వర్సీటీల ప్రమాణాల్ని దిగజార్చే నిర్ణయాలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:38 AM
ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మానవవనరుల అభివృద్ధిలో కీలకభూమిక పోషించవలసిన అవసరం ఉంది. గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్యారంగం...

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మానవవనరుల అభివృద్ధిలో కీలకభూమిక పోషించవలసిన అవసరం ఉంది. గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్యారంగం అధోగతిపాలైన సంగతి ప్రజానీకానికి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉన్నత విద్యారంగం పటిష్టంగా అవతరిస్తుందని మొత్తంగా మేధోవర్గం ఆశించింది. అయితే నూతన విద్యావిధానంతో వచ్చిన సంస్కరణలు గందరగోళం సృష్టించగా, యూజీసీ మార్గదర్శకాలు–2025 మరింత వివాదాస్పదంగా మారాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా అధ్యాపక, ఉద్యోగ వర్గాల్లో, విద్యార్థి సంఘాల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని సీనియర్ ఆచార్యుల్ని పక్కనబెట్టి సాంప్రదాయ విశ్వవిద్యాలయాలకు ఐఐటీల నుంచి, ఎన్‌ఐటీల నుంచి ఉపకులపతుల్ని నియమించే దిశగా సెర్చ్ కమిటీల సిఫారసులు జరుగుతుండటం దిగ్భ్రాంతికరం. సాంకేతిక నిపుణుల్ని ఉపకులపతులుగా తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం తలమునకలు కావడం రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఆచార్యుల్ని ఆందోళనకు గురిచేస్తున్నది. సామాజిక శాస్త్రాలు, భాషా సాహిత్యాలు, చిత్రకళలు, ప్రదర్శనకళలు, న్యాయశాస్త్రం, విద్యాబోధన కళాశాలలు, కామర్స్, మేనేజ్‌మెంట్, పరిశోధన కేంద్రాలు, దూరవిద్య కేంద్రాలు, క్రీడలు, వ్యాయమవిద్య విభాగాలు వంటి సమస్త మానవశాస్త్రాలు గల రాష్ట్ర విశ్వవిద్యాలయాల విషయంలో ప్రభుత్వ తీసుకుంటున్న ఈ నిర్ణయం సరైనది కాదు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్ని ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు ఐఐటీ, ఎన్‌ఐటీ ఆచార్యుల్ని ఉపకులపతులుగా నియమించడం ఒక్కటే పరిష్కారం కాదు. విశ్వవిద్యాలయాలు అంటే కేవలం ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే కాదు, ఇక్కడ సకలశాస్త్రాలు వుంటాయి.
వీటికి తోడు రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించే యూజీసీ – 2025 ముసాయిదా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమైన ఈ నిర్ణయం రాష్ట్ర విశ్వవిద్యాలయాల మీద జరుగుతున్న పెద్ద కుట్రగా మేధోవర్గం పేర్కొంటుంది. యూజీసీ మార్గదర్శకాలు–2025తో విశ్వవిద్యాలయాల్లో నియామకాలు, పదోన్నతుల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. జాతీయ విద్యావిధానం సిఫార్సు మేరకు కాలానుగుణంగా ఉన్నతవిద్యలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక సిబ్బంది కొరత తీవ్రలోటుగా వుంది. దేశ ఉజ్వల భవిత కోసం ప్రతిభ గల అధ్యాపకుల్ని నియమించి యువతను తీర్చిదిద్దాలని యూజీసీ సిఫార్సు చేసింది. ఇందుకు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు చొరవ తీసుకోలేకపోతున్నాయి. 2008 నుంచి ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలకు 2017లో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని అప్పటి ప్రభుత్వం రెండు ప్రకటనలు ఇచ్చి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇవి న్యాయస్థానాల్లో కేసుల కారణంగా భర్తీ చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికలకు ఆరు నెలల ముందు అస్తవ్యస్తంగా ఒక ప్రకటన విడుదల చేసి నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి దుకాణం బంద్ చేసింది. చెదురుమదురుగా ప్రత్యామ్నాయదారుల్లో అక్కడక్కడా వచ్చిన ఏక సంఖ్య అధ్యాపకులు మినహా సుమారు పదిహేడేళ్ళ నుంచి ఏపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆలోచన చేయకుండా పదిమంది చేసే పనిని ఒక్కరి మీదకే నెట్టి, విశ్వవిద్యాలయాలు ర్యాంకులు సాధించాలంటే సాధ్యం కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ టు బి యూనివర్శిటీల నుంచి ఆచార్యులను రాష్ట్ర విశ్వవిద్యాలయాల నియామకాల సెర్చ్ కమిటీల్లో సభ్యులుగా నియమించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆచార్యులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సెర్చ్ కమిటీ సభ్యులుగా వుండి ఉపకులపతుల్ని ఎంపిక చేస్తారా! ఇదేమి వింత సంప్రదాయం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే ఎక్కువశాతం మంది ప్రవేశిస్తున్నారు. వీరిలో తెలుగు మీడియం విద్యార్థులే అధికశాతం మంది ఉన్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్నవారి శాతమే ఎక్కువ. వీరు ఉపకారవేతనాలతో చదువులు కొనసాగిస్తున్నారు. యూజీసీ, ఇతర ఫండింగ్ ఏజెన్సీల స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్‌లతో చదువులు, పరిశోధనలు కొనసాగించేవారి సంఖ్య నామమాత్రమే. అంతేగాకుండా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వాలు సమకూర్చే మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. ఇన్ని అడ్డంకులను అధిగమించి ఏపీ విశ్వవిద్యాలయాల్ని ప్రగతిపథంలో నడిపించాలంటే ప్రభుత్వం మేధావుల సూచనలను పరిగణలోకి తీసుకొని అమలు చేయాలి. అప్పుడే ప్రజలూ, ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేరుతాయి.
డాక్టర్ జీకేడీ ప్రసాదరావు
ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్,
ఆంధ్ర విశ్వవిద్యాలయం
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
For National News And Telugu News