Share News

బడివేళ ఉపాధ్యాయులకోమాట

ABN , Publish Date - Jun 11 , 2025 | 06:17 AM

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి కదులుతున్న ఉపాధ్యాయ లోకానికి స్వాగతం. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు ఇటీవలి వేసవి సెలవుల్లో ఎన్నో శిక్షణల్లో పాల్గొన్నారు. అక్కడ చెప్పిన విషయాలు మీ వాస్తవ పరిస్థితులకు ఎంత వేరుగా...

బడివేళ ఉపాధ్యాయులకోమాట

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి కదులుతున్న ఉపాధ్యాయ లోకానికి స్వాగతం. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు ఇటీవలి వేసవి సెలవుల్లో ఎన్నో శిక్షణల్లో పాల్గొన్నారు. అక్కడ చెప్పిన విషయాలు మీ వాస్తవ పరిస్థితులకు ఎంత వేరుగా ఉన్నాయో గుర్తించి ఉంటారు. శిక్షణ ఇచ్చిన వారిని మీరు సహృదయంతో అర్థం చేసుకుని, వారిని విసిగించకుండా ఆ శిబిరాలలో పాల్గొని ఉంటారు. మీరు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్చలు ఉంటే బాగుండని కొందరు ఉపాధ్యాయులు అనుకుంటే, చెప్పినా వినిపించుకునే వారు ఉండరని మరికొందరు మౌనంగా అనుసరించి ఉండిపోయి ఉంటారు. వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. రెండు నెలలుగా మూసి ఉన్న పాఠశాలలు– దుమ్ము ధూళితో, వెలిసిపోయిన గోడలు, పగిలిన కిటికీలు, అవసరానికి పనికిరాని టాయిలెట్లతో మీకు స్వాగతం పలుకుతాయి. కొన్ని గ్రామాలు–బస్తీలలో, కొన్ని పాఠశాలల ప్రాంగణాలలో బాధ్యతారాహిత్య వ్యక్తులు ‘దావతులు’ చేసుకుని తాగి పారేసిన సీసాలు, సిగరెట్ ముక్కలు, ఇతర వస్తువులతో నిండి.. మీలోని ఉత్సాహాన్ని తగ్గించడం సహజం. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు ఆహ్వానం పలకడానికి పాఠశాలలను శుభ్రం చేయించే బాధ్యత కూడా మీపై పడడం బాధాకరమే. విద్యాశాఖకు కళ్ళు, చెవులు మీరే. ఈ దుస్థితికి మీరే కారణం అనే అపవాదు కూడా మీపై వేస్తారు. క్షేత్ర స్థాయిలో మీరే ఉంటారు. మీ పై అధికారులు కనిపించరు.


ప్రభుత్వ బడి బాగుపడే స్థితి లేదనే నిరాశ నిస్పృహ లోకి కొంతమంది వెళ్తే, పట్టు వదలని విక్రమార్కుల లాగా సొంత నిధులను ఖర్చు చేసినవారు కొందరుంటారు. మరికొందరు ప్రైవేటు సంస్థలను బతిమలాడి, ఒప్పించి, తమ బడులను బాగు చేసుకునే పనిలో పడ్డారు. అభ్యుదయభావాలు గల ఉపాధ్యాయ సంఘాలు స్వచ్ఛందంగా విద్యార్థులతో కలిసి ప్రభుత్వ బడి పటిష్ఠతకు పూనుకుంటున్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా కొన్ని సార్లు పరిపాలనలో ఉన్న పెద్దలు ప్రభుత్వ బడిలో నమోదు తగ్గడానికి మిమ్మల్ని బాధ్యులను చేయడం, విద్యను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మెరుగుపరుస్తామనే రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం కూడా చూసే ఉంటారు. ఇది ఇలా ఉంటే త్వరలోనే వాట్సాప్ గ్రూపుల్లో అధికారుల ఉత్తర్వులను, సందేశాలను చూస్తారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, పాఠశాలలకు నోట్‌బుక్స్ తెచ్చుకునే వివరాలు, యూనిఫాంలు, జయశంకర్ బడిబాట, ‘మధ్యాహ్న భోజనం’ వివరాలు, వంద శాతం పాస్ ప్రణాళికలు... ఇవన్నీ అమలు చేయడం ఒక ఎత్తయితే వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం మరో ఎత్తు. కొన్ని ప్రాంతాలలో నెట్ కనెక్షన్ లేక చెట్లు, గుట్టలు ఎక్కి అప్‌లోడ్ చేసిన ఘటనలు కోకొల్లలు. ఇక మీరు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులైతే ఆ సవాళ్లు వేరే రకంగా ఉంటాయి. ఎండా కాలంలో కొత్త విద్యార్థుల వేటలో తిరిగి ఉంటారు. అది మీ ఉద్యోగ భద్రతలో భాగం అని మీ యాజమాన్యం చెప్పి ఉంటారు. విద్య వ్యాపారం అయిన చోట టీచర్లుగా కేవలం బోధన పైన దృష్టి పెట్టడం కష్టమే. ఇక గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సవాళ్ళు.. రోజుకో ఉత్తర్వుతో, అధికారుల కొత్త ఆలోచనలను అమలు చేయడంలో, తల్లిదండ్రులకు–అధికార యంత్రాంగానికి మధ్య సతమతమవుతూనూ బడులకు కదిలి ఉంటారు. సెలవుల తరువాత బడులకు వస్తున్న కొంతమంది పిల్లలు సినిమాల ప్రభావంతో, హీరోలు–క్రికెటర్ల స్టయిల్స్‌తో, కొత్త హెయిర్‌కట్‌లతో, కొత్త రకం డ్రెస్సులతో, అలాగే సోషల్ మీడియా ప్రభావంతో వస్తారు. సెలవుల్లో స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ టైం ఎక్కువగానే వాడి ఉంటారు. రీల్స్ చూసీ, చేసీ ఉంటారు. కొందరికి మత్తుపదార్థాల పరిచయం కూడా ఉండివుండొచ్చు! వీటన్నిటికీ పిల్లలు బాధ్యులు కారని గ్రహించాలి. ఈ పిల్లలతో మెలగాలంటే మీకు కొత్త నైపుణ్యాలు అవసరం కావచ్చు. పిల్లలపై, తల్లిదండ్రులపై ఆరోపణలు చేయడంలో ప్రయోజనం లేదు. ఇది కష్టమైన పని, కానీ అనివార్యమైనది. ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయులు పోషించిన పాత్ర చాలా ఉంది. మీ పాఠశాల్లోని పిల్లల తల్లిదండ్రులకు మీపై ఎంతో నమ్మకం ఉంది. విద్యతోనే విముక్తి అని బలంగా నమ్మి మీ పాఠశాలకు వాళ్ళ పిల్లలను పంపిస్తున్నారు. అధిక శాతం రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు. ఒంటరి మహిళల కుటుంబాలు లేదా నిత్యం హింసకు గురయ్యే కొంతమంది విద్యార్థుల తల్లులు. ఇన్ని ఇబ్బందులలో ఉన్న వాళ్ళు పిల్లలకు సమయం ఇవ్వకపోవడం వాళ్ళ పొరపాటుగా భావించవద్దు.


వాళ్ళు మీపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండడమే మీరు వాళ్ళకిచ్చే గౌరవం. పిల్లలు తెలివైనవారు, శక్తిమంతమైనవారు. వాస్తవ ప్రపంచం, వర్చువల్ ప్రపంచం రెండింట్లోనూ ఎదుగుతున్నవారు. వివిధ అలవాట్లకు లోనవుతున్నారు. పిల్లలు తమ భావోద్వేగాలను అర్థం చేసుకుంటూనే, అవి తగిన పరిమితులలో ఉండేలా మీరు మార్గనిర్దేశం చేయాలి. అంతేకానీ వారిని మానసిక–శారీరక శిక్షల ద్వారా, పదిమందిలో అవమానించడం ద్వారా క్రమశిక్షణలో పెడదామనుకోవడం పొరపాటని గ్రహించండి. అవును, మీ పని కష్టమైనది. ప్రతి రోజు గొప్పగా ఉండకపోవచ్చు. కానీ మీ మాటలకు జీవితాలను మార్చగల శక్తి ఉందని గుర్తుంచుకోండి. ఇతర ఏ వృత్తి నిపుణులకు అంత నమ్మకం ఉండదు. మీ పనిని ఎవరూ గుర్తించకున్నా, మీకు మీరే అభినందించుకోండి. మీ పనికి గుర్తింపు కోసం మీరు మీ గొంతు పెంచడం అవసరమే కానీ, మీరు బోధించిన విషయాన్ని అర్థం చేసుకోలేని విద్యార్థులపై గొంతు చించుకోవడం మాత్రం అనవసరం. ఒకటి రెండు సెలవులను వదులుకోవడం ఫరవాలేదు కానీ, చదువులో వెనుకబడుతున్న విద్యార్థిపై ఆశను వదిలేయడం మాత్రం తగదు. ప్రభుత్వాలు మీకు జీతాలు ఇవ్వవచ్చు, మౌలిక వసతులు కల్పించవచ్చు. కానీ పిల్లలు మీకు బోధించే హక్కును ప్రసాదిస్తారు. కావున ఉపాధ్యాయులుగా మీరు పిల్లల హక్కులకు కాపలాదారులై ఉండాలి. వారి నాణ్యమైన విద్యాహక్కును, రక్షణ హక్కును, మీరు ముందుండి రక్షించి, ప్రజాస్వామ్య పటిష్ఠతను బలంగా ప్రభావితం చేయగలరని ఆశిస్తూ..

ఆర్. వెంకట్ రెడ్డి

జాతీయ కన్వీనర్, ఎం.వి. ఫౌండేషన్

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 06:17 AM