి కోడ్ నెంబర్లు ఇచ్చి ఎలాంటి నకిలీ పాస్ పుస్తకాలు రాకుండా చూడమని సిఫారసు చేసింది. ఎన్ని సూచనలు చేసినప్పటికీ 48శాతం భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
భూ సేకరణ చట్టం ద్వారా సేకరించిన భూములు భూ సేకరణ పూర్తయిన మూడు సంవత్సరాల లోపు ప్రభుత్వం వినియోగించకపోతే ఆ భూములను తిరిగి భూమి యజమానులకు ఇవ్వమంది. పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టా భూముల చట్టం 9/77ను యధాతథంగా అమలు చేయమని కమిటీ సూచించింది. ఈ చట్టాన్ని రాజకీయ నాయకులు, అధికారులు పటిష్టంగా అమలు చేయలేదు. దురదృష్టవశాత్తు కొన్ని సవరణలు తెచ్చి అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వారికి రెగ్యులరైజ్ చేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ భూములలో నిర్మించుకున్న ఇంటిని వారి సామాజిక ఆర్థిక స్థాయిని నిర్ణయించి వారికి ఇళ్ళ పట్టాలు జారీ చేసి న్యాయం చేసేలా చూడమని సిఫారసు చేసింది.
కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఒత్తిడి ఎక్కువైన ప్రతిసారి ప్రభుత్వం ఒక జీవో ఇస్తూ వచ్చింది. కమిటీ ఎన్నో మంచి సూచనలు చేసింది. కానీ రాజకీయ నాయకుల సంకల్పం అధికారుల చిత్తశుద్ధి కొరవడింది. అంతర్జాతీయ ప్రమాణాలు, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఐదు మందితో కూడిన కుటుంబానికి మూడు ఎకరాల భూమి సరిపోతుందనే సూచనలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు విడతలుగా భూ పంపిణీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమిని వాగ్దానం చేసింది. కానీ, గత ప్రభుత్వం భూమిని పంచలేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న చాలా విలువైన భూములను అమ్మి కొన్ని వేల కోట్లు ఖజానాకు రాబట్టగలిగింది.
తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు మేలు చేయగలిగిన కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు అన్నీ పారదర్శకత కలిగినవి, సమర్థమైనవి. ఉమ్మడి రాష్ట్రాలలో ఇప్పుడు కూడా అమలుపరచడానికి ఆస్కారం ఉన్న ఒక ప్రగతిశీలమైన నివేదిక అది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగు సూచనలతో కూడిన జీవోలను విడుదల చేయాలి.
ధరణి పోర్టల్ కారణంగా ఏ తప్పూ చేయని రైతులు వారి పట్టా భూముల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఈ ప్రభుత్వం భూ భారతి పేరుతో మరో చట్టం తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం అమలులుకు కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను గమనంలోకి తీసుకొని ముందుకు వెళితే బాగుంటుంది.
వి. బాలరాజు
రిటైర్డు తహసిల్దారు
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..
For AndhraPradesh News And Telugu News