గవర్నర్ల పంతం ప్రజలకే నష్టం!
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:25 AM
‘మరుసటి విచారణ తేదీ లోపు ఈ విషయాన్ని పరిష్కరిస్తే సరేసరి, లేదంటే మేమే పరిష్కరిస్తాం’ – గౌరవ సుప్రీంకోర్ట్ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి ఇచ్చిన ఘాటైన సూచన ఇది. గవర్నర్ బిల్లుల విషయంలో...
‘మరుసటి విచారణ తేదీ లోపు ఈ విషయాన్ని పరిష్కరిస్తే సరేసరి, లేదంటే మేమే పరిష్కరిస్తాం’ – గౌరవ సుప్రీంకోర్ట్ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి ఇచ్చిన ఘాటైన సూచన ఇది. గవర్నర్ బిల్లుల విషయంలో స్పందించట్లేదని, సుదీర్ఘ కాలయాపనతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కోర్టుకెక్కిన విషయంలో పరిణమించిన సందర్భం ఇది. ఇటువంటి పరిస్థితులే కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ నెలకొని ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నపుడు తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు అనేకం.
నాడూ నేడూ కూడా తెలంగాణ మొదలుకొని, కేరళ, పంజాబ్, తమిళనాడు, బెంగాల్, హిమాచల్ రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు కీలకమైన బిల్లులను ఆమోదించకపోవడం, సుదీర్ఘ కాలం ఎటూ తేల్చకపోవడం, మరీ ఒత్తిడి తెస్తే రాష్ట్రపతి పరిశీలనకు పంపడం సర్వసాధారణమైంది. గవర్నర్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనీ, ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేస్తూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్నారనీ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కడమూ పరిపాటిగా మారింది. ఇవి ప్రజాస్వామ్యంలో అనుసరింపదగ్గ పద్ధతులు కావు.
తెలంగాణాలో అప్పటి గవర్నర్ తమిళిసై కీలకమైన బిల్లులు అనేకం సుదీర్ఘ కాలం ఎటూ తేల్చకుండా ఉన్నారు. ఎమ్మెల్సీల నియామకం విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం లేకుండా, నేరుగా అధికారులను పిలుచుకొని వివరణలు కోరడం, దర్బార్లు నిర్వహించడం, సాధారణ పరిశీలనల పేరిట వెళ్లి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. వ్యవహారం వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్ళింది. ప్రభుత్వం కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. తమిళనాడులో కొన్ని బిల్లులు ౨౦౨౦ నుంచి ఆమోదం పొందలేకపోవటం ఆశ్చర్యమే! గవర్నరు కార్యాలయం వెనక్కి పంపిన బిల్లులను, శాసనసభ తిరిగి ఆమోదించి పంపితే, నేరుగా ఆమోదించకుండా వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపడం కూడా చర్చనీయాంశమైంది. అందుకే బిల్లులను, గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపాలంటే ప్రత్యేకమైన గైడ్‌లైన్స్ ఉండాలనే డిమాండ్ ఊపందుకొంది.
తమిళనాడు గవర్నర్ ప్రభుత్వం తయారు చేసిన అసెంబ్లీ ప్రసంగంలో పొందుపరచిన, డా.బి.ఆర్ అంబేడ్కర్, అన్నాదురై, పెరియార్ వంటి వార్ల పేర్లను విస్మరించడం ఉద్దేశ్యపూర్వకమేనని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఏకంగా తమిళనాడు పేరునే మార్చాలని గవర్నర్ చేసిన ప్రస్తావన కూడా అత్యంత వివాదాస్పదమైంది. కేరళ, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు ఇలాంటి వివాదాలే ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రధానిగా రెండవ పర్యాయం పగ్గాలు చేపట్టిన తర్వాత గవర్నర్ల ఈ తరహా వ్యవహారం మరింత తీవ్రమైందనే విమర్శలు బలంగా ఉన్నాయ్. పంజాబ్‌లో అతి ముఖ్యమైన ఆర్థిక నిర్వహణకు, విద్యకు సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్ వ్యవహారశైలిని తప్పు పడుతూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్‌గా పదవీకాలం ముగించుకొని రాష్ట్రాన్ని వీడుతున్న సందర్భంలో కనీస వీడుకోలుకు నోచుకోలేదంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. బెంగాల్‌లో ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి, నాటి గవర్నర్ జగదీప్ ధన్కడ్, మమతా బెనర్జీ ప్రభుత్వాల మధ్య ఉప్పూ నిప్పూగా ఉన్న సంబంధాల విషయం అందరికీ తెలిసిందే.
గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా ఉంటూ ఇతర పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేసిన దృష్టాంతాలు గతంలో కూడా అనేకం ఉన్నాయి. రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాలు మొదలుకొని, రాష్ట్రపతి పాలనా విధింపు వరకు అనేక సార్లు గవర్నర్ల పాత్ర వివావాదాస్పదమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి, నాదెండ్ల భాస్కర్‌రావును ముఖ్యమంత్రిగా నియమించడంలో నాటి గవర్నర్ రాంలాల్ పాత్ర ఎంత వివాదాస్పదమో విదితమే. ఆ సందర్భంగా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ప్రజల మనస్సులో ఇంకా ఉంది. ఇలా చెప్పుకుంటే పోతే ఉదాహరణలు అనేకం. అందుకే అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే చర్చ ఉత్పన్నమైంది. అది సమాధానం లేని ప్రశ్నలా కొనసాగుతూనే ఉంది.
‘ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెట్టాలంటే కోర్టులనెందుకు ఆశ్రయించాలి? మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు, పార్లమెంటరీ పద్ధతిలోని ప్రభుత్వాలను ప్రమాదంలోకి నెడుతున్నారు’ ఇది పంజాబ్ గవర్నర్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య. సాధారణ వ్యక్తులు కూడా వారి విధుల విషయంలో ఆచరణనో, ఉద్దేశ్యాన్నో తప్పుపడితే, ఆక్షేపిస్తే అవమానంగా భావిస్తారు. మరి అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న గవర్నర్లు వారి వ్యవహారశైలిని, అధికార బాధ్యతల నిర్వహణను కోర్టులు తప్పు పట్టినా అవమానంగా ఎందుకు భావించటం లేదు? వ్యవస్థల్లో లోపించిన సున్నితత్వానికి ఉదాహరణగా భావించాలా? లేక మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న భావనా? కర్తవ్యలేమి కూడా రాజకీయ వ్యూహమనుకోవాలా? కానీ తమను నియమించిన రాజకీయ పెద్దల అజెండాను అమలుపరచే క్రమంలో వ్యవస్థలను బలహీనపరచడం అధికార దుర్వినియోగం కదా? అధికారిక నిర్ణయాలలో విభేదాల కారణంగా జనిస్తున్న వివాదాలకు పరిష్కార కేంద్రాలు కోర్టులేనా? విచక్షణాధికారాలంటే పరిధులు లేని అధికారాలని అర్థమా? ఈ ప్రశ్నలను చర్చలోకి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది.
ఒకే రాష్ట్ర ప్రయోజనాల కోసం నియమితులైన గవర్నర్, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాల మధ్య పరస్పరం కేసులే అభ్యంతరం అనుకొంటే, వాటి వాదనల కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఖరీదైన న్యాయవాదులను నియమించుకోవడం వృథా ఖర్చు కాదా? ఇది ఏ రకమైన జవాబుదారీతనం? ఇరు పక్షాలూ గమనించాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, వెసులుబాట్లు ఇరు పక్షాలకూ ఈ రకంగా వ్యవహరించడానికి అవకాశం కల్పించి ఉండవచ్చు. కానీ నిజమేదో అబద్ధమేదో తెలియని అమాయకులెవరూ లేరు. ప్రజా ప్రయోజనాలే అంతిమ లక్ష్యం కావాలి కానీ, ఎవరు గొప్ప అనే తర్కం పనికి రాదు. నిర్ణయాల్లో ఆలస్యం, హేతుబద్ధత లేకపోవడం ప్రజా ధనాన్ని నష్టపర్చడమే గాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని కుంటుపరుస్తుంది. ప్రభుత్వాల లక్ష్యాల్ని నీరుగారుస్తుంది. తద్వారా ప్రజలకు నష్టం కలగజేస్తుంది. కాబట్టి వ్యవస్థల్లో ఇటువంటి లోపాల పట్ల ప్రజలు, మేధావులు ప్రశ్నించాలి. ఇటువంటి సందర్భాలు తలెత్తకుండా సంబంధిత వ్యవస్థల్లో ముఖ్యులు ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పనిచేయాలి. ఈ సందర్భంగా గౌరవ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన మరొక నిర్దేశిత అభిప్రాయాన్ని ప్రస్తావిస్తాను: ‘భారతదేశం సుదీర్ఘకాలంగా అందరూ గౌరవిస్తున్న కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు, అనుసరణల ఆచరణ ప్రకారం నడుస్తోంది. వాటిని మనం గుర్తించి, గౌరవించాలి.’
రావుల శ్రీధర్ రెడ్డి
మాజీ చైర్మన్, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, బీఆర్‌ఎస్ నేత
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News