Share News

Telangana Pensioners: పెన్షనర్లకు ఏడాదిన్నరగా దక్కని ప్రయోజనాలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 02:05 AM

గత ఏడాది మార్చి తర్వాత రిటైరైన ఉద్యోగుల పరిస్థితి దుర్భరమే కాదు దుఃఖపూరితంగా ఉంది. 20 నెలలుగా పద్నాలుగువేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వాళ్లకు రావాల్సిన...

Telangana Pensioners: పెన్షనర్లకు ఏడాదిన్నరగా దక్కని ప్రయోజనాలు

గత ఏడాది మార్చి తర్వాత రిటైరైన ఉద్యోగుల పరిస్థితి దుర్భరమే కాదు దుఃఖపూరితంగా ఉంది. 20 నెలలుగా పద్నాలుగువేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వాళ్లకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటెడ్ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ వారికి అందలేదు. ఇవన్నీ కలిసి ఒక్కొక్కరికీ సరాసరి 50 లక్షల వరకు ఉండొచ్చు. ఈ ఆర్థిక ప్రయోజనాలతో పూర్తిచేద్దామనుకున్న పిల్లల పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి కార్య్రకమాలకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం వీరికి నెలవారి పెన్షన్ మాత్రమే వస్తోంది. జీవితాంతం కష్టపడి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మీద ఆశలు పెట్టుకున్నవారు ప్రభుత్వ విధానాల వల్ల కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్థిక వెసులుబాటు లేక మానసికంగా బాధపడుతూ రోగాలపాలై ఇప్పటికీ దాదాపు 36 మంది చనిపోయారు. ఇది దారుణం!

పింఛను పొందడం ఉద్యోగి ప్రాథమిక హక్కు అని భారత ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన ప్రయోజనాలను అందించక 20 మాసాలుగా కాలయాపన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు సకాలంలో జీతాల చెల్లింపుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించ లేకపోయినా బకాయిలను తక్షణమే చెల్లిస్తామని, ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన అన్ని డీఏలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాక ఉద్యోగుల పాక్షిక కాంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రులలో వైద్యం అందించేందుకుగాను హెల్త్ కార్డులు జారీ చేస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని హామీలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చింది. కానీ గత ప్రభుత్వ బాటలోనే నడుస్తోంది. పెన్షనరీ బకాయిలు అందక మనోవ్యధతో రిటైరైన ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వం తక్షణమే స్పందించి రిటైర్ అయిన వారి డబ్బును ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలి. ఈ బెనిఫిట్స్‌ కోసం నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో పెన్షనర్లు నిరాహారదీక్షకు పూనుకున్నారు.

కోహెడ చంద్రమౌళి

ఇవి కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 24 , 2025 | 02:05 AM