Share News

Raj Bhavan Name Change: పేరుమార్పుతో సరా

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:21 AM

వలసపాలనాకాలపు వాసనలను వదిలించుకొనే పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్‌ పేరును లోక్‌భవన్‌గా మార్చాలని...

Raj Bhavan Name Change: పేరుమార్పుతో సరా

వలసపాలనాకాలపు వాసనలను వదిలించుకొనే పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్‌ పేరును లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్రం నుంచి సూచన పేరిట ఆదేశాలు అందడంతో రాష్ట్రాలు ఆ పనిలో ఉన్నాయి. పేరులో ఏమున్నది, మార్చితే పోయేదేమున్నది అనుకోవచ్చును గానీ, అంతా పేరులోనే ఉందని అనుకోబట్టే కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినమాట నిజం. పేరు మార్చినంతనే ప్రయోజనం లేదు, పేరు కాదు, ముందు బుద్ధి మారాలి, మీ తీరుమారాలి అని తమిళనాడు పాలకుడు స్టాలిన్‌ వంటివారు గిల్లుతున్నారు కానీ, పేరు మార్పుతో తమకు మరింత మన్నన దక్కుతుందని, రాజకీయ పెన్నిధి సమకూరుతుందని బీజేపీ నమ్ముతోంది.

కొత్త నామఫలకం తీర్చిదిద్దిన ఆ భవనంలో ఇకముందు కూడా ఉండేది, ఉండబోయేది ఆ గవర్నరే. మారింది నివాసం పేరే కానీ ఆ వ్యవస్థ కాదు. గవర్నర్‌ వ్యవస్థే బ్రిటిష్‌ వలసపాలనా కాలం అవశేషం. బ్రిటిష్‌కాలంలో గవర్నర్లంటే అధికారం, అహంకారం, అణచివేత, అమానుషత్వాల కలబోత. ఆ వ్యవస్థను మనం ఇంకా కొనసాగించుకుంటూ, మరోపక్క కేవలం పేరుమార్చడం ద్వారా అది ప్రజలపక్షమని సందేశం ఇవ్వదల్చుకున్నట్టు ఉంది. రాజ్‌ స్థానంలో లోక్‌ అనడం ద్వారా దీనిని జనభవనంగా జనులందరూ విశ్వసించాలని కేంద్రం ఆలోచన కావచ్చు. బాగానే ఉంది కానీ, జనంతో ప్రత్యక్ష సంబంధం లేని, వారు నేరుగా ఎన్నుకోని, ఇంకా చెప్పాలంటే ప్రజలకు పరిచయం కూడా లేని గవర్నర్‌ అధికారిక నివాసాన్ని ప్రజాభవనంగా నామకరణం చేయడంలో ఔచిత్యమేమిటని లోకుల అనుమానం.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా, తమకు నచ్చినవారిని, సైద్ధాంతికంగా తాము మెచ్చినవారిని ఈ పదవిలో నియమిస్తుంది. వారు మేధావులు కావచ్చు, సకలవిద్యాపారంగతులు కావచ్చును కానీ, ప్రధానంగా ప్రధాని ఎంపికలో తమ మాట వినే లక్షణం పనిచేస్తుంది. ఆయన సూచనమేరకు రాష్ట్రపతి వద్దు కాదు లేదు వంటి సంశయాలకు తావు ఇవ్వకుండా ఆ నియామకాలు జరుపుతారు. రాష్ట్రపతికి నచ్చినంతకాలం గవర్నర్లు పదవిలో ఉంటారు తప్ప, ప్రజలు మెచ్చినంతకాలం కాదు. తన నియామకంతో సంబంధంలేని ప్రజలకు సహజంగానే గవర్నర్‌ జవాబుదారీ కాదు. వారు తనకు ఓటువేయరు కనుక, నేరుగా బాధ్యత వహించాల్సిన బాధ కూడా లేదు. ఆయన జవాబు చెప్పుకోవాల్సింది రాష్ట్రపతికీ, కట్టుబడాల్సింది రాజ్యాంగానికే. ప్రజలు ఎన్నుకొనే పార్టీలు, అవి ఏర్పాటు చేసే ప్రభుత్వాలు, మంత్రివర్గాలు మాత్రం ప్రజలకు తలవంచాలి, శాసనసభకు జవాబు చెప్పుకోవాలి, ప్రజాభీష్టానికి తలొగ్గాలి. కేవలం సమన్వయకర్తగా, కేంద్రం దూతగా, నామమాత్రపు పాలకుడుగా ఉంటున్న గవర్నర్‌ ఇంటిని జనభవనం అనడం జనానికి సరైనదిగా కనిపించడం లేదు.


విపక్షాల విమర్శలను అటుంచితే, కేంద్రం ప్రతిపాదించిన ఈ మార్పుకు పౌరసమాజం నుంచి, సామాన్యజనం నుంచి సానుకూల స్పందన రాకపోవడానికి కారణం గవర్నర్‌ వ్యవస్థ పనితీరు. అస్మదీయులే గవర్నర్లుగా నియమితులవుతారు కనుక డబుల్‌ ఇంజన్‌ సర్కార్లకు ఏ సమస్యా రాకపోవడం సహజం. కానీ, విపక్షపార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు మరొక ప్రత్యామ్నాయ పాలనావ్యవస్థగా తయారై, ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. తమిళనాడు నుంచి పశ్చిమబెంగాల్‌ వరకూ గవర్నర్లు తామే ప్రతిపక్షంగా, ప్రతిపక్షనాయకుడిలాగా వ్యవహరిస్తూ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను విమర్శించడం, ఘర్షణపడుతూండటం, బిల్లులను తొక్కిపెట్టి, ఎటూ తేల్చకుండా వదిలేసి పాలనను స్తంభింపచేయడం గమనిస్తున్నాం. ‘రాజ్‌’ అన్నది రాజరికాన్నో, బ్రిటిష్‌ రాజ్యాన్నో ప్రతిబింబిస్తున్నదని, గవర్నర్‌ను అలా చూడటం, ఆయన నివాసాన్ని రాజభవనం అనడం తగదని కేంద్రం అనుకుంటున్నందుకు సంతోషించాల్సిందే. అది పాలకుడి భవనం కాదు, ప్రజల భవనమనీ, ప్రజాసేవకుడి భవనమనీ కేంద్రం సందేశాన్ని ఇవ్వదల్చుకున్నందుకు మెచ్చాల్సిందే. తదనుగుణంగా ఈ అమృతభారతంలో గవర్నర్‌ వ్యవస్థను ప్రజానుకూల, ప్రజాకేంద్రిత వ్యవస్థగా సరిదిద్దాలి. గవర్నర్‌ అధికారాలు, విధులు, బాధ్యతల్లో మార్పులేవీ లేకుండా, వారి వ్యవహారశైలి అలాగే కొనసాగుతూంటే, కేవలం ఇంటిపేరుకు జనాన్ని తగిలించినమాత్రాన వారు పండుగ చేసుకోలేరు. ‘లోక్‌భవన్‌’ అన్నందుకు ఆ మార్పు కనబడాలి.

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 04:21 AM