Share News

Bhavana Kavis Raghurama Vijayam: అముద్రిత కావ్యంలో ‘కాకాసుర వృత్తాంతం’

ABN , Publish Date - Dec 29 , 2025 | 06:11 AM

ఆవంచ రామనార్యుని కుమారుడైన భావన కవి రచించిన కావ్యం ‘రఘు రామ విజయము’. ఈ కావ్యానికి ఉపోద్ఘాతంగా ఉన్న పద్యాల వలన దీని నేపథ్యం తెలుస్తుంది. ఏదైనా ఒక ప్రబంధం రచించాలన్న...

Bhavana Kavis Raghurama Vijayam: అముద్రిత కావ్యంలో ‘కాకాసుర వృత్తాంతం’

ఆవంచ రామనార్యుని కుమారుడైన భావన కవి రచించిన కావ్యం ‘రఘు రామ విజయము’. ఈ కావ్యానికి ఉపోద్ఘాతంగా ఉన్న పద్యాల వలన దీని నేపథ్యం తెలుస్తుంది. ఏదైనా ఒక ప్రబంధం రచించాలన్న ఆలోచనలో ఉన్న ఈ కవి ఒకనాడు గోస్తనీ నదికి వెళ్ళాడట. నదిలో స్నానం చేసి, ఆ నదీతీరంలో కూర్చుని ఇష్టదైవమైన శ్రీమల్లిపూడి రాజగోపాల దేవుడిని మనసులో స్మరించి కనులు మూసుకున్నాడు. ఆ దేవుడు మనోవీధిలో ప్రత్యక్షమై స్కంద పురాణంలో భాగంగా ఉన్న రామాయణ కథలన్నిటినీ సంగ్రహించి ఒక కావ్యంగా రాసి తనకు అంకితం ఇవ్వమని కోరాడు. అలా ఆ రాజగోపాల దేవుడి కోరిక మేరకు భావన ఈ ‘రఘురామ విజయము’ రచించాడు.

ఈనాటికీ అముద్రితంగా మిగిలి ఉన్న ఈ కావ్యం రాత ప్రతి ‘మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం’లో అందుబాటులో ఉంది. మంకాల దొరసామయ్య పంతులు రాసిన ఈ రాతప్రతిలో 324 పుటలు ఉన్నాయి. వేరే ఒక ఒరిజినల్‌ ప్రతికి ఇది నకలు ప్రతి. ఎనిమిది ఆశ్వాసాలలో కావ్యం సంపూర్ణంగా ఉంది. మొదటి ఆశ్వాసం చదివిన మీదట, ఇది ముద్రణకు పనికిరానిదిగా వదిలేయాల్సిన కావ్యంగా నాకు కనపడలేదు. కవిత్వం అంత ప్రౌఢంగానూ, మరీ సరళంగానూ కాక మధ్యస్తంగా ఉంది.

ఈ కావ్యంలోని ద్వితీయాశ్వాసంలో కాకాసుర వృత్తాతం ఉంది. ఈ ‘కాకాసుర వృత్తాంతం’ వాల్మీకి రామాయణంలో ‘సుందరకాండ’లో సీతమ్మ పాత సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ, హనుమంతుడికి చెప్పిన కథగా ఉంది. ఈ ‘రఘురామ విజయము’లో భావన కవి దీనిని ముందుకు తెచ్చి కాలక్రమానుసారంగా అయోధ్యకాండలో చెప్పాడు. అయ్యలరాజు రామ భద్రుడు రచించిన ‘రామాభ్యుదయం’ కావ్యంలో మాత్రమే ‘కాకాసుర వృత్తాంతా’న్ని ‘సుందరకాండ’లో సీతమ్మ జ్ఞాపకంలా కాకుండా అది జరిగిన కాలంలో జరుగుతున్నట్లుగా చెప్పారు. ఇతర తెలుగు కావ్యాలు అన్నిటిలోనూ ఇది సీతమ్మ జ్ఞాపకమే. అయితే ‘రామాభ్యుదయం’లో రామభద్రకవి ‘అయోధ్యకాండ’లో కేవలం ఆరు పద్యాలలో సంక్షిప్తంగా ఈ వృత్తాంతాన్ని ముగించాడు. ‘రామాభ్యుదయం’లో పద్యాలనూ, ఈ భావన కవి ‘రఘురామ విజయము’లోని పద్యాలనూ పక్కపక్కనే పెట్టుకుని చదివితే, భావన కవి ఈ వృత్తాంతాన్ని వర్ణించి నిర్వహించిన తీరు ఎంతో మెరుగ్గా కనపడుతుంది.


23 పద్యాలు, 3 వచనాలలో భావన కవి రసరమ్యంగా ఈ ‘కాకాసుర వృత్తాంతం’ ఘట్టాన్ని రచించాడు. అముద్రిత కావ్యం కావడం వలన ఇప్పటి వరకు తెలుగు పండితుల/ పాఠకుల దృష్టిలో పడని ఈ ఘట్టంలోని కొన్ని పద్యాలను, కథాసూత్రానికి భంగం కలగకుండా ఉండడాని కోసం అవసరమైన చిరు వ్యాఖ్యలతో, ఇక్కడ పొందుపరుస్తున్నాను.

సీ. ఒకనాడు తనవిభుడూరువు తలగడ

గాశయనించి యక్కాంత వేడ్క

నుండఁగా నొక కాకి యురవడి నేతెంచి

యెదురుదన్నెరుగక హీనవృత్తి

ధరకూఁతు పృథుకుచాంతరము న

ఖంబులజీరి యంతటఁబోక చేరిచేరి

దనునేచ, కోపచిత్తమ్మున క్షతవేద

నను భాష్పములు జార నాతియున్న

గీ. కరుణ దళుకొత్తఁ జూచి తత్కారణంబు

దన్ను నడుగంగఁ దెలియను దరుణి చెప్పె

బాహ్యకోపంబునను రామచంద్రుఁడపుడు

నొక యిషికమును మంత్రించి యుదరి పడఁగ

(వ్యాఖ్య: కాకంబుపై వేయుటయు నది బ్రహ్మాస్త్రంబయి... జ్వాలాభీలకరాళంబయి – వెంటబడి తరిమింది. శ్రీరాముడి చేత అలా శిక్షించబడిన కాకి, ఎక్కడా రక్ష దొరకక మహేంద్రుడి దగ్గరకు వెళ్ళి కాపాడమని వేడుకుంది.)

ఉ. నీ తెరగేనెరుంగుదును నీచమతీ! యిదినాతరంబె యా

భూతలవాసదుష్టనరభోజనులన్విదళించ నిందిరా

పేతుఁడు చక్రపాణి యుదయించెను రామ నరేంద్ర చంద్రుడై

కాతురె వెఱ్ఱులయిన నిను కంపము నొందక రామమంతునిన్.

(వ్యాఖ్య: అది నావల్ల అయ్యేపనికాదని బ్రహ్మ దగ్గరకు వెళ్ళమన్నాడు ఇంద్రుడు. వెళ్ళాడు కాకాసురుడు.)

ఉ. రాముఁడు నాకు తండ్రియు ధరాసుతనాకును దల్లి వారికిం

దామసవృత్తిఁ జేసితివి తప్పిటుగర్వపరాధి నిన్ను నే

నేమని కాతునయిన విను హీనమతీ! యిది నా కశక్యమీ

వా మహనీయమూర్తి శరణాగతవత్సలు నాశ్రయింపుమా!

(వ్యాఖ్య: అన్నాడు బ్రహ్మ. ‘అక్కట చంపెడువారి పాలికేమనమున నమ్మిపోదుమని మాటికిమాటికి నూహచేసి’ అలా కాదని శంకరుడి వద్దకు శరణార్థియై వెళ్ళాడు కాకాసురుడు.)

ఉ. రాముఁడు లోకరక్షకుఁడు, రాముఁడు సర్వహృదాంతరాత్మ, యా

రాముఁడ దేవతామయుడు, రాముఁడు దుష్టవినాశకుండు, ఆ

రాముఁడు ఇందిరా వరుఁడు, రాముఁడ యోగిమనోధివాసుఁడా

రాముఁడె నిగ్రహించునట రాక్షస! యెవ్వరు దిక్కు నీకికన్?


(వ్యాఖ్య: అన్నాడు శంకరుడు కూడా! ‘ఎక్కడికైనా పో!’ అన్నాడు. పాతాళానికి వెళ్ళాడు కాకాసురుడు. అక్కడ వాడిని చూసి భయపడి తలా ఒక దిక్కు పరిగెత్తారు అక్కడివాళ్ళు.)

గీ. ఓరి, వంశనాశ! దారుణంబగు మంట

లేల తెచ్చితిట్లు నేల చాటు

జేరియున్న మాకుఁ జేటుగా క్రొవ్వున

బ్రేలి వీటమీదఁ బెట్టఁ జనునె.

(వ్యాఖ్య: ‘నీ చావు మాకు దెచ్చితి నీచా!’ అని తిట్టారు. అందరి చేత మాటలు పడి.... ‘ఛీఛీ, తన మదము ఇంతఁ జేసెనె యకటా!’ అనుకుంటూ ఇలా చింతించాడు కాకాసురుడు.)

సీ. సరసాన్నపానాది సర్వపదార్థంబు

లిచ్ఛానుగతి భుజియింపఁగలిగి

దేవకాంతలఁబోలు తెరవలతోఁగూడి

గేరుచునెపుడు భోగించఁగలిగి

యెల్లలోకములను ఇష్టానుసారత

విహరించు సామర్థ్యవిధము గల్గి

వర్ణింపఁదగునట్టి వంశంబువారిలో

ఘనమయిన పెద్దరికమ్ముగల్గి

గీ. యేలపోయితి నటకు? పోయినను నేమి

చేరబోరాని కాంతల చణకఁదగునె?

యేవిధంబున బ్రతుకుదు నేది తెరగు?

గుడిచికూర్చుండిఁ గొర్విచే గోకుకుంటి!

మ. అకటా! లోకములెల్లనేలు ప్రభులై యాశంభుడా బ్రహ్మ యూ

రకనే మాటల పంద్రివెట్టి రహహా! ప్రాణంబుఁ గావంగఁజా

లక యింకెక్కడికేఁగువాఁడఁ జెలులున్ లజ్జించగా దిట్టరే

అకలంకాప్తులు కాలచేష్ట పగవారైపోయిరే, దైవమా!

(వ్యాఖ్య: అనుచు విలపించి తనకు మరి దిక్కెక్కడా లేకపోవడంతో...)

ఉ. రామనరేంద్రుఁడీ భువనరక్షకుడంచు విరించి పల్కెనా

స్వామి పదారవిందముల సన్నిధినే శరణంబు వేడెదన్

దామసవృత్తి మాని కృప దాయికఁ గల్గిన మేలు; తప్పెనా

యామహితాత్ముఁ డల్గినను నవ్యయ ముక్తిపదంబుఁ గాంచెదన్.

(వ్యాఖ్య: ఈ నిర్ణయంతో కాకాసురుడు వెళ్ళి రాముడి పాదాలపై పడి...)

గీ. కావు కావు మనెడు గద్గదస్వరమున

కావు కావు మనుచు కరుణమునను

పరమ భీతి సాగిపడి లేవకున్నను

కమలలోచనుండు కరుణఁ జూచి.

కం. కాకీ! మతిలేకిటు చీ

కాకైతివి, యింకనునినుఁ గాచితి భయమున్

గైకోకు మొకటి చెప్పెద

నాకాండమమోఘమగుట నయనమునొకటిన్.

ఆ. సాయకమునకిచ్చి చనుమన గాకంబు

మోదవార్ధిలోన నీదులాడి

యొడలఁ బ్రాణమున్న నొక్క కన్నే చాలు

ననుచు నేత్ర మిచ్చి యరిగె కాకి.

(వ్యాఖ్య: అలా ఒక కన్నుని శ్రీరాముడి బాణానికి సమర్పించి, ప్రాణం దక్కించుకుని, బ్రతుకు జీవుడా! అనుకుంటూ వెళ్ళిపోయాడు కాకాసురుడు.)

అని కాకాసురవృత్తాంతాన్ని ముగించాడు భావన కవి.

భట్టు వెంకటరావు

ఇవి కూడా చదవండి

వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..

బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..

Updated Date - Dec 29 , 2025 | 06:56 AM