ఆందోళన అర్థవంతమే!
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:22 AM
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవచ్చుననే భయం అర్థరహితం కాదు, సహేతుకమే. నష్టపోతారని ఎవరూ భయపడనక్కర...

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవచ్చుననే భయం అర్థరహితం కాదు, సహేతుకమే. నష్టపోతారని ఎవరూ భయపడనక్కర లేదంటూ, పార్లమెంటులో ఈ రాష్ట్రాలు ఏ మాత్రం సీట్లు కోల్పోవడం జరగదని ఈ మధ్య తమిళనాడులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ పద్ధతిలో, ఇలా చేయొచ్చు అని చూచాయగానైనా ఆయన, కేంద్ర ప్రభుత్వం వివరిస్తే తప్ప, ఈ ఆందోళన సమసిపోదు. దానికి ముఖ్య కారణం ఇప్పుడు అమల్లో ఉన్న ఏ విధానం తీసుకున్నా, ఫలితాలు వ్యతిరేకంగానే వస్తాయి.
వాస్తవానికి పదేళ్లకోసారి జరిగే ప్రతీ జనాభా లెక్కల తర్వాత పార్లమెంటు స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి. కానీ మూడుసార్లు మాత్రమే జరిగాయి. కారణం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచినప్పుడు, జనాభా నియంత్రణ చక్కగా అమలుపరిచిన రాష్ట్రాలు నష్టపోతున్నాయి. అలా జరగరాదని 1971 జనాభా లెక్కల ప్రకారమే సంఖ్య నిర్ధారించి, 2026 వరకూ పెంచకుండా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్రీజ్ చేశారు. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రాతిపదికన కొత్తగా డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. అది 2031 సెన్సస్‌కి వర్తించాల్సింది. కానీ 2021లో కరోనా కారణంగా వాయిదాపడిన లెక్కలు 2026కి అందుబాటులోకి వస్తాయి కనుక, అవే తాజా ప్రాతిపదిక అవుతాయి. పార్లమెంటు ద్వారా ఏర్పడబోయే డీలిమిటేషన్ కమిషన్ వాటినే గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ పెరిగింది. పార్లమెంటు సీట్లను అలాగే 543గానే ఉంచి, నియోజకవర్గాలను జనాభా నిష్పత్తి ప్రకారం మారిస్తే తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ చెరో ఎనిమిదేసి సీట్ల చొప్పున కోల్పోతాయి. అలా కాకుండా ఇంత జనాభాకు ఒక నియోజకవర్గం అంటూ మొత్తం సీట్లను 840కి పైగా పెంచాల్సి వస్తే, దక్షిణాది రాష్ట్రాలకు పది చొప్పున పెరిగితే, ఉత్తరప్రదేశ్‌కు ఏకంగా 65 పెరుగుతాయి. ఏ రకంగా చూసినా నష్టమే కనబడుతున్నది. కాబట్టి కేంద్రం, పార్లమెంటు ఈ అసమానతలు లేకుండా మార్గాంతరం చూడాలి. వీలైతే సీట్ల పెంపుదలపై ఫ్రీజింగ్ కొనసాగించి, రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుకోవాలి. అప్పుడు కూడా రాజ్యసభకి రాష్ట్రాల ప్రాతినిధ్యంలో అసమానతలు ఏర్పడకుండా చూడాలి. సామాజిక న్యాయం, ప్రాంతాల ప్రాతినిధ్యం సరిగ్గా ఉన్నపుడే ప్రజాస్వామ్యానికి అందం, బలం.
డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ
Also Read:
లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్
For More Andhra Pradesh News and Telugu News..