Creamy Layer Debate: గవాయ్ వ్యాఖ్యల లోగుట్టు
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:18 AM
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్లలోనూ ‘క్రీమీలేయర్’ వడబోత ఉండాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ వరుసబెట్టి అదేపనిగా అంటున్నారు. ఇలాంటి....
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్లలోనూ ‘క్రీమీలేయర్’ వడబోత ఉండాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ వరుసబెట్టి అదేపనిగా అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీకాదు. కులం కాక, ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు ఉండాలనే వాదన అగ్రకులాలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. ఇప్పుడు రాజ్యాంగం వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకుంటున్న గవాయ్ నోటివెంట ఈ వ్యాఖ్యలు రావటంతో పైవాదనకు బలం చేకూరుతోంది. కాబట్టి, ఎవరు ఏమి కోరుకుంటున్నారనేది కాక, రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతుందనేది ముఖ్యం.
రాజ్యాంగం రెండు సమూహాలకు మాత్రమే రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు. ఈ రెండు సమూహాలకు ఒకే ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వలేదు. తెగలకు వారి ప్రత్యేక జీవన సంస్కృతి ఆధారంగా, కులాలకు ‘సాంఘిక వెలి’ అనేదాన్ని ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాలు అంటే ఎవరనే విషయంలో ఇతర లక్షణాలను గుర్తించినప్పటికీ, ప్రధానంగా అంటరానితనం ఆధారంగానే రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రకంగానే దేశవ్యాప్తంగా అంటరానితనం ఎదుర్కొంటున్న 1200 కులాలు ఈ లిస్టులోకి చేరాయి. తెలుగురాష్ట్రాలలో బీసీలుగా ఉన్న చాకలి, చేపలు పట్టే బెస్త, ముదిరాజులు ఇతర రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాల లిస్టులో ఉన్నారు. అంటే కులాల పరంగా వేరుగా ఉన్నప్పటికీ, వారి మధ్య ఆర్థిక తేడాలు ఉన్నప్పటికీ, అంటరానితనం అనే ఒకే ఒక లక్షణం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. ఇవి ఏ ఒక్క కులానికో, వ్యక్తికో కాక మొత్తం సమూహానికి ఉద్దేశించినవి. బీసీల విషయానికి వస్తే రాజ్యాంగ అధికరణలు 15(4), 15(5), 16(4), 340 ప్రవచించే సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. ఇక, రాజ్యాంగం కేవలం అంటరానితనం దురాచారాన్ని ఎదుర్కొంటున్న సమూహాలను మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించిందని, గిరిజనులను షెడ్యూల్డ్ తెగలుగాను, బీసీలను వెనుకబడిన తరగతులుగాను, అగ్రకులాలుగా పేర్కొంటున్న వారిని ఇతరులుగానూ రాజ్యాంగం గుర్తించిందని గమనించాలి. అలా, భారతీయ సమాజాన్ని నాలుగు ప్రధాన సమూహాలుగా గుర్తించింది. అలాగే, రిజర్వేషన్లు పొందుతున్న మూడు సమూహాలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) ఒకే ప్రాతిపదిక కూడా లేదు. ఈమధ్య కొత్తగా అగ్రకులాలలోని పేదలకు ఈడబ్ల్యుఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నిజానికి రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించినవి కావు. ఈ దృష్ట్యా రిజర్వేషన్లలో ఆర్థిక ప్రాతిపదిక గురించి, క్రీమీలేయరు గురించి చర్చిస్తున్నవారు అందరికీ ఒకే ప్రాతిపదిక ఉన్నట్లు కిచిడి సిద్ధాంతాన్ని వండివార్చుతున్నారు. ఆ సిద్ధాంతంలో భాగంగానే గవాయ్ వ్యాఖ్యలు ఉన్నాయి.
‘ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే ఇంకా రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నాయి. దీనివల్ల ఆయా వర్గాలలోని నిజమైన పేదలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల ఫలాలు అట్టడగువర్గాలకు చేరాలంటే క్రీమీలేయర్‌ను గుర్తించి వారిని మినహాయించాలి. అప్పుడే నిజమైన సమానత్వం సాధ్యం’ అంటున్నారు గవాయ్. ఈ స్టేట్‌మెంట్ చూసినప్పుడు ఆయన గొప్ప సమానత్వవాదిగా కనపడతారు. మరి ఆయన వ్యాఖ్యలలోని సమానత్వం ఎవరిమధ్య? కేవలం షెడ్యూల్డ్ కులాల మధ్యనా, లేక వారికీ ఇతర కులాలకూ మధ్యనా? దేశ ప్రజల మధ్య సమానత్వం రిజర్వేషన్ల ద్వారా మాత్రమే వస్తుందని రాజ్యాంగం కూడా భావించడం లేదు. అలా భావించినట్లయితే ఆదేశిక సూత్రాలను పొందుపరిచేది కాదు. ఈ విషయం గవాయ్‌కి తెలియదా?
భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన తర్వాత కూడా ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న 30 మందిలో 24 మంది అగ్రకులాల వారే. ఐఎఎస్ అధికారుల్లో 68 శాతం, సెక్రెటరీ, అడిషనల్ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీలలో 90 శాతం, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లలో 90 శాతం అగ్రకులాల వారే. కార్పొరేట్ సీఈవోలలో దలాల్ స్ట్రీట్ స్టడీ (2024) ప్రకారం ఎన్‌ఎస్‌ఈ -500 కంపెనీలలో 89 శాతం అగ్రకులాల వారే. ఇలా ప్రతిరంగంలో అసమానతలు కనిపిస్తాయి. మరి, గవాయ్ ఎవరి మధ్య సమానత్వం గురించి మాట్లాడుతున్నారు?
బాబూ జగ్జీవన్‌రామ్ 1978లో దేశ రక్షణమంత్రి హోదాలో బెనారస్‌లో ‘సంపూర్ణానంద్’ విగ్రహావిష్కరణ చేసి వచ్చిన తర్వాత, ఆ విగ్రహాన్ని బ్రాహ్మణులు గంగాజలంతో శుద్ధి చేశారు. 2018 లో రామనాథ్ కోవింద్ దంపతులు పూరి జగన్నాథ ఆలయానికి వెళితే అక్కడివారు అడ్డుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ఘటననూ చూశాం. అత్యున్నత హోదాలో ఉన్న వారిపైనే ఇలా వెలివేతలు, వివక్షలు కొనసాగుతున్నప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవీపీఎస్ వారు దళితులతో దేవాలయ ప్రవేశం చేయిస్తే దేవుడు మైలపడ్డాడని చెప్పి, దేవాలయాన్నీ, దేవుడినీ కూడా వెలివేశారు. ఇదీ మన దేశ ప్రత్యేకత! ఈ ప్రత్యేకత కారణంగానే షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు ఏర్పడ్డాయి.
క్రీమీలేయర్ గురించి మాట్లాడే అర్హత గవాయ్‌కి ఉందా? తండ్రి పార్లమెంటు సభ్యుడు, గవర్నర్ కాబట్టి ఈయన కూడా క్రీమీలేయరే. ఆ విధానమే కనుక ఉండివుంటే గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యేవారా? ఈయన వాదన చూస్తుంటే ‘ఏరు దాటినాక తెప్ప తగలెయ్యి’ అన్న సామెత గుర్తుకొస్తోంది. అలాగే, ఆయన తన తీర్పులో పేర్కొన్న క్రీమీలేయర్ పద్ధతిలో తెలుగురాష్ట్రాలలో రిజర్వేషన్ల వర్గీకరణ జరగలేదు కూడా. పైగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చామని ఈయన చెబుతున్నారు. అలా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? రిజర్వేషన్లలో మార్పులు చేయటం కానీ, అందులో క్రీమీలేయర్ పెట్టే అధికారంగాని సుప్రీంకోర్టుకు ఉందా? ఆ పని చేయాల్సింది పార్లమెంటే. పార్లమెంటు లేదా శాసనసభలు చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోతే వాటిని కొట్టి వేసే అధికారం మాత్రమే సుప్రీంకోర్టుకు ఉంది. పార్లమెంటు చేయాల్సిన పనిని తాను ఎలా చేస్తుంది? ఇది దేనికి సంకేతం? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. విలువలు లేని రాజకీయాలు, పాలక పార్టీల సపోర్టుతో అస్తిత్వ ఉద్యమాలు, రాజ్యాంగబద్ధంగా లేని తీర్పులను చూస్తున్నాం. గవాయ్ వ్యాఖ్యలను ఈ కోవలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గవాయ్ నోట ‘క్రీమీలేయర్’ వడబోత ఉండాలని పలికిస్తున్నదెవరో, తీర్పులను ఇప్పించిందెవరో గ్రహించాల్సి ఉంటుంది.
పట్టా వెంకటేశ్వర్లు
ఇవీ చదవండి: