రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సంకీర్ణ ప్రభుత్వం
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:37 AM
భారతదేశంలో ఏక పార్టీ పాలన ముగిసిన తరువాత డెబ్బైయ్యో దశకంలో ప్రారంభమైన సంకీర్ణ రాజకీయాలు అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాల్ని ఎదుర్కొంటూ...
భారతదేశంలో ఏక పార్టీ పాలన ముగిసిన తరువాత డెబ్బైయ్యో దశకంలో ప్రారంభమైన సంకీర్ణ రాజకీయాలు అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాల్ని ఎదుర్కొంటూ పరిణతి చెందుతూ వస్తున్నాయి. జనతా ప్రభుత్వంతో మొదలై నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే, యూపీఏ, ఇండియా కూటముల రూపంలో నేటికీ దేశంలో సంకీర్ణ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ పరిపక్వతకి చరిత్ర నేర్పిన అనేక పాఠాలే కారణం. సమకాలీన పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ మెజార్టీ సాధించినా, అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. పార్టీ ఫిరాయింపులు వెన్నంటే ఉంటున్నాయి. తరువాతి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలియదు. నేడు ప్రతి సామాజిక వర్గం, రాజకీయ పార్టీ అధికారంలో తన వాటా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడున్న సమీకరణాలు రేపు ఉంటాయో లేదో తెలియదు. ఎలా మారుతాయో ఊహించలేం. రాజకీయ పార్టీలది ఎన్నికల వరకు ఒక తీరు, గెలిచాక మరో తీరు. ఏదీ గ్యారంటీ లేని నియో లిబరల్ రాజకీయ వాతావరణం సమాజాన్ని ఆవహించింది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణాల్ని తెగేవరకి లాగటం ఎంత ప్రమాదకరమో గత ఐదు దశాబ్దాల్లో అవగాహన కలిగింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను పాలిస్తున్న కూటమి నాయకుల్లో ఈ అవగాహన బలంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా టీడీపీ, జనసేన వర్గాల్లో అక్కడక్కడ కొన్ని టెన్షన్స్ కనిపిస్తున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాటిని సముదాయిస్తున్నారు. భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా, బాధ్యతారహితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ఇద్దరూ హద్దుల్లోనే ఉంచుతున్నారు. వారు పరస్పర గౌరవాన్ని, ప్రాధాన్యతని పదేపదే శ్రేణులకి గుర్తుచెయ్యటం అందులో భాగమే. గత ఎన్నికల్లో కూటమిలో పవన్ కల్యాణ్ లేకపోతే ఎంత రిస్కో చంద్రబాబుకు, ఆయన లేకపోతే ఎంత ప్రమాదకర పరిణామాలు చోటుచేసుకునేవో పవన్ కల్యాణ్‌కి తెలుసు. పొత్తు లేకపోతే ఫలితాలు ఇలా ఉండేవికావన్న విశ్లేషణలు భవిష్యత్తులో ఇద్దరూ కలిసి నడవాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి. ఈ సందర్భంలోనే 15 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వ పాలన అవసరాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు కొనసాగుతుందని చెప్పటం ఆయన వాస్తవిక దృక్పథాన్ని సూచిస్తుంది.
సంకీర్ణ ప్రభుత్వాలైనా, ఏకపార్టీ ప్రభుత్వాలైనా పాలనలో కొన్ని పొరపాట్లు దొర్లటం సహజం. దురదృష్టవశాత్తూ ఆ పొరపాట్ల మీద నాయకుల్లో ఆత్మవిమర్శ అరుదుగా జరుగుతుంది. ఫలితంగా ఆ పొరపాట్లని ప్రతిపక్షాలు ఆయుధాలుగా మలుచుకుంటాయి. పవన్ కళ్యాణ్ ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిమీద తానే ముందుగా స్పందించి సహచరులను అప్రమత్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల ప్రజల్లో క్రెడిబిలిటీ పెంచుతుంది. లోపాలు దిద్దుకునే అవకాశం కలిగిస్తుంది. ప్రతిపక్షాలు కొత్తగా ప్రజలకి చెప్పటానికి ఏదీ లేకుండా చేస్తుంది.
సంకీర్ణ రాజకీయాల్లో సాధారణంగా పెద్ద పార్టీలు చిన్న పార్టీల అభిప్రాయాల్ని గౌరవించకుండా వ్యవహరిస్తాయి. సంకీర్ణాలకి ఇది ప్రమాదకరం అని గుర్తించనందువల్ల దేశంలో అనేక ప్రభుత్వాలు కూలిపోయాయి. అన్నింటికంటే ఉమ్మడి అజెండాకి దెబ్బతగలకుండా చూసుకోవాలి. దీని బాధ్యత అన్ని పార్టీలపై ఉన్నప్పటికీ పెద్ద పార్టీల పైనే ఎక్కువ ఉంటుంది. గతంలో మొరార్జీదేశాయి, విపి సింగ్, గుజ్రాల్, వాజపేయి లాంటి వారు మొదలుపెట్టిన సంకీర్ణ రాజకీయాలు ముక్కచెక్కలు కావటానికి కారణం భాగస్వాముల మధ్య పట్టువిడుపులు లేకపోవటమే. ఆ రాజకీయాలకి పూర్తిగా భిన్నమైన సంకీర్ణం నేడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలసి రాష్ట్రంలో గాడితప్పిన శాంతిభద్రతలు, అభివృద్ధి కోసం పొత్తు అవసరమని ప్రజల్ని ఒప్పించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు గాడిలో పడుతున్నాయి. పరిస్థితుల్ని చక్కదిద్దాలంటే ఈ ప్రభుత్వానికి తగినంత సమయం కావాలి. గత ప్రభుత్వం కేంద్రం నుంచి కనీస వనరుల్ని కూడా సమకూర్చలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రం కేంద్రప్రభుత్వంలో కీలక భాగస్వామిగా అన్ని రంగాల్లో తన వాటాని పొందుతున్నది. కేంద్రంతో ఇటువంటి సానుకూలమైన వాతావరణంలో ప్రగతికి అవకాశం మెండుగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వాడుకోలేకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలియజేయటానికి తరచూ పవన్‌కల్యాణ్ కూటమి ప్రాధాన్యతని గుర్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. భాగస్వాములు సంయమనం, సహనంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ కూటమినీ, తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని ఆ మాటలు తెలియజేస్తున్నాయి. చిన్నాచితకా సమస్యల్ని పెద్దగా చూపి కూటమిని బలహీనపరచాలనుకునే ప్రచారాలకి చెక్ పెడుతూ, రాష్ట్రం అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంటుందని ప్రజల్లో భరోసా కలిగించటంగా ప్రజలు ఆయన మాటల్ని తీసుకుంటున్నారు.
ప్రొఫెసర్ శ్రీపతి రాముడు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి
For More Andhra Pradesh News and Telugu News..