Education System Flaws: వ్యవస్థ దోషాన్ని విద్యార్థులపై నెడతారా
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:59 AM
ప్రతి సంవత్సరం ఏదో ఒక సర్వే ద్వారా– మన రాష్ట్రం లోని విద్యార్థులు తెలుగు చదవలేరని, లెక్కలు చేయలేరని, 75 శాతం మంది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు శాతాలు చేయడం తెలియదని, ఆరవ తరగతి పిల్లలకు...
ప్రతి సంవత్సరం ఏదో ఒక సర్వే ద్వారా– మన రాష్ట్రం లోని విద్యార్థులు తెలుగు చదవలేరని, లెక్కలు చేయలేరని, 75 శాతం మంది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు శాతాలు చేయడం తెలియదని, ఆరవ తరగతి పిల్లలకు కూడికలు తీసివేతలు రావట్లేదనీ... ఇలా పత్రికల్లో ప్రధాన శీర్షికలు కనిపిస్తుంటాయి. కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన తాజా సర్వే కూడా ఇలాంటి ఫలితాలనే వెల్లడించింది. తర్వాత ఎప్పటి మాదిరిగానే పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడం లేదని, జాతీయ స్థాయి సగటు కంటే వెనుకబడి ఉన్నారని ఈ సర్వేలో తేలింది. మూడవ తరగతిలో ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు పెద్దగా తేడా లేకున్నా 6, 9 తరగతులలో ప్రైవేటు పాఠశాలలు అన్ని సబ్జెక్టులలోనూ సరాసరి 15 పాయింట్ల తేడాతో ముందున్నాయి. అసలు ఎవరీ చదువులో వెనుకబడుతున్న పిల్లలు అన్న ప్రశ్న వేస్తే సమాధానాలు మరింత నిర్దిష్టంగా లభించవచ్చు. ఈ సర్వేలో వివిధ సామాజిక వర్గాల పిల్లల సామర్థ్యాలను ప్రత్యేకంగా క్రోడీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థుల అన్ని సబ్జెక్టుల సామర్థ్యాల సరాసరి కేవలం 40 పాయింట్లతో 60 శాతం మంది వెనుకబడి ఉన్నారు.
ఈ పిల్లలు వెళ్ళే పాఠశాలలు ఎలా ఉన్నాయి, బోధన ఎలా ఉంది, అడవి ప్రాంతంలో గిరిజన బిడ్డలు వెళుతున్న బడులు ఎలా ఉన్నాయి, పట్టణ ప్రాంతాలలో బస్తీలలో ఉన్న బడులు ఎలా ఉన్నాయి... ఇవేవీ పరిగణించకుండా పిల్లల విద్యా సామర్థ్యాలను పరీక్షించి విద్యార్థులను దోషులుగా నిలబెట్టడం శోచనీయం. అన్ని సర్వేలూ పిల్లలకు చదువు రావటం లేదంటూ వారినే దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయే గానీ, ఈ దుస్థితి కారణం వ్యవస్థాపరమైన లోపాలేనని ఏ ఒక్క సర్వే చెప్పడం లేదు. విద్యా హక్కు చట్టం ఆదేశించినట్లుగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా, తగినంత మంది టీచర్లను పాఠశాల స్థాయిలో అందుబాటులో ఉంచకుండా, ఉన్న టీచర్లకు తగిన బోధనా సమయాన్ని కేటాయించకుండా విద్యార్థులకు ఈ మూల్యాంకనం చేయడంలో అర్థం లేదు. ఉపాధ్యాయులు ఉన్నట్లుగానే అనిపించినా వారు మెటర్నటీ లీవ్, మెడికల్ లీవ్, ఎడ్యుకేషన్ లీవ్‌లో ఉన్న పాఠశాలలు, వీటితోపాటు ఏకోపాధ్యాయ టీచర్లు ఉన్న పాఠశాలలు... ఇలాంటి లోటుపాట్లను వెలికితీయడానికి సర్వేలు నిర్వహించాలి. సెలవులలో వెళ్ళిన టీచర్ల స్థానంలో మరో టీచర్‌ను నియమించే విధానమే లేని వ్యవస్థ మనది. చాలాసార్లు సబ్జెక్ట్ టీచర్లు లేకుండానే విద్యా సంవత్సరాలు గడిచిపోతుంటాయి. రాష్ట్రంలో 5985 ఏకోపాధ్యాయ పాఠశాలలలో దాదాపు 88,429 మంది విద్యార్థులు నమోదు అయినట్లు గణాంకాలు ద్వారా తెలుస్తున్నది. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే విద్య లేదనే అర్థం చేసుకోవాలి. ఆ ఒక్క టీచరు ఉన్నా లేనట్లే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే రాష్ట్రంలో 70 శాతం స్కూల్స్ (12,760) మూడు కంటే తక్కువ గదులతో ఉన్నాయి. అంటే రెండు మూడు తరగతుల విద్యార్థులను కలిపి కూర్చోపెడుతున్నారు. ఒకే తరగతిలో ఒకే క్లాస్ పిల్లలు కూర్చుంటేనే బోధన చేయడం అంతంత మాత్రం. అలాంటిది ఈ మిశ్రమ తరగతి గదులలో బోధన ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహించటం కష్టం కాదు! విద్యార్థులకు నిర్వహించే మూల్యాంకనం మీద ఈ పరిస్థితి ప్రభావం పడనే పడుతుంది. 25 శాతం స్కూళ్లలో మూత్రశాలలు లేవని నివేదికలు చెపుతున్నాయి. ప్రతి రోజు మీడియా ద్వారా కూడా తెలుస్తూనే ఉంది.
ఇలాంటి పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు మూల్యాంకనం నిర్వహించి, వీరి సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించడం హాస్యాస్పదమే. అలాగే ఈ పాఠశాలలన్నీ వెనుకబడిన వర్గాల కుటుంబాలు నివసించే ప్రాంతాలేనన్నది ఇక్కడ గమనార్హం. పిల్లలందరికీ నాణ్యమైన విద్యా సామర్థ్యాలు అందించడం సమానత్వానికి, సమన్యాయానికి సంబంధించిన విషయం. అందరికీ సమానమైన విద్యను అందించాలనే రాజ్యంగ మూల సూత్రాలకు సంబంధించిన అంశం. అసమానమైన విద్యా వ్యవస్థలను నెలకొల్పి విద్యార్థులు అందరికీ ఒకే రకమైన మూల్యాంకనయం చేయడం సమన్యాయ సూత్రాలకు విరుద్ధమే! విద్యార్థులు అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే వారు వెనుకబాటుతనం నుంచి బయటపడి గౌరవప్రదమైన జీవనం సాగిస్తారు. ఇంత ముఖ్యమైన అంశం ఎప్పుడూ ప్రధాన రాజకీయ చర్చకు రాకపోవడం విచారకరం. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే తరం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అత్యధిక శాతం పౌరులు చదవడం రాయడం రాని, బడికెళ్లిన నిరక్షరాస్యులుగా, నైపుణ్యాలు లేని కార్మికులుగా మిగిలిపోతారు. ప్రతిసారీ పిల్లల మీద మూల్యాంకనం చేసి వారిని దోషులుగా నిలబట్టే కన్నా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఈ పరిస్థితికి కారణం అని గమనించి విద్యా వ్యవస్థను పటిష్టం చేయవలసిన చట్టబద్ధ బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది.
ఆర్. వెంకట్‌రెడ్డి
ఎం.వి. ఫౌండేషన్ జాతీయ కన్వీనర్
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి