Share News

చదువు కొంటున్న విద్యార్థులు

ABN , Publish Date - May 15 , 2025 | 02:12 AM

‘ప్రభుత్వ బడి పటిష్ఠత అంటే పిల్లలకు విద్యనందించడమే కాదు వారిని పేదరికం నుంచి దూరం చేయడం’ అని అమర్త్యసేన్ ఉవాచ. ప్రభుత్వ విద్యపై ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ వహించడం లేదనేది వాస్తవం. ఇటీవల ముఖ్యమంత్రి హాజరైన ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభోత్సవ సభలో ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ...

చదువు కొంటున్న విద్యార్థులు

‘ప్రభుత్వ బడి పటిష్ఠత అంటే పిల్లలకు విద్యనందించడమే కాదు వారిని పేదరికం నుంచి దూరం చేయడం’ అని అమర్త్యసేన్ ఉవాచ. ప్రభుత్వ విద్యపై ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ వహించడం లేదనేది వాస్తవం. ఇటీవల ముఖ్యమంత్రి హాజరైన ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభోత్సవ సభలో ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ, ‘ఈ స్కూల్‌ ఏదో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల లాగా కాదు...’ అని ప్రభుత్వ పాఠశాలలను తృణీకరించేలా మాట్లాడారు. పైగా ఆ పాఠశాలలో ప్రారంభ ఫీజు రూ. లక్షా అరవై వేలుగా తెలిపారు. ఇదంతా సీఎం సమక్షంలోనే జరుగుతున్నా ఆయన వారించలేదు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సీఎంకు ఫీజులను నియంత్రించే ఆలోచన లేదా?

ఈ కారణంగానే రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పట్ల విశ్వాసం కోల్పోయి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు విద్య వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. 2022–25 మధ్య ప్రైవేట్‌ స్కూళ్లు ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని ఈ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు వెల్లడించారు. ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని 93 శాతం మంది అభిప్రాయపడ్డారు.


తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సమాజంలోని అసమానతలకు తగినట్లుగానే రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొచ్చాయి. రాష్ట్రంలోని దాదాపు 36 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాల్లో చదువు‘కొంటున్నారు’. తల్లిదండ్రులకు ఫీజుల భారం వర్ణనాతీతం. జూన్‌లో స్కూళ్లు తెరుస్తున్నారంటే వారిలో గుబులు. గత సంవత్సరం కట్టని ఫీజులు, కొత్త విద్యా సంవత్సరంలో కట్టాల్సిన ఫీజుల గురించి తలచుకుని వారు ఎంతో మానసిక వేదనకు గురవుతుంటారు. తల్లిదండ్రులు తమ ఫీజుల కోసం పడుతున్న కష్టాలను తెలుసుకుని బడి మానేస్తామని తెలిపే పిల్లలు కూడా ఉన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుండా ఏటా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, నోట్‌బుక్స్, టై, బ్యాడ్జిలు, స్పోర్ట్స్ డ్రస్ అన్నీ తమ వద్దే కొనాలని నిర్బంధం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వం పటిష్ఠమైన నియంత్రణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడం విచారకరం. ఆర్థిక వనరులు లేని కారణంగా తమ పిల్లలను మరో స్కూల్లో వేస్తామంటే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఒప్పుకోవు. ఫీజులు మొత్తం కట్టలేదని టీసీలు ఇవ్వకపోవడం, పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వక పోవడం, ఫీజులు కట్టని పిల్లలను ఇంటికి పంపించడం, ఎండలో నిలబెట్టడం, తోటి పిల్లల ముందు అవమానపరచడం వంటివి రోజూ వింటున్న విషయాలే. ప్రైవేటు స్కూళ్ల ఆగడాలను తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారి పిల్లలను వేధింపులకు గురి చేయడమూ మామూలే. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తోచని పరిస్థితి. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో ఏటా దాదాపు రూ.18 వేల నుంచి 20వేల కోట్ల వరకూ విద్యా వ్యాపారం నడుస్తోంది.


ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకం, ఇతర విషయాలను గురించి విద్యాహక్కు చట్టం చాలా స్పష్టంగా పేర్కొన్నది. షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనలు అమలు చేయకపోతే ఆ స్కూల్‌ గుర్తింపు రద్దు చేయాలని, క్యాపిటేషన్ రుసుం, డొనేషన్లు వసూలు చేస్తే అంతకు పదిరెట్ల వరకు ఆయా స్కూళ్లకు జరిమానా విధించాలని, పిల్లలకు ప్రవేశ పరీక్ష పెడితే రూ.25 వేల నుంచి 50 వేల వరకు జరిమానాలు విధించవచ్చని చెబుతోంది. అలాగే ప్రతి పాఠశాలలో ప్రారంభ తరగతి నుంచి 25 శాతం సీట్లు వెనుకబడిన వర్గాల పిల్లలకు ఇవ్వాలని ఈ చట్టం తెలుపుతోంది.

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు నియంత్రణ చట్టాన్ని రూపొందించాలనే సిఫార్సు కూడా ఉంది. గత బడ్జెట్ సమావేశాలలో ఈ చట్టం ప్రవేశపెడుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ ఈ బిల్లు చర్చకు రాలేదు. ప్రైవేటు విద్యా సంస్థలు పెట్టి రాజకీయాలలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రైవేటు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకుంటున్న ఘనులు ఉన్న రాష్ట్రం మనది. అందుకే ఈ ఫీజులను నియంత్రించే సాహసం చేయరనే అభిప్రాయం కూడా ఉంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వాలను శాసించే స్థాయికి వెళ్ళాయి!

ప్రభుత్వ విద్యను పటిష్ఠం చేయడమే ఈ సమస్యలన్నీటికి పరిష్కారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంత కాలానికి ప్రభుత్వ బడులు చరిత్ర పుటల్లోనే మిగిలిపోయే ప్రమాదం ఉంది. విద్యా హక్కు చట్టం స్ఫూర్తితో ప్రభుత్వ విద్య పటిష్ఠం చేసేందుకు, ఫీజుల నియంత్రణ చట్టం అమలుకు ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఆర్. వెంకట్‌రెడ్డి

జాతీయ కన్వీనర్, ఎం.వి. ఫౌండేషన్

ఇవి కూడా చదవండి..

BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..

India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 15 , 2025 | 02:12 AM