Indian Communism: విప్లవ కమ్యూనిస్టులు గుర్తించని భారత వాస్తవం
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:34 AM
‘అరణ్యవాసంలోనే విప్లవ ప్రభాతం’ (జూలై 25, ఆంధ్రజ్యోతి) అన్న నా వ్యాసంపై విమర్శలు, వ్యాఖ్యలకు నా ప్రతిస్పందన ఇది: భారత కమ్యూనిస్టులు తమ జీవితాలను త్యాగం చేసి శక్తిమంతమైన ప్రజా ఉద్యమాన్ని...
‘అరణ్యవాసంలోనే విప్లవ ప్రభాతం’ (జూలై 25, ఆంధ్రజ్యోతి) అన్న నా వ్యాసంపై విమర్శలు, వ్యాఖ్యలకు నా ప్రతిస్పందన ఇది: భారత కమ్యూనిస్టులు తమ జీవితాలను త్యాగం చేసి శక్తిమంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. జనసామాన్యంపై కమ్యూనిస్టుల ప్రభావం పెరిగిపోవడాన్ని, అట్టడుగు వర్గాలవారు ప్రజా ఉద్యమాలలో మరింతగా భాగస్వాములు కావడాన్ని గమనించిన మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూను తన వారసుడుగా ప్రకటించారు. సోషలిస్టు భావజాలాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లి, దానికి విశేష ప్రజా మద్దతును సాధించిన నెహ్రూయే దేశ పరిపాలకుడు కాగలడని గాంధీజీ సుదృఢంగా విశ్వసించారు. బ్రిటిష్ వారు ఎట్టి పరిస్థితులలోను సెప్టెంబర్ 1948 లోగా అధికారాన్ని భారతీయులకు అప్పగించి వెళ్లిపోవలసి ఉన్నది. అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు బాగా పుంజుకోవడంతో ఆ లోగానే నిష్క్రమించడానికి వలసపాలకులు నిర్ణయించుకున్నారు. 1947కు ముందుగానీ, ఆ తరువాత గానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభవించలేకపోయారు. ఎందుకని? వ్యక్తిగత త్యాగాలు ఉద్యమ లక్ష్య సాధనలో ఎవరినీ సఫల మనోరథులను చేయలేవు. పర్యవసానాలను కచ్చితంగా అంచనావేసి, యుక్తమైన వ్యూహాన్ని అభివృద్ధిపరచుకోవాలి. ఇటువంటి ప్రతిభావంతమైన వ్యూహకర్త గాంధీజీ. రైతులు, ముస్లింలు, యువజనులు, హరిజనులు, పట్టణ విద్యావంతులు తన రాజకీయ ఉద్యమాలు, ఆందోళనలలో పరిపూర్ణంగా పాల్గొనేలా చేసి జాతీయోద్యమాన్ని స్వాతంత్ర్య తీరానికి చేరవేసిన వ్యూహకర్త మహాత్ముడు. అయితే తాను నిర్మించిన ఉద్యమం కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వెళ్లడాన్ని గమనించిన గాంధీజీ– నెహ్రూను తనకు వారసుడుగా దేశానికి యోగ్యమైన నాయకుడుగా అభిషేకించారు.
1947లో బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు జరిగిన అధికార బదిలీ ఒక విధంగా పరాయి పాలకులతో కాంగ్రెస్ నాయకులు రాజీపడడమేనని, భారత్‌పై సామ్రాజ్యవాదుల నియంత్రణ కొత్త రూపంలో కొనసాగుతుందని కమ్యూనిస్టులు విశ్వసించారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రధాన కార్యదర్శి బి.టి. రణదివె.. గాంధీ, నెహ్రూలను సామ్రాజ్యవాదుల తొత్తులని నిందించాడు. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం రాలేదని ఘోషించాడు. 1938 నుంచి 1948 పార్టీ ప్రథమ కార్యదర్శిగా ఉన్న పీసీ జోషీ పార్టీని, పార్టీ అనుబంధ సంస్థలు, రచయితల, కళాకారుల సంఘాలను ప్రతిభావంతంగా నిర్మించి అభివృద్ధిపరిచాడు. కాంగ్రెస్‌ను సవాల్ చేయకుండానే సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని ముమ్మరం చేశాడు. రష్యాలో విప్లవానికి ముందు కెరెన్‌స్కీ నిర్వర్తించిన పాత్రనే భారత్‌లో నెహ్రూ పోషిస్తున్నాడని భావిస్తూ తనను తాను లెనిన్‌గా రణదివె ఊహించుకున్నాడు. జోషి నిర్మించిన పార్టీ ఆలంబనతో నెహ్రూ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆశించాడు. ఆయన అభీష్టం నెరవేరకపోగా పార్టీకి తీవ్ర నష్టాలు వాటిల్లాయి. అయినా ఆ తరువాత ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు తనను తాను మావోగా భావించుకుని రైతాంగ విప్లవాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలోను, ఆ తరువాత తేబాగ, తెల్లిచెరి, తెలంగాణ, బాంబేలో చరిత్రాత్మక ప్రజా ఉద్యమాలు నిర్మించిన కమ్యూనిస్టులు భారత ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను సరిగా అర్థం చేసుకోలేక పోయారు. రాజ్యాంగ నిర్మాతలు అయిన జాతీయవాదులు దేశ ప్రజలకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు. అణగారిన వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సమకూర్చారు. భారత్‌ను ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా రూపొందించారు. సంస్థానాలను దేశంలో విలీనం చేసి జమీందారీలు, ఇతర భూస్వామ్య వ్యవస్థలను రద్దు చేశారు. భూసంస్కరణలను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో మిశ్రమ ఆర్థిక విధానాన్ని నెహ్రూ అనుసరించారు. చట్టసభలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే కార్యనిర్వాహక వర్గం మొదలైన ప్రజాస్వామిక సంస్థలను నెలకొల్పిన తొలి స్వతంత్ర దేశం భారత్. నెహ్రూ, అంబేడ్కర్‌లు అభివృద్ధిపరిచిన పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రక్రియల ప్రభావశీలతను భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించి లెనినిజం, మావో భావజాల చట్రంలో కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేకపోయారు.
భారతదేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు పంజాబ్, పశ్చిమ భారత రాష్ట్రాలు, ఆంధ్రలో చోటుచేసుకున్నాయి. నవీన వ్యవసాయంతో రైతు కులాల వారి ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. వ్యవసాయరంగ విప్లవం ఆ సామాజిక వర్గాలను సంఘటితం చేసింది. బొంబాయి, అహ్మదాబాద్, పూనా నగరాలలో పారిశ్రామికాభివృద్ధి ప్రభావంతో వారిలో ఒక పెట్టుబడిదారీ వర్గం ప్రభవించింది. సంపద్వంతులు అయిన ఈ సామాజిక వర్గాల వారు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చారు. నవ భారత రాజకీయాలు మార్క్సిస్టు భావజాల, లెనిన్ రాజకీయ సైద్ధాంతిక చట్రాలకు వెలుపల ఉండడంతో వాటిని కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేక పోయారు. సరైన అవగాహన కొరవడిన కారణంగానే కమ్యూనిస్టులు తొలుత రెండు పార్టీలుగా విడిపోయారు. విడిపోయిన ఒక పార్టీ నుంచి మరొక విప్లవ పార్టీ ప్రభవించి, పిదప అనేక విప్లవ గ్రూపులుగా చీలిపోయింది. చిత్రంగా అందరూ భారత్‌ను అర్ధ భూస్వామ్య, అర్ధ వలస దేశంగా భావిస్తున్నారు.
ధనిక రైతులు రాజకీయ వర్గంగా ప్రభవించి ప్రాంతీయ పార్టీలు కూడా నెలకొల్పారు. కింది కులాలకు చెందిన సన్నకారు, చిన్నకారు రైతులు ఈ ధనిక రైతాంగంతో పోటీపడలేకపోయారు. క్రమంగా వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. వీరి శ్రమ ప్రాతిపదికనే వ్యవసాయ పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందింది. వ్యవసాయరంగంలో పరివర్తన కులాల ప్రాతిపదికన జరిగిందని గ్రహించడం ముఖ్యం.
సామాజిక కులం, ఆర్థిక పెట్టుబడి కలగలసిపోవడమనేది భారతదేశం సాధించిన ఒక నవ కల్పన. అయితే భారత్ తన సామాజిక కులంతో పాటు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమయింది. భారతీయ పెట్టుబడిదారులు వివిధ దేశాలకు పెట్టుబడిని ఎగుమతి చేస్తూనే కుల సంఘాలను ఏర్పాటు చేశారు.
ఈ మేధో సంక్షోభం నుంచి నక్సలిజం ప్రభవించింది. జనతా ప్రజాస్వామిక విప్లవంతో అర్ధ భూస్వామ్య, అర్ధ వలస భారతీయ సమాజాన్ని నిర్మూలించేందుకు నక్సలైట్లు కంకణం కట్టుకున్నారు. 1970ల్లో విద్యార్థులుగా ఉన్న మేము వ్యవసాయ రంగంలో మార్పుల గతిశీలతను అర్థం చేసుకోలేకపోయాం. అయితే అర్ధ భూస్వామ్య, అర్ధ వలస భారతీయ సమాజాన్ని నిర్మూలించాలని ప్రగాఢంగా కోరుకునేవాళ్లం. లెనిన్ తుపాకీ పట్టాడా? తుపాకులే జార్‌ను కూలదోశాయా? 1917 అక్టోబర్‌లో రష్యన్ కార్మికులు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తిరుగుబాటు చేసి వింటర్ ప్యాలెస్‌ను ఆక్రమించుకున్నారు. బోల్షివిక్కుల ప్రభుత్వం ఏర్పడి సోవియట్ రష్యన్ రిపబ్లిక్ నేర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. తిరుగుబాటు చేసిన కార్మికులలోనే లెనిన్ ఉన్నాడు. లెనిన్ తమ మధ్య ఉన్నట్టు ఆ కార్మికులకూ తెలుసు. నక్సలైట్ల వసంతకాల మేఘ గర్జన యాభై సంవత్సరాల అనంతరం కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేత ఎవరైనా హతమైపోతే కనీసం ఒక రోజు బంద్‌ను కూడా పూర్తిగా విజయవంతం చేయలేని పరిస్థితి ఉన్నది. వర్తమాన రాజ్య వ్యవస్థ విప్లవ కమ్యూనిస్టు నాయకులను అంతమొందించేందుకు ఎంతకైనా తెగిస్తుంది. ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థ మహాశక్తిమంతమైన రాజ్య వ్యవస్థను నెలకొల్పింది. దానితో ఘర్షించడం అసాధ్యమనేదే నేను చెప్పదలుచుకున్నది. ఈ కారణంగానే నక్సలైట్లు గ్రామాల నుంచి అడవులలోకి వెళ్లవలసివచ్చింది. ఇప్పుడు సాయుధ బలగాల దాడులను తప్పించుకునేందుకు మధ్య భారతదేశ అడవులలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి నిరంతరం వెళ్లవలసివస్తోంది. సాయుధ పోరాటమే విప్లవం కాదు. అది సామాజిక, రాజకీయ మార్పులను సాధించలేదు. ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థను భారత్ చాలా విజయవంతంగా నిర్మించింది. సాధారణ ఓటర్లు ‘ఓట్ల పండుగ’లో మహోత్సాహంగా పాల్గొనటమే అందుకు నిదర్శనం.
ఇనుకొండ తిరుమలి
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్