Skilled Trades Are the Future: నైపుణ్యం కలిగిన వృత్తులకే భవిష్యత్తు
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:02 AM
‘దశాబ్దాలుగా మన సమాజం ‘డెస్క్ ఉద్యోగాలే గొప్పవి’ అనే భ్రమలో జీవించింది. కానీ ఇప్పుడు ఏఐ తెచ్చిన మార్పులు ఆ భ్రమను చెరిపేస్తున్నాయి’ అంటూ ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఏఐతో భర్తీ చేయడం సాధ్యం కానివి...
‘దశాబ్దాలుగా మన సమాజం ‘డెస్క్ ఉద్యోగాలే గొప్పవి’ అనే భ్రమలో జీవించింది. కానీ ఇప్పుడు ఏఐ తెచ్చిన మార్పులు ఆ భ్రమను చెరిపేస్తున్నాయి’ అంటూ ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఏఐతో భర్తీ చేయడం సాధ్యం కానివి నైపుణ్యం కలిగిన వృత్తులు. ప్లంబర్ చేతితో సరిచేసే లీకేజీలు, ఎలక్ర్టిషియన్ పరిష్కరించే వైరింగ్ సమస్యలు, మెకానిక్ స్వయంగా గుర్తించే లోపాలు... వంటివి పుస్తకాల్లో నేర్చుకునే సిద్ధాంతాలు కావు. ఇవి ఏఐ ఆల్గారిథమ్‌లు పరిష్కరించలేని పనులు! ‘చూడగానే సమస్యను అర్థం చేసుకోవడం, దానికి తక్షణ పరిష్కారం కనుగొనడ’మనే ఈ సహజ బుద్ధి, అనుభవశక్తి, హస్త కౌశలం యాంత్రీకరణకు సాధ్యం కాదు.
‘ఫోర్డ్‌లో ప్రస్తుతం 5వేల మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి సంవత్సరానికి 1,20,000 డాలర్ల వరకు జీతం ఇస్తున్నా, సరైన నైపుణ్యం కలిగినవారు దొరకడం లేదు’ అని ఫోర్డ్ మోటార్స్ సీఈఓ జిమ్‌ఫార్లీ అనడం చూస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘2030 నాటికి కేవలం తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతాయి’ అంటూ డెలాయిట్– మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది. దాంతో వచ్చే ఆర్థిక నష్టం 1 ట్రిలియన్ డాలర్లు అని తెలిపింది. ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సంకేతం.
ఈ పరిస్థితిని అధిగమించడానికి మన దేశంలో చేయాల్సినవి: ప్రైమరీ నుంచి యూజీ వరకూ అన్ని స్థాయిల్లో వృత్తి శిక్షణను తప్పనిసరి చేయాలి. ఐఐటీలు, పాలిటెక్నిక్‌లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు వృద్ధి చేయాలి. జర్మనీ, జపాన్ వంటి దేశాల వలే నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని గౌరవించడం మనమూ నేర్చుకోవాలి. నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రోత్సహించేందుకు మెరుగైన వేతనాలు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, కెరీర్ గ్రేడేషన్.. వంటివి అందించడం ద్వారా యువతను ఈ రంగం వైపు ఆకర్షించాలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఏఐ ఒక పెద్ద సవాల్. కానీ నైపుణ్య వృత్తులకు కాదు. వృత్తి నైపుణ్యం గలవారు లేకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు. విద్యా వ్యవస్థ, ప్రభుత్వం, తల్లిదండ్రులు.. అందరూ ఒక కొత్త దృక్పథాన్ని స్వీకరించాల్సిన సమయం ఇది.
ముద్దం నరసింహస్వామి
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ