Share News

India Pakistan Cricket: డబ్బు ఆడిస్తున్న ఇండో పాక్‌ క్రికెట్‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:46 AM

‘రక్తమూ, నీరూ కలిసి ప్రవహించవు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. పహల్గాం ఉగ్ర దాడి వెన్వెంటనే ఆరు దశాబ్దాల సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాకిస్థాన్‌కు చేసిన హెచ్చరిక అది. రక్తం నీటితో కలిసి ప్రవహించక పోవచ్చుగానీ అది...

India Pakistan Cricket: డబ్బు ఆడిస్తున్న ఇండో పాక్‌ క్రికెట్‌

‘రక్తమూ, నీరూ కలిసి ప్రవహించవు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. పహల్గాం ఉగ్ర దాడి వెన్వెంటనే ఆరు దశాబ్దాల సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాకిస్థాన్‌కు చేసిన హెచ్చరిక అది. రక్తం నీటితో కలిసి ప్రవహించక పోవచ్చుగానీ అది తప్పకుండా క్రికెట్‌ క్రీడతో కలిసి కచ్చితంగా ప్రవహిస్తుంది. మరో పక్షం రోజుల్లో ఆసియా కప్‌ క్రికెట్‌ ప్రారంభమవనున్నది. క్రికెట్‌ అభిమానులు అందరూ మరీ ముఖ్యంగా భారత్‌–పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లకు మోదీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆసియా కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ద్వైపాక్షిక సంబంధాలు, బహుళ పాక్షిక ఈవెంట్స్‌ మధ్య ఒక విలక్షణ వ్యత్యాసాన్ని కల్పిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. అంతేకాకుండా అవి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల ఆతిథేయిగా భారత్‌ను ఎక్కువగా ఇష్టపడేట్టు కూడా చేస్తాయని ఆయన అన్నారు.

మోదీ ప్రభుత్వం సూత్రబద్ధంగా 2012 నుంచి అనుసరిస్తున్న అలిఖిత మార్గదర్శక సూత్రాలకే అంటిపెట్టుకుని ఉన్నది: ఆనాటి నుంచి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లు అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో ఆడుతున్నవి మాత్రమే. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య క్రీడా సంబంధాలు సుదృఢమవ్వాలని సుదీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్న క్రికెట్‌ అభిమానిగా ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ పట్ల ప్రభుత్వ వైఖరిని ఎటువంటి ఆక్షేపణ లేకుండా స్వాగతిస్తున్నాను. ఈ విశాల ఉపఖండాన్ని క్రికెట్‌ ఏకం చేస్తున్నది. భిన్న వర్గాల ప్రజల మధ్య స్నేహ బంధాలను నిర్మిస్తోంది. ప్రజల మధ్య స్నేహసేతువులను నిర్మించేవి, నిర్మించగలిగేవి ఆటలే కదూ? క్రికెట్‌ అభిమానిగా నా మధుర జ్ఞాపకాలలో ముఖ్యమైనవి భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌లే. కోట్లా స్టేడియంలో అనిల్‌ కుంబ్లే పది వికెట్లు తీసుకోవడం, 2003 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ అనితర సాధ్యమైన బ్యాటింగ్‌ నుంచి షార్జాలో జావేద్‌ మియాందాద్‌ చివరి బంతి ఆరు పరుగులు దాకా, ఇండో–పాక్‌ క్రికెట్‌ వీక్షకులలో అంతిమ భావోద్వేగ ఆశా నిరాశలను ప్రస్ఫుటీకరిస్తుంది. ఆ ఉద్విగ్నతలలో కలహశీల గత, వర్తమాన చరిత్రలు బంధితమవుతాయి. ఒక ఇమ్రాన్‌ ఖాన్‌, ఒక సునీల్‌ గవాస్కర్‌ మధ్య, ఒక షోయబ్‌ అఖ్తర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ మధ్య పోటాపోటీ ఆట క్రికెట్‌ సౌందర్యాన్ని కళ్లకు గట్టిస్తుంది. ఆ ప్రామాణిక క్రీడా నైపుణ్య ప్రభావం ఆటస్థలం ఆవల కూడా అమితంగా ఉంటుంది.


అయితే ఇప్పుడు ఆసియా కప్‌ క్రికెట్‌ రేకెత్తిస్తున్న భావోద్వేగాలు భిన్నమైనవి. కేవలం రెండు నెలల క్రితమే సంభావ్య అణుయుద్ధం అంచుల నుంచి వెనక్కి వెళ్లిన రెండు దేశాల క్రికెట్‌ టీమ్‌ల మధ్య జరగనున్న మ్యాచ్‌ ఇది. పహల్గాంలో సంభవించింది మాటల్లో చెప్పలేని రాక్షస చర్య. ఆసేతు హిమాచలం సకల భారతీయులను కలవరపెట్టిన దురాగతమది. అయినప్పటికీ పాకిస్థాన్‌ సైనిక రాజ్యం ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తాము స్వయంగా ప్రోత్సహించిన ఉగ్రవాదం సృష్టించిన మహా బీభత్సానికి ఆ సైనిక రాజ్యం ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి సుముఖత చూపలేదు. సామాన్య భారత పౌరులపై జరిగిన ఆ దాడిని ‘తప్పుడు జెండా చర్య’ (ఫాల్స్‌ ఫ్లాగ్‌ ఆపరేషన్‌ – నిజమైన బాధ్యులను దాచిపెట్టి మరొక పార్టీ లేదా సంస్థపై నిందమోపే ఉద్దేశంతో నిర్వహించే రహస్య చర్య)గా అభివర్ణించేందుకు ఒక మొరటు ప్రయత్నం జరిగింది. ఉగ్రవాద సంస్థ లష్కర్‌ ప్రేరిత ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ క్రూరత్వాన్ని యథావిధిగా కప్పిపుచ్చారు. పాకిస్థాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదంపై భారత్‌ న్యాయబద్ధమైన ఆందోళనలను కనీస మాత్రంగానైనా అంగీకరించేందుకు కూడా తిరస్కరించడం జరిగింది. పహల్గాం ఘటనకు కొన్ని వారాల ముందు ద్విజాతి సిద్ధాంతాన్ని సంపూర్ణంగా సమర్థించిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ భారత్‌ పట్ల విషం చిమ్మడాన్ని కొనసాగిస్తూ ఉండగానే ఆయనకు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించారు.

ద్రోహ బుద్ధితో వ్యవహరించే పాక్‌ సైనిక–రాజ్యం కుట్రలు, కుతంత్రాలకు అంతర్జాతీయ క్రికెటర్లు ఎలా స్పందించాలి? ‘వెయ్యి గాయాల’తో భారత్‌ రక్తమోడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ వ్యవస్థ అనాగరికత నుంచి స్ఫూర్తిదాయక క్రీడ క్రికెట్‌ విలక్షణత, స్వచ్ఛతను సంరక్షించడం సాధ్యమవుతుందా? సూత్రప్రాయంగా సాధ్యమే, వాస్తవంగా అయితే కానేకాదు. పహల్గాం దాడి తరువాత భారత ప్రజలకు సంఘీభావం, సహానుభూతి తెలుపుతూ పాకిస్థాన్‌ క్రికెట్‌ సమాజం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. చేయకపోగా పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రీది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ ఉగ్రవాద దాడికి భారత సైన్యానిదే బాధ్యత అని ఆరోపించారు. ఇటువంటి నిందారోపణ చేసింది ఆయన ఒక్కరే కాదు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ చీఫ్‌ షాబాద్‌ షరీఫ్‌, ప్రభుత్వంలో మంత్రి కూడా అయిన మోహిసిన్‌ నఖ్వి ఏమన్నారో చూడండి: ‘పాకిస్థాన్‌ అణ్వాయుధ రాజ్యం. మాతో క్రికెట్‌ ఆడేందుకు తిరస్కరించే ధైర్యం భారత్‌కు లేదు. అలా తిరస్కరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో వారికి తెలుసు’.

న్యూఢిల్లీ పట్ల పాకిస్థాన్‌ పాలనా వ్యవస్థలో ఎంత విరోధ భావం ఉన్నదో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ చీఫ్‌ విద్వేష ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. సరే, మన దేశంలోనూ పాకిస్థాన్‌ పట్ల ఒంటికాలిపై లేచి ఆగ్రహోదగ్రులయ్యేవారు చాలా మంది ఉన్నారు. పాకిస్థాన్‌ను శాశ్వతంగా నిర్మూలించాలని వారు తరచు యుద్ధోన్మాద ప్రేలాపనలు పేలుతుంటారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో వాఘాకు ఆవల, ఈవల మీడియా నిష్పాక్షికంగా వ్యవహరించ లేదు. భారతీయ మీడియా అయితే కొంచెం ఎక్కువ కలహశీలంగా వ్యవహరించింది కూడా. సంస్థాగతమైన ప్రవర్తనా నియమావళి పూర్తిగా కూలిపోయింది. న్యూస్‌ యాంకర్ల ప్రదర్శనాత్మక జాతీయవాదం ఇప్పుడు న్యూస్‌ టీవీ వ్యాకరణంలో అంతర్భాగమై పోయింది.


ఇటువంటి పరిస్థితులలో ఇండో–పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఇరు దేశాల ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందా? స్నేహాన్ని కుసుమింప చేస్తుందా? అలా జరిగేందుకు ఆస్కారం లేదు. రాజకీయ, మీడియా వర్గాల సంకుచిత వైఖరులు అటువంటి శుభస్కర పరిస్థితులను అనుమతించవు. 2004లో నేను పాకిస్థాన్‌లో పర్యటించాను. ఒక టెస్ట్‌ సిరీస్‌లో పాకిస్థాన్‌ను భారత్‌ ప్రప్రథమంగా ఓడించిన సందర్భమది. అయినా భారతీయ క్రికెటర్ల పట్ల పాకిస్థానీయులు ఎనలేని సుహృద్భావాన్ని చూపారు. అపూర్వ గౌరవ మర్యాదలు చేశారు. ప్రజల స్థాయిలో వర్ధిల్లే సంబంధాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో పాకిస్థానీయుల నడవడి స్పష్టం చేసింది. భారత్‌– పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే ఆశాభావం మిణుకుమన్నది. లాహోర్‌లో ఒక సాయంత్రం నన్ను క్రికెట్‌ అభిమానులు చుట్టు ముట్టారు. ‘బాలాజీ ధీరే చలో’ అని గానం చేశారు. అది భారతీయ ఫాస్ట్‌ బౌలర్‌ లక్ష్మీపతి బాలాజీ గురించిన ప్రస్తావన. అనుక్షణం మందహాసం చేస్తుండే బాలాజీ మోము పాకిస్థానీయుల హృదయాలను గెలుచుకున్నది. అలాగే 1999లో చెన్నైలో ఇండో–పాక్‌ మ్యాచ్‌లో కొద్ది తేడాతో భారత్‌ ఓడిపోయింది. అయినప్పటికీ స్టేడియంలో ఉన్న భారతీయ క్రికెట్‌ అభిమానులు పాకిస్థానీ క్రీడాకారులకు జేజేలు పలికారు. వారిని మనసారా అభినందించారు. ఒక అవిటి బాలుడు పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఒకరి ఆట తీరును అభినయించి చూపడం అందరినీ ఆకట్టుకున్నది. ఆ అవిస్మరణీయ క్షణాలలో కూడా ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు తప్పక నెలకొంటాయనే ఆశాభావం జనించింది. అయితే అదొక తప్పుడు ప్రభాతమని రుజువయింది. ఎంత విచారకరం! నిజం చెప్పాలంటే భారత్‌–పాకిస్థాన్‌ సంబంధాలు ఏమైనా కావచ్చు గానీ సాధారణమైనవి అని చెప్పడానికి వీలు లేదు.

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ ఇంకెంత మాత్రం, ఏ జాతీయ జట్టునూ బాయ్‌కాట్‌ చేయడాన్ని తీవ్రంగా నిరసించే క్రీడా మర్యాదలకు నిబద్ధమవడం లేదు. ధనలాలసతో నడుస్తున్న అపార సంపద్వంత క్రీడా సంఘాల అనైతిక ప్రపంచంలో నిజంగా ముఖ్యమైన ఏకైక విషయం స్పాన్సర్‌షిప్‌ మనీ మాత్రమే సుమా! ఈ ప్రాయోజిత ధన శక్తి అంతకంతకూ ఇతోధికంగా పెరుగుతోంది. క్రికెట్‌ జగత్తుకు సంబంధించిన చాలా సరళ సత్యమిది. పక్షం రోజుల పాటు జరిగే ఆసియా కప్‌ క్రికెట్‌లో మరే ఇతర మ్యాచ్‌ల కంటే భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌ మాత్రమే సంఖ్యానేక క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. వాణిజ్య ప్రకటనల ద్వారా మిగతా మ్యాచ్‌లకు సమకూరే మొత్తం ఆదాయం కంటే ఈ ఒక్క మ్యాచ్‌కు లభించే సదరు ఆదాయమే అధికంగా ఉంటుంది. క్రికెట్‌ వాణిజ్యమే ఇండో–పాక్‌ క్రికెట్‌ను ప్రోత్సహిస్తోంది. ఆ లాభాల పంటే దానికి ప్రధాన ఆసరా. దేశ విభజనతో విడిపోయిన పేద సాధారణ భారతీయులు, పాకిస్థానీయులు, పహల్గాం ఉగ్ర ఘాతుకం అనంతరం, పరస్పర కుటుంబాలను సందర్శించేందుకు వీసాలు పొందలేక పోతున్నారు. అయితే ఇరు దేశాల క్రికెట్‌ బోర్డ్‌ల వీవీఐపీ కులీనులు మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలో చాలా సంతోషంగా ఎయిర్‌ కండిషన్డ్‌ బాక్స్‌ లలో రాసుకు పూసుకు కూర్చొని ఆటను వీక్షిస్తారు. ఇది తథ్యం. రక్తమూ నీరూ సహజీవనం చేయక పోవచ్చుగానీ డబ్బు (ఏ రంగులో ఉన్నది అయితేనేం)కు హద్దులు లేవు. అవును, దానికి ‘వాఘా–అట్టారి’ లాంటి సరిహద్దులు తెలియనే తెలియవు. మైదాన్‌లో ‘యుద్ధం’ ప్రారంభం కానివ్వండి!


తాజా కలం : ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానుల వాట్సాప్‌ గ్రూప్‌లో నేనూ భాగంగా ఉన్నాను. నిజాయితీగా చెబుతున్నాను: వాఘా సరిహద్దుకు ఆవల నుంచి రాజకీయాల రొద లేకుండా క్రికెట్‌ అనురక్తులైన ప్రతిభావంతుల చర్చలను వినడం నాకు చాలా ఉల్లాసంగాను, ఉపశమనం కలిగిస్తున్నదిగాను ఉన్నది. గవాస్కర్‌, హనీఫ్‌; ఇమ్రాన్‌, కపిల్‌ దేవ్‌; విరాట్‌, బాబర్‌ ఆజమ్‌ల క్రికెటింగ్‌ ప్రావీణ్యాలపై ఉత్తేజకరమైన చర్చలు, సందేహం లేదు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు సార్వకాలిక సంయుక్త ఇండియా–పాకిస్థాన్‌ ఎలెవన్‌ మనం ఎంపిక చేసుకోవాలి. ఎవరు ఎన్ని జెట్‌ విమానాలను కూల్చి వేశారన్న విషయమై పెద్ద పెట్టున వాదోపవాదాలు చేయడం కంటే ఆ సార్వకాలిక మేటి క్రికెటర్ల జట్టును ఎంపిక చేయడమే చాలా తేలిక!

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 05:46 AM