కాళేశ్వరం ఓ పెద్ద గుదిబండ
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:41 AM
తెలంగాణ రాష్ట్రానికి గుదిబండైన కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించుకోవడానికి పాపం బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ వాళ్ళ అధినాయకుడు కేసీఆర్‌ను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను 2019లోనే...
తెలంగాణ రాష్ట్రానికి గుదిబండైన కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించుకోవడానికి పాపం బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ వాళ్ళ అధినాయకుడు కేసీఆర్‌ను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను 2019లోనే, ఇంకా ఐఎఎస్ సర్వీసులో ఉన్నప్పుడే, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఒక మీటింగ్‌లో ఇది చాలా దండుగ ప్రాజెక్టు అని ఒక సివిల్ ఇంజనీరుగా వివరించి చెప్పాను. బీఆర్‌ఎస్ పార్టీలోని ఆ నలుగురి వాగ్ధాటికి, అబద్ధాల టాలెంటుకు ఎక్కడ తెలంగాణ ప్రజలు ఆగం అయితరో అని ఇప్పుడు ఈ వ్యాసం రాస్తున్నాను.
గొప్ప వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త, అంతర్జాతీయంగా ఎన్నో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన, బీసీ సామాజిక వర్గానికి చెందిన, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌గా ఉన్న ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆంధ్రజ్యోతిలో జూలై 2న కాళేశ్వరం మీద సాంకేతిక అంశాలతో వ్యాసం రాశారు. దానికి సమాధానంగా జూలై 3న కల్వకుంట్ల కవిత ‘తెలంగాణకు కాళేశ్వరమే శ్రీరామరక్ష’ అంటూ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పునరావాస కేంద్రం అయ్యిందని జానయ్యను విమర్శించడం వారి అహంకారానికి నిదర్శనం.
రాష్ట్రంలో సంవత్సరానికి 36 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్న ఈ ప్రాజెక్టు ఏ ఒక్క సంవత్సరంలోనూ లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టు కట్టడంలో ముఖ్యపాత్ర వహించిన ఇంజనీర్–ఇన్–చీఫ్ (జనరల్) మురళీధర్, మేడిగడ్డ దగ్గర ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో గరిష్ఠంగా ఒక సంవత్సరంలో 98వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చినట్టు చెప్పారు. ఈయన కేసీఆర్‌కు బంధువు.
ఒకవేళ ప్రాజెక్టు బాగా పని చేసినట్లైతే కరెంటు, మరమ్మత్తులు, సిబ్బంది ఖర్చులు కలిపి ఎకరానికి సుమారు లక్ష రూపాయలు అవుతుంది. పంట మీద వచ్చే నికర ఆదాయం సగటున రూ.25వేలు మించి ఉండదు. ఇంకా ఖర్చు పెట్టిన లక్ష కోట్లు, వాటి మీద కట్టే రూ.6500 కోట్ల మిత్తి లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎకరానికి లక్ష ఖర్చు పెట్టే బదులు, రైతులకు రూ.25వేలు డైరెక్టుగా ఇస్తే, ఇంకా ఎకరానికి రూ.75వేలు రాష్ట్రానికి మిగులుతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టును 56 పనులుగా విభజించగా, లక్ష కోట్లు ఖర్చు చేసినా అందులో 12 పనులు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన 40 పనులు మూడు నుంచి 90 శాతం వరకు వివిధ దశలలో ఉన్నాయని, ఇంకా నాలుగు పనులు అసలు ప్రారంభం కాలేదని ‘కాగ్’ వెల్లడించింది. పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపొందించిన తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, పాత డిజైన్‌లోనే ప్రాజెక్టు కడితే 63,352 కోట్లతోనే పూర్తయ్యేదని, రీ–డిజైన్ కారణంగా నిర్మాణ వ్యయం రూ.1,02,268 కోట్లకు చేరిందని, మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.1,51,168 కోట్లకు నిర్మాణ వ్యయం చేరుతుందని కూడా కాగ్ వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.97,449 కోట్లు ఋణాలు తీసుకుంది. వీటిని తీర్చడానికి రూ.71,575 కోట్లు వడ్డీలు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. 2039–40 వరకు మనకు ఈ అప్పుల బాధ ఉంటుంది. ఎన్ని వేల కోట్లు? ఈ డబ్బుతో మనకు సరిపడ ప్రపంచస్థాయి ప్రభుత్వ బడులు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు, రైతులకు సరిపడ గోడౌన్లు, అన్ని పంటలను కొనడానికి కావలసిన మూలధనం, తెలంగాణ యువతకు ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగాలు పొందడానికి కావలసిన 119 స్కిల్ సెంటర్లు కట్టుకునే వాళ్ళం కదా!
ప్రాజెక్టు డీపీఆర్‌లో కూడా అన్నీ అబద్ధాలే! మామూలుగా అన్ని నీటిపారుదల ప్రాజెక్టులలో ఒక్క టీఎంసీ నీటితో 10,000 ఎకరాలు పారించవచ్చు అని అంచనా కడతారు. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీటితో 17,668 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని రాసారు. చేపల పెంపకం ద్వారా, పరిశ్రమలకు నీటి సరఫరా ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అబద్ధాలు రాశారు. కరెంటు ఖర్చు యూనిట్‌కు మూడు రూపాయలు అవుతుందని లెక్క కట్టారు. కానీ అప్పటికే ఖర్చు రూ.6.40గా ఉంది.
ఇంత పెద్ద ప్రాజెక్టును పిచ్చిపిచ్చిగా డిజైన్ చేసి, తొందరగా కట్టించి, నాణ్యత విషయంలో రాజీపడి, చివరిగా మేడిగడ్డ డ్యాం నెర్రెలు (పెద్ద క్రాకులు) పడేటట్లు చేసింది కేసీఆర్ కాదంటే తెలంగాణ సమాజం నమ్ముతుందా? ఈ నెర్రెలు అన్ని బ్లాకులకు, అన్ని కట్టడాలకు, అన్నారం, సుందిళ్ళ డ్యాంలకు కూడా పడవని గ్యారెంటీ లేదు. 2022లో ఒక మోస్తరు వరదలకే కన్నెపల్లి పంపు హౌజ్ కూలిపోయి 18 మోటార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పుడు ఆ పంపుహౌజ్ చూద్దామని వెడితే నన్ను మహదేవ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు కూడా. నాణ్యత విషయంలో ఇంతగా ఎందుకు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు రాజీపడ్డారు?
ఈ ప్రాజెక్టును పూర్తిగా అమలు చేస్తే (అన్నీ సక్రమంగా ఉంటే) డిజైన్ ప్రకారం నీళ్ళను ఎత్తిపోయడానికి మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిలో 46శాతం ఈ ప్రాజెక్టుకే కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు మన పరిశ్రమలు మూతపడతాయి. జనాలకు రోజుకు 10 గంటలు, వ్యవసాయ బోర్లకు కరెంటు కట్లు చూడాల్సి వచ్చేది. మన మొత్తం విద్యుదుత్పత్తిలో దాదాపు సగం ఈ ప్రాజెక్టుకు కేటాయించడం సాధ్యమయ్యే పనేనా? కాళేశ్వరం నీళ్ళ వల్లే వరి అత్యధికంగా పండిందని ఇంకో పెద్ద అబద్ధం ప్రచారం చేశారు. కానీ, 2023 అక్టోబరులో పిల్లర్లు కుంగిపోయాక మొత్తం ప్రాజెక్టు పూర్తిగా ఆపేసిన తరువాత కూడా 2023–24లో ఇంకా అధికంగా వరి ఉత్పత్తి పెరిగి, కొత్త రికార్డు 280 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. దీనివల్ల స్పష్టంగా తెలిసే విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మన ఉత్పత్తి పెరగలేదు.
కేసీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిపోయిందని అబద్ధం ఆడుతున్నారు. ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నా కూడా కవిత ఏమో ‘‘తెలంగాణకు కాళేశ్వరమే శ్రీరామరక్ష’’ అంటుంది. కేటీఆర్ ఏమో ‘‘కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టి మేడిగడ్డ ప్రాజెక్టుకు నెర్రెలు తెప్పించిండ్రు’’ అంటాడు. హరీష్‌రావేమో ‘‘రెండు పిల్లర్లు కుంగినాయి, ఇది చాలా చిన్న సమస్య’’ అంటాడు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపు హౌజులు, 1531 కిలోమీటర్ల కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి. కానీ నీళ్ళ లభ్యత, నీళ్ళు దొరికే మొట్టమొదటి బ్యారేజి మేడిగడ్డ. ఇక్కడ నుంచి నీళ్ళు మొదట అన్నారం బ్యారేజికి, తరువాత సుందిళ్ళ బ్యారేజీకి, అక్కడ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి బ్యారేజికి పంప్ అవుతాయి. అంటే మేడిగడ్డ బ్యారేజి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది. ఇది పనిచేయకపోతే మొత్తం ప్రాజెక్టు పనిచేయనట్టే. కానీ బీఆర్‌ఎస్ వాళ్లకు మాత్రం రాష్ట్రంలో కనిపించే అన్ని నీళ్ళు కాళేశ్వరం నీళ్ళే అనడం పరిపాటి అయ్యింది. ఇంజనీర్–ఇన్–చీఫ్ ఏమో కాళేశ్వరం కింద 98 వేల ఎకరాలు మాత్రమే పారిందంటే, హరీష్‌రావు 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాం అని, పాత ప్రభుత్వాలు కట్టిన ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ఆయకట్టునంతా కలిపి చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు.
మేడిగడ్డ బ్యారేజిని అర్జెంటుగా రిపేరు చేయాలి, ఇంకా మిగతా పనులు పూర్తి చేయడానికి 50వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి ఏటా లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి. మూడు బ్యారేజీలకు వాడిన సీకెంట్ పైల్స్ పద్ధతి గురించి కూడా ఆలోచించాలి. ఇవన్నిటి దృష్ట్యా అసలు ఈ ప్రాజెక్టు నడిపిస్తే ఉపయోగమేనా అనేది కూడా ప్రభుత్వం ఒక గట్టి స్వతంత్ర కమిటీ వేసి నిర్ణయిస్తే బాగుంటుంది. ఆ కమిటీలో ఒక ఐఐటీ ఇరిగేషన్ ప్రొఫెసర్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, ఒక ప్రముఖ సామాజికవేత్త ఉండాలి. అందరూ వేరే రాష్ట్రం వాళ్ళు అయితే బాగుంటుంది. కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే ఈ ప్రాజెక్టు పూర్తిగా మూసేస్తేనే బాగుంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి కడితే బాగుంటుందా అనేది కూడా ప్రస్తుత ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఈ ప్రాజెక్టు బీఆర్‌ఎస్ వాళ్ళు అంటున్నట్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాదు. ప్రపంచ నీటి పారుదల ఇంజనీర్లకు, మౌలిక సదుపాయ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) నిపుణులకు, బ్యాంకర్లకు ఒక పెద్ద కేస్‌స్టడీ. గత 50 సంవత్సరాల లిఫ్ట్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చరిత్ర చూసినట్లైతే... 90 శాతం ఎత్తిపోతల పథకాలు విజయవంతమైనట్టు ఎక్కడా కనపడలేదు. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, మంత్రులు కొంచెం జాగ్రత్తగా ప్రాజెక్టులు రూపొందించి, ప్రజాధనం వృథాను అరికట్టాలి.
ఆకునూరి మురళి
ఎంటెక్ (సివిల్), ఎన్‌ఐటీ, వరంగల్
మాజీ ఐఏఎస్ అధికారి
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి